2797* వ రోజు ....           14-Jun-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వద్దనే వద్దు!

కష్టమైన పారిశుద్ధ్య పనులు - ఇష్టంగా, స్పష్టంగా - @2797*

          ఎవరా గ్రామ సామాజిక బాధ్యతామూర్తులు? ఎక్కడ అంతటి శ్రమ - సమయ దానకర్ణులు? అట్టి నేలబారు మనుషులది ఏ ఊరు? ఎందరు - ఏమా కథ? అనగా.....

          బుధవారం - పదునాల్గవ జూన్ మాసం - 2023 వ సంవత్సరం - వేకువ 4.10 సమయం - చల్లపల్లి బందరు రహదారిలో మునసబు వీధి – ‘హేమా మోహనపర్యంతం - వ్యక్తులు 24 ½ మంది – (చివరి అర లెక్క - ఆలస్యంగా వచ్చి - అరకొరగా కష్టించిన నాదే!)

          ఈ చల్లపల్లిలో తొమ్మిదేళ్ల స్వచ్ఛ సుందరీకరణ వ్యసనం మరీ లోకోత్తర ఘనకార్యమనో ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ ఆదర్శమనో చెప్పాలని కాదు - ఆమాట కొస్తే ఏ ఒక్క కార్యకర్తా తనది కనీస సామాజిక కర్తవ్యమనే తప్ప - అద్భుత సేవ అని భావించడు! కాకపోతే మనకు తెలిసినంతలో ఈ భూప్రపంచంలో ఎక్కడా ఈ పాటి కృషి జరగడం లేదనేది వాస్తవమే కావచ్చు!

          మరి నేటి బ్రహ్మకాలం 100 నిముషాలకు పైగా రెండు డజన్ల మంది జాతీయ రహదారి నెంతమాత్రం ఉద్ధరించారని ప్రశ్నిస్తే:

- అంతకు ముందు గత వారంతాన - అమరావతి జమిందార్ల భవనం దరిదాపుల శుభ్రపరచింది వీళ్ళే, ఈ వేకువ గత 3 రోజులుగా పడిన గలీజులు కాక ఫెన్సింగుల లోపలికి దూరి, మరింత క్షుణంగా -  సగం ఎండిన గడ్డిని కోసి, పిచ్చి మొక్కలేరి, ప్లాస్టిక్ దరిద్రాన్ని మెడపట్టుకు గెంటే ప్రయత్నం చేసింది వీళ్లే!

          నేటి ప్రాభ్రాత సమయ స్వచ్ఛ కర్మలలో నాకు మరీ మరీ గుర్తొచ్చే 2-3 దృశ్యాలేమంటే!

1) హై ఓల్టేజీ టాన్స్ఫార్మర్ క్రిందకు దూరి - 40 నిముషాలు ఆ స్థలాన్ని నట్టిల్లుగా శుభ్రపరచిన ఒక విశ్రాంత ఉద్యోగి,

2) వైజయంత నివేశనం బయటా, లోపలా (గోడ మీదుగా) సుందరీకరించిన చిన్నముఠా

3) రాజ భవన ద్వారం దగ్గర గడ్డి చెక్కిన నలుగురూ, బుల్లి ఉద్యానం లోతట్టును చూడముచ్చటగా మార్చిన ఒక నర్సమ్మా, ఒక కాంపౌండరుడూ

4) సకాలంలో ప్లాస్టిక్ తుక్కుల్ని వింగడించి, వ్యర్థాల గుట్టల్ని చకచకా ట్రాక్టర్లో నింపిన ఆరేడుగురూ...

 

కాఫీ పానీయానంతర ముగింపుసభలో :

- అనునిత్య స్వచ్ఛ - శుభ్రతాన్వేషకుడూ, అనుష్టానికుడూ ఐన మన స్వచ్ఛ వైద్యుని చెన్నపట్నపు వైద్య సదస్సు విశేషాలూ, క్రొత్త MDO గారి తో గ్రామ హరితీకరణ చర్చలూ,

- మల్లంపాటి ప్రేమానందుని ప్రేమపూర్వక నిమ్మ ప్రసాదమూ,

- నేడు పునఃప్రవేశించిన - ఒకప్పటి స్వచ్ఛ సుందరోద్యమకారిణి, మాజీ వార్డు మెంబరూ - పసుపులేటి ధనలక్ష్మి ప్రవచిత స్వచ్ఛ సుందరోద్యమ నినాదాలూ, చివరగా

          గురువారం నాటి వీధి సుందరీకరణ చర్యలు కూడ ఇదే రహదారిలో ట్విల్స్దుకాణం వద్దనే మొదలుకానున్నవనే నిర్ణయమూ!

          ప్రతి ఉదయం శ్రమ తపస్సు

ప్రతి ఉదయం శ్రమ తపస్సు - తొలగిన కశ్మల తమస్సు

రహదారుల హరిత ప్రగతి - ప్రయాణికుల గమన వసతి

రసికులైన జనుల మనసు - లలరించే పూల సొగసు

స్వచ్ఛ కార్యకర్తల శ్రమ ఫలితంగా సుసాధ్యములు!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   14.06.2023.