2806* వ రోజు....           23-Jun-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడాలా?

                   2806*వ నాటి స్వచ్ఛ సుందరోద్యమ కథ వినరండి !

          శుక్రవారం వేకువ (23.6.23) బందరు వీధిలో- ATM కేంద్రమూ, దూరంగా బండ్రేవు కోడు కాల్వ ప్రక్క పాగోలు పంచాయతీ పరిధిలోని పరిశుభ్ర టాయిలెట్లూ, విజయవాడ-నడకుదురు రోడ్ల జంక్షన్ వద్దా గంటన్నరకు పైగా జరిగిన శ్రమదాన వీరవిహారపు ఇతిహాసం అది!

          4.17-6.25 నడుమ సదరు కథను వ్రాసిన గ్రామ స్వచ్చోద్యమ కారులు ముప్పైమంది. ఏడెనిమిది మంది అంగనామణుల్తో సహా ఇందరి సమష్టి కథారచనలో :

- హీరోలూ, విలన్లూ లేరు;

- దుమ్ము కొట్టుకొన్న, చెమటలు కారుతున్న, అటు మురుగు వాసన ఇటు చెమట కంపులు తప్ప అందమైన మేకప్ వేసుకున్న - మీడియా కోసం శ్రమ చేస్తున్న పాత్రధారుల్లేరు;

 

 - కథావస్తువు చిరకాలపు తొమ్మిదేళ్ల నాటిదే - వీధి పారిశుద్ధ్యం!

- కావాలంటే ఇక్కడొక ప్రణాళికాబద్ధ - చిత్తశుద్ధి పూర్వక సామూహిక-సంఘటిత శ్రమ శక్తి కనిపిస్తుంది!

          - సమాజం పట్ల బాధ్యత, సాటివారికి చాతనైనంత ఉపకరించే నిబద్ధత, నమ్మిందాన్నా చరించాలనే - పూర్తి చేయాలనే తత్పరతా ఈ కథలో మీరు తప్పక కనుగొనగలరు!

          కార్యసాధకులకీరోజుల్లో అవసరమైన సహన గుణం సైతం  దీన్లో మీరు తగు మాత్రంగా కనిపెట్టవచ్చు!

 

- ఇంకా ఈ శ్రమదాన కథ జరుగుతున్నప్పుడు మధ్యలో కొన్ని చతురోక్తులూ, పంచ్ లూ వినవచ్చు!

          మొత్తమ్మీద ఈ సమూహం స్వచ్ఛ- శుభ్ర- పారిశుద్ధ్య పరంగా చల్లపల్లి ని కైవసం చేసుకొన్న తీరునూ గ్రహించవచ్చు.

 

          తాము డాక్టర్లో- లాయర్లో- గృహిణులో - ఉద్యోగ ఉద్యోగేతరులో- రైతులో- వ్యాపారులో పిన్నలో- పెద్దలో అనే ఐడెంటిటీని వదులు కొని "అందరమూ స్వచ్చ కార్యకర్తలమే ! అందరి లక్ష్యమూ సొంతూరి మెరుగుదలే....! "అనే  సమభావం, సామ్యవాదం ఎవరికైనా అర్థమౌతుంది!

          ఇవేమీ లేకుండానే ఈ కథ ఇన్ని వేల రోజులు సాగేదా? ఈ మాత్రమైనా ఇంత పెద్ద ఊరి వ్యధ  తీరేదా? 30-40 ఊళ్ల సచ్చింతనా పరుల కాదర్శమయ్యేదాకథలో పస లేకుంటే ఇన్ని వేలదినాలుగా నేను రాసే చప్పిడి కథనాలు చదివేవారా?

          నేను ముందే చెప్పినట్లు - పై లక్షణాలన్నిటినీ పుణికి పుచ్చుకొన్నదే ఈ 2806 వ నాటి శ్రమ దానం కూడ! ఫలాన కార్యకర్త ఫలానా పని సాధించాడని ప్రత్యేకించి చెప్పలేను గాని గతవారం రోజుల కష్టంతో సుమారొకటిన్నర కిలోమీటర్ల జాతీయ రహదారి ఎంతపొందిగ్గా - శుభ్రంగా ఉన్నదో గమనించమంటాను!

          అటు అవనిగడ్డ వైపున్న స్వచ్ఛ - సుందర మరుగు దొడ్లు ఎంత 5-7 నక్షత్రాల హోటళ్లలో లాగా ఉన్నదీ కార్యకర్తలూడ్చిన, ఎత్తిన ఇసుక, మట్టీ తో ఎన్ని రోడ్ల  మార్జిన్లు బాగుపడ్డదీ గుర్తు పెట్టుకోమంటాను.

          నేటి శ్రమ సమీక్షా కాలంలో జాస్తి జ్ఞాన ప్రసాదుని ఉద్యమ సంకల్ప నినాదాలూ, షణ్ముఖ-శ్రీనివాసుని అదో రకమైన విరాళమూ ప్రముఖాంశాలు.

          రేపటి శ్రమదాన సంసిద్ధత కూడ ATM సెంటరు - కోట కూడలి నడుమనే ఉండునట!

 

            భుజకీర్తులు నిలువవు గద!

తండ్రిగారి మీసంతో - ముత్తాతల గొప్పలతో

 మనవంశం ప్రతిష్టతో- కులదేవత కొలుపులతో

మన గ్రామం వెలుగదు గద - భుజకీర్తులు నిలువవు గద!

ఏంలాభం? కష్టించక ఏ ప్రయోజనం చిక్కదు.

 

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   20.06.2023.