2798* వ రోజు ....           15-Jun-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వద్దనే వద్దు!

గ్రామ స్వఛ్ఛ - సుందరోద్యమం రెండు వేల ఎనిమిదొందలకు నాళ్లకు చేరువగా...

          గురువారం (15-6-23) నాటి వాస్తవ పని దినాల సంఖ్య - 2798*! నేడు కూడ బందరు రహదారి సుందరీకరణమే గాని - నిన్నటికి పొడిగింపుగా, భారతలక్ష్మి వడ్లమర రోడ్డుకు సమీపంగా!

          తారీఖులు దస్తావేజులు ఇవికావోయ్ చరిత్రసారం

          ఏ దేశం ఏ కాలంలో సాధించిన దేపరమార్థం?....”

          అని శ్రీశ్రీ వందేళ్ల నాడు గద్దించి అడిగినట్లుగా

          గురువారం స్వచ్చ సైనికులు సాధించిన స్వచ్ఛ శుభ్రతల

          రహదారులు, మురుగు కాలువలు శోధించిన స్ఫూర్తిగాథలను...

          ఒక్క పది నిముషాలు పరిశీలిద్దాం రండి! నేటి గ్రామ స్వచోద్యమ నిర్మాతలు 27 మంది! మళ్లీ మళ్లీ రోడ్డు ఊడుస్తూ - పైకి లేస్తున్న దుమ్మూ - ధూళీ ఒంటి చెమటల కంటుకొని, ముక్కుల్లో దూరి, గంటన్నర ప్రయత్నంతో ఒక్కొక్కరి ఆకృతులే మారి;

          మినీ ఉద్యానాల ఎండీ ఎండని బండెడు గడ్డిని కత్తులకెరచేసి, ప్రహరీల వెలుపలి డ్రైనుల కంపును సరకు చేయక బాగు చేసి, రహదారి అంచుల మట్టి చట్టుల్ని బలవంతాన పొడిచి తొలగించి, ఆ వంద నిముషాల పాటు వీధే తమ ఇల్లనుకొని పట్టిపట్టి శుభ్రపరచి - అలసి సొలసి;

          ప్లాస్టిక్ - గాజు మద్యం బుడ్లను ఏరి, ఇసుక - దుమ్ముల గుట్టల్నీ, ఇతర వ్యర్థాల్ని డిప్పలకెత్తి -మోసి ట్రాక్టర్లో నింపి, చెత్త కేంద్రానికి తరలించి;

          ఈ పోరాట కాలంలో ఉక్క పోసిందో - దోమలూ, పురుగులే కుట్టాయో, నడుములకూ -మోకాళ్లకీ విరామం లేక నొప్పులే వచ్చాయో డీహైడ్రేషన్ దెబ్బ తగలకుండా ఎన్ని నీళ్లు త్రాగారో - ఇంత శ్రమను ఏ తాత్త్విక బలంతో ఆనందంగా మార్చుకొన్నారో

          చల్లపల్లిలో నిత్యకృత్యమైన శ్రమదాన చరిత్ర ఇప్పటికేపాటి క్రొత్త సంస్కృతిని స్థాపించిందో, ఇకముందెటుగా ఆ అడుగులు పడనున్నాయో

          అవన్నీ ప్రతి వేకువా దగ్గరగా గమనిస్తున్న నాకు బాగా తెలుసు! అలా చీకటితో లేచి వచ్చి చూడలేని వాళ్లు - 6.00 తరువాత జై స్యచ్ఛ చల్లపల్లి సైన్యంవాట్సప్ మాధ్యమ చిత్రాల్లో అద్దంలా మెరుస్తున్న ఈ 100 - 150 గజాల రహదారిని చూసి కూడ గ్రహించవచ్చు!

          విదేశీ ఆంగ్ల శత్రువు పైన వందేళ్ల నాటి స్వాతంత్య్ర సమరం కన్న ఊరి కాలుష్యం మీద జరిగే ఈ యుద్ధం తక్కువదేమీ కాదని అంగీకరించవచ్చు!

నేటి పని సమీక్షా కాలంలో :

1) గ్రామ స్వచ్ఛ - సుందరోద్యమ సంకల్పాన్ని ముమ్మారు ఝాడించి చెప్పిన రాయపాటి రాధాకృష్ణుని నినాదాలూ,

2) మల్లంపాటి వాని నిమ్మ పండ్ల పంపకమూ,

3) ఆదివారం నాటి జాతీయ రహదారిపై మొక్కల ప్రతిష్ఠాపనను సమీక్షకుడు ప్రకటించడమూ,

4) విశ్రాంతోపాధ్యాయిని రాయపాటి రమ గారి రేపటి జన్మదిన వేడుక సమాచారమూ, తన్మూలంగా   

          రేపటి వేకువ మన పునర్దర్శనం ట్విల్స్దుకాణం దగ్గరనే అనే నిర్ణయమూ......

          శాస్త్రీయాచరణ వేఱు!

చదివిన విజ్ఞులలోనూ స్వచ్ఛ స్పృహ లేకున్నది

సైన్సు చదివి ఏకమాత్ర ప్లాస్టిక్కులు తగ్గించరు

చదువు వేఱు - బ్రతుకులోన శాస్త్రీయాచరణ వేఱు!

పర్యావరణకు మిత్రులు స్వచ్ఛ కార్యకర్తలెగద!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   15.06.2023.