2791* వ రోజు ....           07-Jun-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వద్దనే వద్దు!

2791* వ వీధి పారిశుద్ధ్య వివరాలకు స్వాగతం!

          ఆంగ్ల కాలమానమునుబట్టి ఈ బుధవారపు (07.06.2023) వేకువ 4.30 కు కాక - 4.18 కే - ఇంచుమించుగా నిన్నటి బందరు రాదారి యందే ఆ కృషి ప్రారంభమయ్యెను! ప్రారంభకులు ఏడెనిమిది మందే కావచ్చు గాని ప్రమేయమున్న కార్యకర్తలందరి సంఖ్య ఇరువదిన్నొక్కటీ, అందుకదనముగా ఇద్దరు ట్రస్టు కార్మికులున్నూ!

          ఇక ఊరికి పనికొచ్చే నేటి పని వివరములందురా? వానికేమి - ఎన్ని పేజీలైనను నిండును! ఐననూ - రాసి కన్న వాసే ముఖ్యము గానూ, పారిశుద్ధ్య కార్మికుల చిత్తశుద్ధే  ప్రముఖము గాను భావించే యెడల

          అసలు దాదాపు ఆదివారపు చోటులోనే మరొక పర్యాయము కార్యకర్తలెందుకు పనిలో దిగవలసెను? ఈ రెండు నాళ్లకే సదరు సుందరీకృత ప్రదేశంబున మరలా దుమ్మూ ధూళీ వ్యర్థాలు చేరినందుననే గదా! ఆ దినంబున రాక నేడు వచ్చిన మరికొద్ది మందికాచోటు స్వచ్ఛ పరచక తప్పదని పించియే గదా!

          ఇదిగో - ఈ ప్రకారంబున - మరలా పిల్లల వైద్యశాల మొదలు - మునసబు వీధి పర్యంతమూ ఇంకొక మారు ఈ బందరు జాతీయ రహదారి అదృష్టము పండెను! ఈ వంద గజాల వీధి సుందరీకరణ నిమిత్తమై కార్యకర్తల బట్టలు చెమటతో తడిసిన తడియు గాక - వీధి ఉత్తర దిశలోని మురుగు కాల్వను క్రమ్ముకొన్న పిచ్చి (మురుగుడు) తీగలూ, త్రాగేసిన కొబ్బరి బొండములూ, దిక్కుమాలిన ప్లాస్టిక్ తుక్కులూ, ఐస్క్రీము బండి తాలూకు సకల వ్యర్ధములూ తొలగి వీధియన్న ఈ స్వచ్ఛ శుభ్ర - సుందర - బందరు వీధేయని మీకనిపించుట లేదా?

          మరియూ ఈ 2791* నాళ్ల శ్రమ ఫలితము గుర్తించి కూడ ఇకనైనా తమ వంతుగా ఈ స్వచ్చ - సుందర సంస్కృతిలో దిగవలెనని ఇప్పటి దాక పట్టించుకోని గ్రామస్తులకనిపించదా?

ఇక ఈ నాటి 1-2-3 విశేషంబుల గురించి:

1) కార్యకర్తల ముఖ్య ఆయుధములైన పదునారు కత్తులలో ఒక్కటి నష్టపడుట;

2) 6.15 పిదప మునసబు, సజ్జా వీధులలో ప్రతిధ్యనించునటుల - శివరామపురీ నివాసియగు ప్రేమానందుడు ముమ్మారు స్వచ్ఛ - సుందరోద్యమ నినాదములుచ్ఛరించుట;

3) కార్యకర్తలకు పంచుటకై ఉడత్తు రామారావు గారు ఆదివారమే పంపిన బిస్కట్ల పొట్లాలను కారణాంతరమున ఈ రోజు పంచుట;

4) గత పది నాళ్లవలె గాక - వాతావరణ భగభగలు నేడు కొంత శాంతించుట;

5) ఇక ఇందు మూలముగా కార్యకర్త లెల్లరకు తెలియజేయునదేమనగా - రేపటి వేకువ కూడ మునసబు - సజ్జా వీధుల వద్దనే అందరమూ కలుసుకోవలెనని!

          దశాబ్దాలె పట్టవచ్చు!

పట్టవచ్చు నొకో మారు పదేళ్లైన ఒకో పనికి

క్షుణ్ణంగా ఒక ఊళ్లో శ్రమ సంస్కృతి మప్పేందుకు

అదీ గాక శ్రమదానం ఐచ్ఛికమైనందు వల్ల

గ్రామస్తుల కదలికలకు దశాబ్దాలె పట్టవచ్చు!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   07.06.2023.