2800* వ రోజు ....           17-Jun-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వద్దనే వద్దు!

గ్రామ స్వచ్ఛ – సుందరోద్యమంలో ఒక గణనీయ సంఖ్య - 2800*

          మరి ఆ పని దిన సంఖ్యకు తగ్గట్లుగానే శనివారం నాటి వేకువ 4 ½ న్నా కాకుండానే గంగులపాలెం దగ్గరి జాతీయ రహదారి సుందరీకరణ/హరితీకరణ పనులు మొదలైపోయినవి! గుమిగూడిన వారి సంఖ్య అంతకంతకూ పెరిగి, 70 దాటింది!

          స్థానిక శాసనసభ్యుడు, తదీయ అనుచరులూ, MPP, వార్డు సభ్యులు, MDO కాక -  క్రమం తప్పక ప్రతి వేకువా శ్రమించే 30 - 40 మంది శ్రమదాతలతో ఆ 200 మీటర్ల రహదారి కళకళలాడింది! నేడెందుకో గాని ఎప్పుడో గాని రాని ఆస్పత్రి సిబ్బంది ఎక్కువ సంఖ్యలో శ్రమదానానికి వచ్చారు.  

          ఇప్పటికే కార్యకర్తలు ఊళ్లోకి దారి తీసే 7 రహదార్లలో శ్మశానాల, బస్ ప్రాంగణాల, పాఠశాలల, గ్రామాంతర్గత బాటల, కాల్వ గట్ల వెంట ఏ ముప్పై వేల చెట్లో/పూల మొక్కలో నాటితే - ఇక మిగిలింది ఇటీవల పడిన ఈ క్రొత్త జాతీయ ఉపమార్గమొక్కటే కనుక –

          కాస్త పెరిగి, పుష్పించినప్పుడు ఆ బాటకు శోభనిచ్చే రకరకాల పూలమొక్కల్ని శాసన సభ్యులు – గౌ సింహాద్రి రమేష్ గారితో 2800* వ నాడు నాటించడం సముచితంగా ఉన్నది! బహుశా - చల్లపల్లి, సమీప మండలాల్లో “జగనన్న పచ్చతోరణం”లో ఇదే తొలి కార్యక్రమం కావచ్చు!

 

          నేటి శ్రమదాన కార్యక్రమ అతిథులూ, అధికారులూ ఈ రహదారి వెంట పయనించేప్పుడు ఈ మొక్కలెలా దిన దిన ప్రవర్ధమానమౌతున్నాయో - బాటసారులకు ‘స్వచ్ఛ - హరిత - సుందర చల్లపల్లి నెంతగా గుర్తు చేస్తాయో గమనించాలని మనవి!

          ఈ నాటి 40 మంది కార్యకర్తలు ఈ రహదారి ఉత్తరపు అంచున మొక్కలు నాటుటకు ముందు – పిచ్చి మొక్కల్ని, గడ్డినీ, చెత్తా – చెదారాల్ని ఎలా తొలగించారో - ఏడెనిమిది మంది మహిళా కార్యకర్తలు గొర్రులతో ఆ వర్థాల్ని - చీకటిలోనే ప్రక్క పొలంలోకెలా లాగి వేశారో గమనిస్తూనే ఉన్నాను. మరో పదిమంది గోకుడు కర్రల్తో మట్టి చట్టుల్ని లేపి, చీపుళ్లతో అసలే అందంగా ఉన్న సువిశాల రహదారినెంతగా శుభ్రపరిచారో - పని వేళ వారు పొందుతున్న సంతృప్తేమిటో నాకు కాదు గాని – అతిథి పాత్రధారులకు ఆశ్చర్యం కలిగించే ఉండాలి!

          ఇలాంటి ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే కాక – తక్కిన రోజుల్లో కూడ – వార్డు మెంబర్లూ, అధికారులూ, పని ప్రదేశపు నివాసులూ కార్యకర్తల్తో కలిసి వస్తుంటే - ఎంత సందడి! ఊరికెంత పండగ!

          MLA గారు మొక్క నాటాక - వారు స్వచ్ఛ కార్యకర్తల సుదీర్ఘ శ్రమదానాన్ని, చల్లపల్లి ప్రత్యేకతనూ మెచ్చాక - నందేటి శ్రీనివాసుడు ‘వృక్షో రక్షతి రక్షితః. పాటపాడాక - కేకులు పంచాక - - అంతకు ముందే ఛాయా చిత్రంలో అందర్నీ బంధించాక - 6.50 తరువాత గాని నేటి కార్యక్రమం ముగియలేదు!

          చల్లపల్లి స్వచ్ఛ సుందరోద్యమాన్ని అమెరికా నుండే డేగ కళ్ళతో పరిశీలించే నాదెళ్ళ సురేష్ తన పితృపాదుడు – పూర్ణ గారి ద్వారా 28 వేల విరాళాన్ని ఉద్యమ ఖర్చుల నిమిత్తం సమర్పించాడు.

          అర్ధాంతరంగా మనం నిన్న వదిలేసిన బందరు జాతీయ రహదారి పారిశుద్ధ్య పనుల కోసం రేపటి వేకువ మనం కలిసి శ్రమించదగిన చోటు - భగత్ సింగ్ దంత వైద్యశాల వద్ద!

          అరుదగు ఒక అవకాశం

విలువైనది మన సమయం - అనువైనది శ్రమదానం

పిలుస్తోంది మన గ్రామం అందరి స్వస్థత కోసం

సామాజిక విధి భారం సత్వరమే దించుకొనగ

అరుదగు ఒక అవకాశం - అందుకొనుట ఉత్తమం!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   17.06.2023.