2802* వ రోజు ....           19-Jun-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వద్దనే వద్దు!

2802* వ వేకువ కొందరి రెస్క్యూ పనులు.

          సోమవారమైనందున గ్రామ భద్రతా కార్యకర్తల ప్రణాళికననుసరించి 3+2 మంది ఊరి చివర - అవనిగడ్డ రహదారియందలి బండ్రేవుకోడు కాల్వ అంచుకు చేరుకొనిరి.

          అస్తవ్యస్తంగా పద్ధతీ పాడూ లేకుండ ముణ్ణాలుగు నాళ్ళ క్రితం ఆ వీధిలో పబ్లిక్ టాయిలెట్ల వద్దనూ, వడ్లమర దిశ గానూ విరిగి పడి రాకపోకల నడ్డుకొంటున్న కొమ్మల సంగతి చూడడమే నేటి కార్యకర్తల పూనిక!

          మరి - ఈ కర్తవ్యం ఎవరో విధించింది కాదు తొమ్మిదేళ్ల నాడు ఊరి దుస్థితిని చూసి చూసి, చీకట్లో చిరు దీపం వెలిగించినట్లు ఇష్ట పూర్వకంగా జనవిజ్ఞానవేదిక కార్యకర్తలు స్వీకరించిన బాధ్యతలు! పైకేదో చిరు సహాయాలుగా అనిపించినా - ఊరి స్వరూపాన్నే మారుస్తున్న నిర్ణయాలివి! 

          ఈ వేకువ సంగతే గమనించండి - రెండు రోజులుగా ఇబ్బంది పడుతూ సర్దుకుపోతున్న ప్రయాణికులు గాని, వాహన చోదకులు గాని తలపెట్టని ఈ బాట మారామత్తుల్ని నెరవేర్చింది అల్ప సంఖ్యాక స్వచ్ఛ కార్యకర్తలే గదా! 

          కొమ్మల్ని ముక్కలుగా నరుకుడు గాని, మొండిచెట్ల సుందరీకరణం గాని, పెద్ద బండెడు వ్యర్థాల్ని ట్రాక్టర్ లో నింపుకొన్న దృశ్యాల్ని వాట్సప్ లో చూడవచ్చు!

          చివరగా - ఉత్సాహంగా వాళ్లు చేసినవి మాలెంపాటి అంజయ్యననుసరించి గ్రామ స్వచ్చోద్యమ నినాదాలు!

          రేపటి విస్తృత కార్యకర్తల వేకువ కలయిక - బందరు వీధిలోని రాయపాటి వారి ట్విల్స్దుకాణం దగ్గరే!

    గుటక గంజి సాటి రావు

ఉపన్యాసములు దేనికి అసలు పనేలేనప్పుడు?

గుడులు, బడులు వందలైన గుటక గంజి సాటి రావు

కార్యకర్త శ్రమదానం గంట పాటు అందుకె గద!

శ్రమమూల మిదం జగత్” – అది లేనిదె ఏం లాభం?

 - ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   19.06.2023.