2808* వ రోజు ....           26-Jun-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు అవసరమా?

గ్రామ సహాయక చర్యల్లో 2808* వ వేకువ సమయం!

          ఇది సోమవార (26.6.23) మైనందుననూ, ఋతువు మారి వాన, గాలి దెబ్బకు ఏదోక చోట ఏ చెట్టో విరిగి పడుతున్నందుననూ, ‘ఊరి సంరక్షక దళమనే బిరుదనామం కల కొందరు కార్యకర్తలకీ వేకువ చేతి నిండా పని పడింది!

          మహాభారత కథకు చెందిన అలనాటి మాయాబజార్లోని దుష్ట చతుష్టయంకు భిన్నంగా వాలంటీర్ల బెస్ట్ చతుష్టయం అవసరం ఈ పూట RTC ప్రాంగణానికొచ్చిపడింది - స్వచ్ఛ కార్యకర్తలు రూపొందించిన అక్కడి పూలతోటలోని వేప చెట్టు విరిగి పడితే దాని మీద స్వచ్ఛ కార్యకర్తల కన్ను పడకుంటుందా?

          చెట్టేమో పెద్దది; నేలంతా బురద - నీళ్లమయం; పడినప్పుడు దెబ్బతిన్న పూలమొక్కలు, ఇనుపవల కంచె దెబ్బ తిన్నందు వల్ల - బహుశా ఈ ఉదయం వేప చెట్టు కొమ్మల్నరికి, కంచె బైటకు తెచ్చి, చిన్న పూల మొక్కల్నీ, మెష్ నీ సరిచేసే పనులన్నీ ఈ వేళ పూర్తికాకపోవచ్చును.

          ఊళ్లో వేరే అవసరాలు పిలుస్తున్నా ఈ రెస్క్యూ టీం రేపు కూడ ఇక్కడే పని పూర్తిచేయవలసి ఉంటుంది. నేటి, రేపటి శ్రమదానంతో ప్రభుత్వ రవాణా ప్రాంగణం యధాస్థితికి వస్తే చాలు!

          రేపైనా - ప్రయాణికులో, RTC అనుబంధ సిబ్బందో ఈ స్వచ్ఛ కార్యకర్తలకు ఏ కాస్తయినా సహకరిస్తారేమో చూడాలి.

          కస్తూరి శ్రీనివాసుడు ముమ్మారు పలికిన స్వచ్ఛ సుందర సంకల్ప నినాదాలతో నేటి రెస్క్యూ టీమ్ కృషి ముగిసింది.

          పూజ చేయలేరు నిజం!

బ్రతుకు బండి లాగుటకే చాలీచాలని సమయం

నిలకడగా యోజించే నిముషమైన లేని జనం

సామాజిక బాధ్యతతో గ్రామాభ్యుదయం కోసం

రోజుకొక్క గంటైనా పూజ చేయలేరు నిజం!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   26.06.2023.