2799* వ రోజు ....           16-Jun-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వద్దనే వద్దు!

స్వచ్చంద శ్రమదానం మరొక మైలురాయికి చేరువగా - @2799*

          శ్రమ వేడుకనాలో - గ్రామ బాధ్యతల గుర్తింపనాలో – 34 మంది మొండి ఘటాల వల్లమాలిన పట్టుదనలనాలో తెలియని - ఐనా, ఆలోచించక – పట్టించుకోక తప్పని శుక్రవారం (16.6.23) వేకువ 4.14 కే మొదలైన వీధి - పారిశుద్ధ్య విశేషాలు:

          మొదటి అంశం - కార్యకర్తల 34 సంఖ్యతో పోల్చితే - వాశి తప్ప పనుల రాశి అంతగా లేకపోవడం; అందుకొక కారణం సుందరీకర్తలు గత నాలుగైదు నాళ్ల సుందరీకృత భాగాన్నే మళ్లీ మెరుగులు దిద్దడం;

         రెండోది - తాతినేని రమణుని తొలగించిన నర్సరీ దగ్గర అడ్డాల వల్ల జరిగిన ఆలస్యం;

          మూడో సంగతి - ఇక్కడి దుమ్ము  - ఇసుక గుట్టల్ని దూరంగా – బైపాస్ రోడ్డులో సాగర్ టాకీస్ వద్ద సిమెంటు రోడ్డు మార్జిన్ల పల్లాలు పూడ్చేందుకు ట్రక్కులో తీసుకెళ్లి, కార్చి వచ్చిన పని;

          ఇంకొక ముఠా ఈ మినీ ఉద్యానాల నిన్నటి - నేటి గడ్డి మేటల్ని ట్రాక్టర్ లో తరలించుకుపోయి, గంగులవారిపాలెం వీధిలో కొత్తగా వేసిన సిమెంటు రోడ్డుపై సర్దినది నాలుగో కారణం,

          చేస్తున్న వీధి పారిశుద్ధ్య కృషిలో - అంటే కంపు మురికి పనుల్నీ ఇంకా మెరుగ్గానూ, తమకు సంతృప్తి కలిగేదాకనూ, చేయాలంటే ఇలా రాశిలోపించి వాసి మిగలడం తప్పదు!

          ఈ ఉదయం గంటన్నర శ్రమదానంలో ఏ కార్యకర్త ముఖంలోనైనా అలసట తప్ప విసుగు కనపడకపోవడమూ, వీధి సౌందర్యాల మన్నిక కోసం ఇంకా ఏమి చేయాలనే చర్చ తప్ప గ్రామస్తుల్ని తప్పు పట్టని సహనమే ప్రముఖాంశాలు!

          సాధ్యపడుతుందో లేదో గాని – నాకైతే - కార్యకర్తల ఏ ఒక్క పూర్తి పని దినం కృషినైనా వీడియో తీసి, అన్ని ఇళ్లకూ ప్రదర్శించి - చర్చకు పెట్టాలనే ఉన్నది!

          బందరు వీధి మెరుగుదల కోసం చేయగలిగినంత శ్రమ చేశాక - 6.10 కి సరదా కబుర్ల -  ఛాయా చిత్రం తీశాక – 62 వ జన్మదిన వేడుకల మహిళ రాయపాటి రమ గారి శ్రమదానోద్యమ సంకల్ప నినాదానంతరం –

          రహదారి ప్రక్కనే ఆమెకు జన్మదిన శుభాకాంక్షలూ,

          స్వచ్చోద్యమ ఖర్చులకు గాను ఆ దంపతుల 10,000/- విరాళమూ,

          పనిలో పనిగా ప్రాతూరి శాస్త్రి మహాశయుని 5,000/- వితరణా,

          మనిషికొక అరకేజీ బరువు పెరిగేట్లుగా రాయపాటి వారి విందులూ –

2800* వ నాటి కార్యకర్తల సమాగమ ప్రదేశం గంగులవారిపాలెం బాట బైపాస్ రహదారి సంగమ స్థలమనే సమాచారమూ...... ఇవీ నేటి ఎన్నదగ్గ విశేషాలు!

                    ఏవి తల్లీ చల్లపల్లీ!

విధులన్నీ బోసిపోయిన – దోమ లీగలు వృద్ధి చెందిన

కళాకాంతుల కరవు పెరిగిన – నీ గతాన్నీ నెమరు వేస్తే – ఆ గతాన్ని పోల్చిచూస్తే

ఏవి తల్లీ! నేడు విరిసిన స్వచ్ఛ - శుభ్రతలేవి తల్లీ!

ఎక్కడమ్మా! బాధ్యతెరిగిన ఈ మహోన్నత కార్యకర్తలు – ఏరితల్లీ

          ఊరి మేలుకు తొమ్మిదేళ్లుగ ఉద్యమించిన వీరులెక్కడ?

          ప్రతి దినం నీ సేవలోనే పరవశించిన ధీరు లెక్కడ?

          వట్టిమాటలుకాక నిన్ను ఉద్ధరించిన దృశ్యమెక్కడ

          ఉంది చూపించూ!

                    ॥ ఏవి తల్లీ! నేడు మురిసిన స్వచ్ఛ శుభ్రతలేవి తల్లీ

హరిత సుందర కానుకలతో పుష్ప శయ్యల మార్గములతో

కనుల పండుగ చేసినట్టి ఘట్టముందా గతం లోపల – తీసి చూపించూ!

          ఏవి తల్లీ నేడు మురిసిన స్వచ్ఛ శుభ్రతలేవి తల్లీ!

          ఎక్కడమ్మా! బాధ్యతెరిగిన ఈ మహోత్తమ కార్యకర్తలు – ఏరి తల్లీ!

భ్రష్ట సంస్కృతి రూపు మాపే - శిష్ట సంస్కృతి మేలు కొలిపే

శ్మశానాలను సంస్కరించే - మురుగు గుంటల నుద్ధరించే

కార్యకర్తలు నీ గతంలో కాన రారేమీ?

          ఏవి తల్లీ! నేడు విరిసిన స్వచ్ఛ– శుభ్రతలేవి తల్లీ!

          ఎక్కడమ్మా! బాధ్యతెరిగిన ఈ మహోత్తమ కార్యకర్తలు – ఏరి తల్లీ

శ్రమ త్యాగం, సమయదానం సుదీర్ఘంగా నిరూపించిన

పుత్రులిందరు నీ గతంలో పుట్టి ఉన్నారా?

గతం నీవొక చల్లపల్లివె - వర్తమానం స్వచ్ఛ - సుందర

చల్లపల్లని లోకమంతట చాటి చెప్పారా?

          ఏది తల్లీ! నేడు వెలిగిన స్వచ్ఛ సంస్కృతి ఏది తల్లీ!

          ఎక్కడమ్మా! నీ గతంలో బాధ్య తెరిగిన కార్యకర్తలు – ఏరి తల్లీ

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   16.06.2023.