2805* వ రోజు ....           22-Jun-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడాలా?

2805* వ వేకువ శ్రమదాతలు 33+1 మంది!

          గురువారం (22-6-23) నాటి విజయవంతమైన వీధి పారిశుద్ధ్యం ఊరి నాలుగు భాగాలకు విస్తరించి 4.15 - 6.30 నడుమ జరిగెను. అసలుసిసలు శ్రమవీరులు పాతిక మందే గాని, ఆలస్యమైన వారు, హంగుదారులు కలిపి 33 మందీ కాక గాయపడిన వృద్ధ సైనికుడొకరు.

ఇందరి కష్టంతో

1) బందరు దారిలో అడపా - సంత వీధుల నడుమ

2) దేవాలయాల దగ్గర,

3) నాగాయలంక బాటలోని స్పచ్ఛ - సుందర టాయిలెట్ల వద్ద,

4) నడకుదురు రహదారీ నేడు మెరుగుపడిన చోటులు.

          చల్లపల్లి గురించి బైట ప్రపంచానికి రూఢిగా తెలిసిన సంగతేమంటే - ఇక్కడ 100 కు పైగా కార్యకర్తలు తొమ్మిదేళ్ల నాడు - ఒక శుభ ముహుర్తాన - ఊరి స్వచ్ఛ శుభ్రతల కోసం పంతం పట్టి, రోజూ 30/40/50 మంది చొప్పున నెగ్గుకొస్తున్నారనీ, రాష్ట్రంలో - దేశంలో వాళ్ల ఊరు మేల్బంతి అయ్యేసంగతి తేల్చుకోందే వదలరనీ,

          ఐతే - ఏమాటకామాటే చెప్పుకోవాలి - గ్రామస్తుల్లో ఏ 10 శాతం మందో గట్టిగానూ, మరో 30/40 శాతం మంది పాక్షికంగానూ వేర్వేరు పద్ధతుల్లో కార్యకర్తల్లాగే పంతం పట్టారు మొదటి వారు ఆర్ధిక - హార్దిక సహకారమందిస్తూనూ, రెండో వారు ఏరోజుకారోజు ఇందరు కార్యకర్తలకు వీధుల్లో పని తగ్గకుండా చూస్తూనూ!

          ఇప్పటి పరిస్థితుల్లో ఇద్దర్లో విజేతలెవరో తేలాలంటే మూణ్ణాలుగైదారేళ్లు పట్టినా ఆశ్చర్యం లేదు!

నేటి బ్రహ్మకాల శ్రమ జీవన సౌందర్యం గురించి చెప్పాలంటే :

- ముందుగా ప్రస్తావించవలసింది షాబుల్ వీధి నుండి తూర్పుగా 50 గజాల బందరు వీధిలో డజను మంది చేసిన బరువు పనే. ఒక ప్రక్క పంచాయతీ వారు తోడగా సగం ఎండిన మురుగునూ, మరో వంక  బళ్ళ నుండి జారిన, ఎవరో తెప్పించగా రోడెక్కిన ఇసుకనూ తొలగించి, రహదారిని రహదారిగా  చూపించిన కృషే!

- సంత వీధి కెదురుగా 10 మంది కూడ గంటకు పైగా ఇదే పనిలో అంటే దుమ్మునూడ్చి, మురుగు మట్టిని ట్రక్కులోకెక్కించి, మురుగు కాల్వ వ్యర్థాల్ని బైటకు తోడిన కార్యక్రమమే!

- ఈ కంపు మురుగు మట్టి పనిలోనూ, సంపటాలమ్మ గుడి దాక రోడ్డు ఊడ్చిన పనిలోనూ ఐదారుగురు మహిళలు కూడ!

- 2 కిలోమీటర్ల దూరంగా నలుగురైదుగురు సుందరీకర్తలు నిన్నట్లాగే అసలే అందంగా ఉన్న బాటనూ, స్వచ్ఛ మరుగు దొడ్ల గోడల్నీ పునఃసుందరీకరించడంలో నిమగ్నులయ్యారు.

- ఈ మురుగు మట్టీ, ఇసుక దుమ్ము మిశ్రమూ ఎలా సద్వినియోగపడిందనుకొన్నారు ? నడకుదురు రోడ్డు మార్జిన్లు సమతలంగా మారడానికి ఐదారుగురు శ్రమిస్తేనే!

          6.30 సమయంలో అడపా గురవయ్య ఉద్యమ నినాదాలనూ, సూక్తుల్నీ విని,

          రేపు బాగు చేసేది బందరు వీధిలో ATM ప్రాంతం నుండే అని నిర్ణయించుకొనీ కార్యకర్తలింటి కేగిరి!

         ఏం లాభం? కష్టించక

గంగులపాలెం బాటను కథలు కథలుగా చెప్పీ

సామ్యవాద వీధి సొగసు చాల మార్లు తిలకించీ

ఎవరి వార్డు, వీధి వాళ్లు ఇట్లు మార్చుకోనప్పుడు

ఏం లాభం? కష్టించక ఏ ప్రయోజనం దక్కును?

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   22.06.2023.