2795* వ రోజు ....           12-Jun-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వద్దనే వద్దు!

మళ్లీ యాక్షన్ లో దిగిన రిస్కీ టీం - 2795*

          టీమ్ సభ్యులు 4+1+1 ఐతే పని వేళ 4.29 - 6.05; పని చోటు - బెజవాడ బాటలో 6 వ నంబరు పంటకాల్వ మొదలు - క్రొత్త అపార్ట్మెంట్ల పర్యంతం; తేది 12-6-23, సోమవారం!

          పని స్వభావం బెట్టిదనిన –

          నిన్నటి వాయుదేవుడి పరాక్రమానికి విరిగి రహదారి కడ్డంగా పడిన చెట్టు కొమ్మల్ని తొలగించి, వాహనాలకు సౌకర్యం కలిగించుట – అందుకు గాను కత్తులో – గొడ్డలో – సమయానుగుణంగా వాడుట!

          పెద్ద కొమ్మల్ని విడదీసి, ట్రక్కులో కెక్కించుట వగైరా! మరి - ఈ ఐదారుగురి శ్రమకి మూల్యం? అనగా – కూలి, ప్రతిఫలం వంటివి?

          స్వచ్ఛ చల్లపల్లిలో తొమ్మిదేళ్లుగా నడుస్తున్న శ్రమదానాని కవేవీ వర్తించవే! సమాజానికి తమ వంతుగా తోడ్పడుతున్న ఈ కార్యకర్తలకు ఆత్మ సంతృప్తి అనే ప్రతిఫలం ఎప్పుడైనా దొరుకుతున్నదే!

          “మరి - ఇంకెన్ని దశాబ్దాలు ఈ ప్రజోపకారం?” అంటే - ఏనాటికైనా గ్రామస్తులు – తండోప తండాలుగా ఊరుమ్మడి కార్యక్రమాల్లో కార్యకర్తలతో చేతులు కలిపేదాకా!

          పని ముగించాక – ఈ చిన్న బృందం చేయెత్తి - ఎలుగెత్తి BSNL నరసింహ కార్యకర్తననుసరించి గ్రామ స్వచ్ఛ - సుందరోద్యమ నినాదాలు ప్రకటించారు.

          కర్మవీరులుండరు గద

ఆశిస్తది ప్రతి గ్రామం స్వఛ్ఛ శుభ్రతల కోసం –

హరిత మనోహరములైన రహదారుల నిమిత్తం

కాని - చల్లపల్లి వలే కర్మవీరులుండరు గద

బ్రహ్మ ముహుర్తాన లేచి గ్రామ బాధ్యతలు తీర్చగ!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   12.06.2023.