2810* వ రోజు ....           28-Jun-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు అవసరమా?

2810* వ శ్రమదానం 28.6.23 (బుధవారం) నాటిది!

శ్రమదాన కర్ణులేమో 27మంది; కార్యక్షేత్రాలేమో

1) షాబుల్ వీధి మొదలు సంత వీధి దాకా,

2) ముత్తూట్ ఫైనాన్స్ - కూరల దుకాణాలూ,

3) ATM కేంద్రాలూ,

4) రెండో - మూడో దేవాలయాల వద్దా.

          మరి - వీటిని కార్యకర్తలు వారం రోజులనాడు బాగు చేయలేదా అంటే - చేశారు, వాళ్ళ ప్రవృత్తి అదే గనుక!

          మళ్లీ ఆ 100 - 150 గజాల్లోనే ఈ వేకువ మరింత స్వచ్ఛత కోసం - అమరిక కోసం పూనుకోవడం ఏమన్నా వ్యసనమా అంటే - అవునదొక బలహీనతలాగే ఉంది!

          స్వచ్ఛ వాలంటీర్ల చేతుల్లో బడి, పరిశుభ్ర సుందరంగా మారిన ఇంత మంచి వీధుల్లో పుసుక్కున చెత్త విసరడం కొందరు గ్రామస్తుల అనాలోచిత చర్యయితే – ఆ కళంకం చూసి తట్టుకోలేని బలహీనత ఈ పాతిక – ముప్ఫై మందిది!

          మొండి వాళ్లు రాజుకన్నా బలవంతులంటారు - చూద్దాం - తొమ్మిదేళ్లయినా ఊరి స్వచ్ఛ – సౌందర్యావగాహన రాని కొందరు గ్రామస్తులో, విచక్షణతో - సహనంతో తమ పని తాము చేసుకుపోతున్న కార్యకర్తలో - ఎవరెక్కువ మొండి ఘటాలో –

          ఇక - నేటి శ్రమవీరుల వీధి పారిశుద్ధ్య కృషి సంగతా - అది క్రొత్తగా చెప్పేదేముంది? 2 - 3 వేల దినాల్నాడో తమ ప్రతి రోజులో గంటన్నర సమయాన్నీ, బుద్ధినీ, అవసరమైనప్పుడు తమ కష్టార్జితాన్నీ ఊరి బాగుదలకు అంకితం చేసేశారు గదా! బదులుగా ఎనలేని సంతృప్తిని పొందుతూనే ఉన్నారు గదా! ఈ ఉదయమూ అంతే!

          మూడు దుకాణాల ఎదుట నాలుగంగుళాల మందపు మట్టీ - రాళ్లూ త్రవ్వి ఆరేడుగురు దాన్నెత్తి ట్రక్కులో నింపి, ఏ రోడ్డు మార్జిన్లో సరిదిద్దారంటేనూ –

          డజను మంది యుద్ధ ప్రాతిపదికన ATM ల దగ్గర చీపుళ్లతో ఊడ్చి, మట్టి చట్టుల్ని పొడిచి, డిప్పల్తో మోసి, టాటా ఏస్ ను నింపారంటేనూ –

          పవిత్రత - పరిశుభ్రతల నిలయం కావలసిన 3 గుడుల ఎదుట వంచిన నడుము లెత్తకుండ అద్దంలా శుభ్ర సుందరీకరించారంటేనూ –

          మొదటి మారు చూస్తున్న వాళ్లకదొక అర్థం కాని బ్రహ్మ పదార్థం! ఏళ్ల తరబడీ గమనిస్తున్నా ఎప్పటికప్పుడు నాబోటి వాళ్లకేమో ఆ సామాజిక బాధ్యతను చూసి ఒళ్లు గగుర్పాటు!

          6.25 కు ఎక్కువ మంది కార్యకర్తల మొహాలు దుమ్ము కొట్టుకొని, లాగూ చొక్కాలూ, చీరలూ చెమటలు పీల్చి అదోలా   కనిపించారు గాని - ఈ రెండు గంటల శ్రమదాన స్ఫూర్తీ – సంతృప్తీ కొట్టొచ్చినట్లు తెలుస్తున్నాయి!

          తుది మీటింగులో ఆదివారం నాటి 30 మంది రాష్ట్ర – దేశవ్యాప్త వైద్యుల చల్లపల్లి సందర్శనా, వాళ్ల సంస్పందనా ప్రస్తావనకొచ్చాయి.

          రేపటి వేకువ శ్రమదాతలు రావలసింది ATM కేంద్రానికే ననే నిర్ణయమూ జరిగింది.

          ఎవరికి మాత్రం ఉండదు?

ఎవరికి మాత్రం ఉండదు? తమ ఊరత్యుత్తమముగ,

స్వచ్ఛ - శుభ్ర - సంస్కృతముగ, నిండు హరిత శోభితముగ,

అందరి కాదర్శముగా – స్వచ్ఛ చల్లపల్లిలాగ

సుమ సుందర సౌరభముగ శోభస్కర మవ్వాలని!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   28.06.2023.