2803* వ రోజు ....           20-Jun-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు మనకేల?

2803* వ వేకువ కాలపు గ్రామ సపర్యలు.

          ఆ గ్రామం చల్లపల్లి : సపర్యలు గంటన్నర పాటు బాధ్యతగా చేసిన కార్యకర్తలు 24 మంది :  సదరు స్వచ్ఛ – పరిశుభ్రతా అదృష్టం పట్టినది ఊరిలోని బందరు వీధిలో సజీవ మత్స్య విక్రయ కేంద్రం మొదలు పెద్ద మశీదు వరకు!

          అటుగా వస్తూపోతూనూ, అంగళ్ల మెట్ల మీద కూర్చొనీ ఉన్న వందల మందిలో కార్యకర్తలతో వచ్చి కలిసిన వారిదేమో శూన్య(0) సంఖ్య! కార్యకర్తలదేమో – ఊరి జనాభాతో పోలిస్తే - 1:1000 నిష్పత్తి! ఐనా సరే - ఈ వాలంటీర్లలో నిరాశానిస్పృహలు లేవు! స్థిత ప్రజ్ఞుల్లా, ఉన్న ఊరికి కాస్తంత ఉపయోగపడుతున్న అదృష్టవంతుల్లా వాళ్లెప్పట్లాగే తమ బాధ్యతనుకొన్నది చేసుకు పోయారు!

          ఈ 100 కు పైగా గజాల పొడుగూ, వెడల్పాటి బందరు వీధి భాగంలో చేపల దుకాణాలున్నా - పందిరి రోడ్డునాక్రమించిన తూర్పు రాములోరి గుడి ఉన్నా - బోలెడన్ని షాపులున్నా - వాటి ఎదుట పంచాయతీ వారు తోడించి, సగం ఎండి ఇంకా కంపుగొడుతున్న మురుగు గుట్టలున్నా – ప్లాస్టిక్ ఛండాలములున్నా – అన్నిట్నీ నిర్వికారంగా

 శుభ్రపరచుకుపోతున్న ఈ 20 మందికి పైగా ధన్యుల్ని పొగడాలా - తెగడాలా - శాలువాలు కప్పాలా? (ఎలాగూ ఈ స్వచ్ఛ కార్యకర్తలు వాటికన్నిటికీ అతీతులేననుకోండి -)

          ఊరి ముఖ్య వీధుల్నిప్పటికెన్నిమార్లు ఊడ్చారో - మొండి గోడల్ని పదే పదే సుందరీకరించారో – మోకాళ్ల పైదాక మురుగు కాల్వల్లో దిగి - వాటిని ముందుకు నడిపించారో – ఎన్ని ఆక్రమణల బారి నుండి రహదార్లను కాపాడారో – అందుగ్గాను ఎన్ని అపనిందలు భరించారో.....అదంతా వర్తమాన చరిత్రే గదా!

          ఈ వేకువ మురుగు గుంటల్లో దిగలేదు గాని – ఆ కాల్వ గట్లను సుందరీకరించారు. వంద గజాల మేర క్షుణ్ణంగా ఊడ్వడమే – ఏడెనిమిదిమందికి సరిపోయింది.

          ఇక ఆరేడుగురు దుమ్మూ - ధూళీ - తుక్కు పనివాళ్లకు వాటిని విడగొట్టి – ట్రక్కులో కెక్కించుకొని – చిన్న కార్ల షెడ్డు మెరకకో, సిమెంటు రోడ్ల దన్నుకో పరిచి వచ్చే కృషిలో!

          వాతావరణం కాస్త చల్లబడినా – ఇందులో - 84 ఏళ్ల వృద్ధ బాలునితో సహా – ఏ ఒక్కరికీ చెమటలు కారక తప్పలేదు!

          నాగాయలంక దారిలో బండ్రేవు కోడు కాల్వ దగ్గరి టాయిలెట్ల రంగు వెలిసిందనో - దుమ్మంటిందనో ముగ్గురా గోడల్ని పునఃసుందరీకరించి వచ్చారు.

          (చదివే పాఠకులకు విసుగొస్తుందనే శంకతో తక్కిన పని వివరాలు వ్రాయడం లేదు)

6.15 వేళ –

          1) అమెరికా ప్రవాసి నాదెళ్ల సురేష్ పంపిన మామిడిపళ్ల

          2) మా పెరటి సపోట పళ్ల పంపకాలకు ముందు -

          పౌరశాస్త్రోపన్యాసకుడు వేముల శ్రీను వేగంగా ముగించిన నినాదాలూ, ఒక్కరోజు ఎడంతో శ్రమదానంలో పాల్గొన్న DRK సమీక్షా వచనాలూ, మే నెల స్వచ్చోద్యమ జమా - ఖర్చుల ప్రకటనా జరిగి, నేటి కార్యక్రమం ముగిసెను!

          రేపటి వేకువ మనం కలుసుకోదగిన చోటు బందరు దారి ఉత్తరాన చెరువు – మెకానిక్ షెడ్ల దగ్గరే (రామాలయం ఎదుట)!

          దృష్టిని బట్టే కనిపిస్తుంది...

దృష్టిని బట్టే కనిపిస్తుందీ సృష్టని విన్నాను

నువ్వది వేదం అన్నావు - నేనది వాదం అన్నాను

సంత మధ్యలో జోలె పట్టి పసి గొంతు మ్రోగుతుంటే

నువ్వది గేయం అన్నావు - నేనది గాయం అన్నాను

                               దృష్టిని బట్టే

కళాత్మకంగా సినిమా తప్పుడు విలువలు చూపిస్తే

నువ్వది వినోదమన్నావు - నేనది ప్రమాదమన్నాను

                              దృష్టిని బట్టే

అందం కోసం అప్పు చేసి ఒకడాభరణం కొంటే  

నీవది కంకణ మంటావు - నేనది సంకెల అంటాను

                              దృష్టిని బట్టే

బల ప్రదర్శన కోసం ఎవడో పులిని చంపుతుంటే

నీవది శౌర్యం అన్నావు - నేనది క్రౌర్యం అంటాను

                              దృష్టిని బట్టే

నమ్మిన సత్యం కోసం కొందరు ప్రాణాలర్పిస్తే

నువ్వది మరణం అంటావు - నేనది జననం అంటాను

                              దృష్టిని బట్టే

ఊరి మెరుగుదల కోసం కొందరు ఉద్యమించుచుంటే

నీవు నిరర్థకమంటావు - నేనది సార్థక మంటాను

                              దృష్టిని బట్టే

 - ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   20.06.2023.