2807* వ రోజు ....           25-Jun-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడాలా?

                   వర్షమున్నా ఆగని 2807* వ నాటి శ్రమదానయజ్ఞం!

        ఆదివారం (25.6.23) నాటి సదరు యజ్ఞ వేదిక గంగుల పాలెం దగ్గరి జాతీయ రహదారి. అసలైన కర్మిష్టులు 40 మందైతే - ఏదోరకంగా అందులో వేళ్ళో-కాళ్ళో పెట్టిన వారు 38 మంది ! అందులో మళ్లీ 30 మంది వయస్సు మళ్లిన వైద్యులు !  వణిక్ప్రముఖులు, పాత్రికేయులు, వగైరాలు!

        4.30 కు మొదలైన శ్రమ సందడి ఫోటోలతో, వైద్య సహాధ్యాయుల కేరింతలతో, నలుగురు భిషక్కుల శ్రమదానోద్యమ ప్రశంసలతో 6.40 కి గాని ముగియలేదు!  మైకు నుండే కాక- నందేటి శ్రీను గళం నుండీ కొన్ని సందర్భోచిత గేయాలాపనలు !

        ఈ సందడిలో సింహభాగం - 1977లో గుంటూరు వైద్యకళాశాలలో తొలి మారు కలిసి - తదుపరి ఆరి తేరిన వైద్యులుగామారి, ఎక్కడెక్కడి నుండో చల్లపల్లిలో పునః సఖ్యత కోసం నిన్న వచ్చి - నేటి శ్రమదానంలో పాల్గొన్న వైద్యులదే!   

        పడి కట్టు రాళ్లుగా మారిన

“ సామాజిక బాధ్యత, సంఘ సేవ, శ్రమదానం” వంటి మాటలు  ఇప్పుడు అన్ని చోట్లా వినిపిస్తుంటాయి గాని, నేటి వేకువ స్వచ్చోద్యమ చల్లపల్లి లో –

        అసలెవరెవరికి స్ఫూర్తి ? 30 మంది సుప్రసిద్ధ వైద్య ప్రముఖులు చల్లపల్లి కార్యకర్తలకా?

స్వచ్చ కార్యకర్తలే ఆ వైద్యులకా? అనేది తరువాతి కాలంలో గాని తేలదు!

        ప్రస్తుతం తేలని మరొక వివాదమేమంటే :

“ ఇప్పటికే మీనుండి మా ఊరి కోసం ఎక్కువ చందా తీసుకొన్నాం, మళ్ళీ ఇప్పుడు ఇవ్వోద్దులే” అని స్వచ్చోద్యమ కర్తా,

అందుకు చిరుకోపిస్తూ- “ ఆ మాట అంటానికి నువ్వెవడివి, నీ ఇంట్లో పెళ్లికిస్తున్నామా? మాకామాత్రం బాధ్యత లేదా”....  అని గురవారెడ్డి మహాశయుడూ వాదించు కోవడం!

        ఎవరి పంతం నెగ్గినా – చల్లపల్లి ప్రజల్లో నిలిచి గెలవ్వలసింది సామాజిక సద్యః స్ఫూర్తి ! గ్రామస్తుల స్వశక్తే ప్రధానంగా – సర్వాంగ సుందరంగా – మన సమకాల ప్రపంచానికి మంచి ఉదాహరణగా నిలిచిపోవలసింది స్వచ్చ- సుందర చల్లపల్లి!

        అది బురదైనా – వానలో తడుస్తూ నైనా – ఎన్నడూ లేనిది చిత్రంగా లక్షల పురుగులు ముసురుతున్నా – అరకిలో మీటరు బారునా 100 సువర్ణ గన్నేరు పూల మొక్కలు నాటిన స్వచ్చ – సుందరోద్యమానికీ అభివందనలు!

        ఎన్ని దూరాల నుండో వచ్చి – చల్లపల్లి నాశీర్వదించి, ఆశ్చర్యపడి, అభినందించిన వైద్య ప్రముఖులకు నివాళులు!

        బుధవారం నాటి మన శ్రమ వేదిక – వర్షం లేకుంటే బందరు వీధిలోని ATM కేంద్రం, వర్షం ఉంటే-గంగులవారిపాలెం దగ్గరి రహదారి.

     ఎంతభిమానం ఉంటే

వేకువ శ్రమ కోర్చువారు మీకెక్కడ కనిపించరు

అధవా కనిపించిననూ దశాబ్దాలు కష్టించరు

ఎంతభిమానం ఉంటే - ఊరినెంత ప్రేమిస్తే

చల్లపల్లి స్వచ్చోద్యమ సంరంభం ఇట్లు సాగు?

 

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   25.06.2023.