2804* వ రోజు ....           21-Jun-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడాలా?

ఊరి బాగుదల దృష్ట్యా- 2804 వ ప్రయత్నం!

          అది బుధవారం (21.6.2023) నాటిది, స్థలం బందరు వీధి మసీదు నుండి మరొక వంద గజాలనుకోండి!  విసుగూ - విరామమెరుగని ప్రయత్నీకుల సంఖ్య 30 కే పరిమితం-ఒక గాయపడిన వృద్ధ సైనికునితో సహా!  కాలం 4.15- 6.05 నడిమిది! ఆరేడుగురు మహిళామతల్లులు, 8-84 ఏళ్ల మధ్య వయస్కులు!

          రకరకాల పనిముట్లతో- బెరుకూ బిడియం లేకుండ వీధి మురికి పనుల్నీ - మైకు గేయాలు వింటూ - అవసరాన్ని బట్టి మురుగ్గుంటల్లో చేతులు పెడుతూ - ఊడుస్తూ -రోడ్డు మార్జిన్ల గడ్డినీ, మేటల్నీ చెక్కుతూ - కొందరు చతుర్లాడు కొంటూ - గుడ్డిగా కాక విచక్షణ గానూ, విడివిడిగా కాక కలివిడి గానూ - ఏకాస్త చైతన్యవంతులకైనా స్ఫూర్తిమంతంగానూ గంటన్నరపాటు నడిచిన ఈ కార్యక్రమాన్ని శ్రమానందమంటారో, ఊరి పండగంటారో అనండి!

          తొమ్మిదేళ్ల - ఇలాంటి 2804* శ్రమ వేడుకలతో ఊరెంతగా బాగుపడిందో - ఎన్ని సౌకర్యాలు, వసతులు, ప్రయోజనాలు కలిగాయో-చూసి కూడ – “ ఆఁ! చేశార్లెద్దూ- పేరు గొప్ప- ఊరు దిబ్బ తమ శ్రమదానమనో - షేక్స్పియర్ హాస్య నాటకం.

 “Much ado about Nothing” (వట్టొట్టి ఆర్భాటం) అనో - వంకలు పెట్టడం కుదరదులెండి!

          ఇక - టూకీగా నేటి వేకువ కాయకష్ట వివరాలకొస్తే: - ఒకటి రెండు నట్టుల్తప్ప - 100 గజాల MTM వీధి పారిశుద్ధ్యం సాఫీగా సాగినట్లే.

          - చంటి హోటలు వీధి దగ్గరి, దానికి ఉత్తరపు మురుగు కాల్వలూ, వాటిగట్లే ఈ వేళ ఎక్కువ మంది శ్రమదానం కోరుకొన్నవి!  ప్రాత ఫర్నీచర్ దుకాణం వద్దకూడ అంతే!

          ఇంతకన్నా కఠిన సంక్లిష్ట పారిశుద్ధ్య పనులెన్ని జరగ లేదు గతంలో? ఎంతగా చెమట లొలక లేదుఈ వీధుల్లో?

          ఒక ధర్మ సందేహమేమంటే- దుకాణాల ఎదుట తగిన శుభ్రత నిర్వహింపలేని - ఒక్కనాడైనా శ్రమ సందడికి పాల్పడని ఆలోచనాపరులు - తమ కొట్లను 8.30 తరువాత తెరుస్తూ- ఈ వీధి, తమ దుకాణ పరిసరాలు ఎందరి కష్టంతో ఇంత శుభ్రంగా ఉన్నాయో అని గుర్తిస్తున్నారాఅని!

          నేటి సమీక్షా సభలో దేసు మాధురి ముమ్మారు ఖరా కండీగా పలికిన నినాదాలు ఆమె ఇంటి దాక వినిపించాయని కొందరంటున్నారు.

          రోడ్డు ప్రయాణ భద్రత గురించి, శిరస్త్రాణ ధారణ ప్రాముఖ్యత గురించీ కొంత చర్చ నడిచింది. ఊరి మంచికై పాటుబడే కార్యకర్తలు సొంత భద్రత విస్మరించరాదనే హెచ్చరికలూ వినిపించాయి.

          మల్లంపాటి వారి నిమ్మపండ్ల పంపకమూ ముగిసింది.

          రేపటి మన కలయిక పోలీసు వీధి మొదట్లో అనే నిర్ణయమూ వచ్చింది.

     అసలు ఫలితమేముండును?

సాహిత్యం ప్రవర్తనను చక్కదిద్ద గలదేమో

సంగీతం వంటి కళ ప్రశాంతత నిస్తుందేమో

సామాజిక సామూహిక శ్రమదానం పరిధి వేఱు

అని తెలిసీ పనికి దిగక అసలు ఫలితమేముండును?

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   20.06.2023.