1935*వ రోజు....           28-Feb-2020

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ఏ ప్లాస్టిక్ వస్తువులనూ వాడం!   

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం1935* వ నాటి స్మరణీయ అంశాలు.

ఈ నాటి బ్రహ్మ ముహూర్తం 4.01 నుండి 6.15 నిముషాల దాక త్రిగుణాత్మకంగా సాగిన మన గ్రామాభ్యుదయకర స్వచ్చంద శ్రమదాన వేడుకలో కలిసి వచ్చిన సోదర కార్యకర్తలు 25 మంది (అతిథి అభాగ్యతులతో సహా)

అచ్చం నిన్నటి వలె నే నేడు కూడ మూడు చోట్ల-మూడు విధాలైన గ్రామ స్థితి మెరుగుదల కృషి జరిగింది. పాత తరం సినిమా కవి-ఆత్రేయ (కిళాంబి రాఘవా చార్యులు) ఒక విషాద తాత్విక గేయం(మనసు మూగదే గాని-బాసుంటది దానికి/ చెవులుండే మనసుకే వినిపిస్తుందా ఇది..... )లో చెప్పినట్లు-1935* రోజులుగా 3.30 కే లేచి, 4.00 కే పని చోటుకే హాజరై తపిస్తున్న- స్వప్నిస్తున్న- శ్రమిస్తున్న-ప్రస్థానిస్తున్న ఈ స్వచ్చ-సుందర నిస్వార్ధ కార్యకర్తల పట్టుదల కార్యదీక్ష 25 వేలకు పైగా ఉన్న చల్లపల్లి గ్రామ సహోదరులలో ఎంతమంది మనసు లోతులలోనికి వెళ్లిందో మరి!

- యథావిధిగా గ్రామ రక్షక యోధులు గంగులవారిపాలెం దారిలో అందం కోసం ట్రస్టు కార్మికులు కత్తిరించిన, పీకిన వెదురు చెట్ల కొమ్మలను, బంతి చెట్ల అవశేషాలను చలిలో-వాన తుంపరలలో ట్రాక్టర్ మీది కెక్కించి, పెదకళ్లేపల్లి దారిలోని ఇతర కార్యకర్తలతో కలిసి, తమ కృషి కొనసాగించారు.

- సుందరీకర్తలు సామ్యవాద (కమ్మ్యూనిస్టు)వీధిలో-వామపక్ష కార్యాలయ ప్రహరీకి రంగులు వేయడం ముగించారు. 

- 20 మంది కార్యకర్తలు శివరామపురం బాటలో కోళ్ల మేత కర్మాగారాల పరిసరాల్లో డ్రైన్ల లోని అన్ని రకాల వ్యర్ధాలను నరికి, ఊడ్చి, దంతెలతో లాగి, గుట్టలు పేర్చి ఉంచారు. బహుశా రేపటి తో ఈ రహదారి స్వచ్చ-శుభ్ర –సుందరీకరణం పూర్తి కావచ్చు.

6.35 కు మొదలైన దైనందిన శ్రమదాన సమీక్షా చర్చా సమావేశంలో మొవ్వ వాస్తవ్యులు-అమెరికా ప్రవాసి మండవ శేషగిరి రావు గారు పాల్గొని, మొవ్వ, చల్లపల్లి గ్రామ ప్రజల బాధ్యతా విస్తృతికి తను చేస్తున్న కృషిని సోదాహరణంగా వివరించారు.  

చల్లపల్లి స్వచ్చోద్యమ సంచాలకులు డాక్టర్ దాసరి రామ కృష్ణ ప్రసాదు గారు, స్వచ్చ కార్యకర్తలు స్వచ్చ పరిచిన రహదార్ల పార్శ్వాల మీద వెలుస్తున్న బడ్డీల వంటి ఆక్రమణలు జరగకుండ రాజకీయ తదితర ప్రముఖుల సహకారం అభ్యర్ధించే లేఖా విన్నపాలను అందచేసే ప్రతిపాదన చేశారు.

నేటి మరొక ముఖ్య విశేషం మన నిలయ గాయక విద్వాంసుడు నందేటి శ్రీనివాస్ గ్రామ స్వచ్చ-శుభ్ర-సుందర సంకల్ప నినాదాలను ముమ్మారు ప్రకటించి, పాటతో-పద్యంతో కార్యకర్తల శ్రమను మరపించడం.

రేపటి మన స్వచ్చంద శ్రమదానం వివేకానంద కళాశాల సమీపంలో నిర్వహిద్దాం!

           *తరించేలా నెగ్గుకొస్తది*

కాలమేమొ అనంతమైనది-లోకమెంతో విశాలమైనది

ఎప్పుడో మరి-ఎక్కడోగని ఈ మహోద్యమ మవతరిస్తది

పిన్న పెద్దల-స్త్రీలు పురుషుల పిలిచి అక్కున చేర్చుకొంటది

తమకు గాక సమాజ కృషిలో తరించేటట్లుగ నెగ్గు కొస్తది

నల్లూరి రామారావు

స్వచ్చ చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు - మనకోసం మనం ట్రస్టు,

శుక్రవారం – 28/02/2020

చల్లపల్లి.      

4.02 కు శివరామపురం రోడ్డులో