2801* వ రోజు ....           18-Jun-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడాలా?

నిన్నటి తరువాయిగా బైపాస్ రోడ్డులో – 2801*

          వాతావరణ మార్పు వల్ల బందరు రహదారి బదులు - ఉప రహదారికి మారిన శ్రమదాన వేదిక. అనగా - 3.10 కే వర్షాన్ని వెంట తెచ్చుకొని గాలి వీచగా - వీధి సుందరీకరణ బదులు గంగులపాలెం దగ్గరి రాదారి మార్జిన్ల మెరుగుదల కృషి!

          అనుకోని మార్పుతో  - ఆదివారం (18.6.23) వేకువ పనిలో కార్యకర్తల సంఖ్య 29 కి పరిమితమయింది. గంటన్నర పాటు నిన్నటి చోటనే విజయవంతంగా జరిగిన పనులిట్లుండెను :

- బైపాస్ కు దక్షిణంగా - వెడల్పాటి - లోతు ఖాళీ స్తలంలోని ముళ్ల - పిచ్చి మొక్కల, పేర్లు తెలియని తీగల, ఎండు గడ్డి తుక్కుల పనిబట్టినదే నేటి అసలైన కష్టం! డజను మంది కత్తి వీరుల + 10 మంది దంతె ధారుల, ఇంకా నలుగురు చీపురు వారల సంఘటిత కృషితో గాని బండ్రేవు కోడు మురుగు పెద్ద వంతెన నుండి గంగులపాలెం అడ్డ వీధి దాక చూడ ముచ్చటగా మారలేదు!

- పెద్దలు, మహిళలు జారి పడకుండ గజమున్నర లోతు మార్జిన్లలోకి దిగడమూ, పని ముగించి పైకెక్కడమే నా దృష్టిలో గొప్ప సంగతి!

          దగ్గరగా మైకు నుండి మంచి పాటలు వింటూ ఎడనెడ చతుర్లాడుకొంటూ, చెమటలు తుడుచుకొంటూ, ఊరి సౌకర్య కల్పనే ధ్యేయంగా - ఒక సామూహిక కృషి జరగడం - అదీ 2800 నాళ్లకు పైగా కొనసాగడం నమ్మితీరవలసిన యదార్థం!

          ఇది జగనన్న పచ్చ తోరణం పని కనుకనూ, వర్షర్తువు వచ్చేసింది గనుకనూ గ్రామస్తుల్నుండే ఇతోధికంగా కార్యకర్తలు వస్తే గాని - ఈ బైపాస్ వీధి 1½ కిలోమీటర్ల బారునా మొక్కలు నాటి - సంరక్షించి - పెంచడం కుదరదే!

          పైగా వచ్చేవారంలో - ఎప్పుడో 1977 లో విద్యార్థులూ, ప్రస్తుతం ఉద్దండ వైద్యులూ సుమారు 40 మంది స్వచ్ఛ సుందర చల్లపల్లి పరిశీలనకు వస్తున్నందున - రేపటి నుండి కార్యకర్తల సంఖ్య పెరిగితే గాని -

          ఊరి ముఖ్య వీధుల పునః సుందరీకరణమూ, మొక్కలకు మిగిలిన ఒకే ఒక్క ఖాళీ - బందరు ఉపరహదారిలో వృక్షాలంకరణమూ పూర్తవ్వాలి గదా!

          నిన్న నాటిన మొక్కలకు ట్రస్టు ఉద్యోగులు పాదులు తీర్చి – రక్షణగా ముళ్ళ కంపలు పాతి, పోషణగా నీరు పోశారు.

          ఈ ఉదయం శుభ్ర - సుందరీకరణంతో పుట్టుకొచ్చిన వ్యర్థాల్ని ట్రక్కులో కెక్కించలేదు.

6.20 కి మొదలైన సమీక్షా సభలో:

1) బుధవారం కాదు - మంగళవారం వేకువ మనం కలుసుకోదగిన పని చోటు బందరు వీధిలోని “భగత్ సింగ్” ఆస్పత్రనే నిర్ణయమూ,

2) SP బాల సుబ్రహ్మణ్య గాయకుని జన్మదినం కనుక అతని వీరాభిమాని, వక్కలగడ్డ నాగ శేషు కార్యకర్తలకు బిస్కట్ల పంపకమూ, SPB ని అనుకరిస్తూ - స్వచ్ఛ చల్లపల్లి కన్వయిస్తూ అతడు పాడిన పాటతో ఆగని నవ్వులూ,

3) శేషు మజ్జిగ దాతగా మారిన వైనమూ......ఇవీ కొన్ని విశేషాలు!

          ఎలా ఫలితములు దక్కును?

తర్కవితర్కంతోనో - ముఖస్తుతుల గోలతోనొ

ఉపన్యాసములతోనో ఉమ్మడి ఫలితం దక్కదు

అని తెలిసీ  ప్రతి వేకువ శ్రమ సందడి చూసి కూడ

ఏం లాభం? పనికి దిగక ఎలా ఫలితములు దక్కును?    

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   18.06.2023.