1936*వ రోజు....           29-Feb-2020

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ఏ ప్లాస్టిక్ వస్తువులనూ వాడం!   

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం1936* వ నాటి సంగతులు

          ఉత్సాహభరితంగా నడచిన నేటి గ్రామ కర్తవ్యాలు ఈ వేకువ 4.01 నుండి 6.30 సమయాల నడుమ 1) గంగులవారిపాలెం దారి, 2) కమ్యూనిస్ట్ వీధి, 3) పెదకళ్లేపల్లి రహదారిలో – త్రివిధంగా కృతకృత్య మైనవి. ఈ నిస్వార్ధ కృషిలో భాగస్తులు 33 మంది.

          గ్రామ రక్షక దళం అనబడే ఉత్సాహవంతులు తొలుత గంగులవారిపాలెం సుందర మార్గంలోని దారి తోటలోని కొన్ని వ్యర్ధాలను ట్రాక్టర్ లో నింపుకొని, ప్రధాన శ్రమదాన స్రవంతిలో కలిసి, మిగతా సమయమంతా అక్కడే కష్టించారు.

          సుందరీకరణ బాధ్యులు కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయ ప్రహరీ గోడకు మరిన్ని రంగులుదిద్దారు. (వాట్సాప్ ఛాయా చిత్రాలు గమనించండి.)

          గత పది రోజుల శివరామపురం దారి స్వచ్చ – శుభ్ర – సుందరీకరణను 25 మంది కార్యకర్తలు ఈరోజు పూర్తి చేశారు. నాగభూషణం గారి ఇంటి ఎదుట రోడ్డు వార పడి ఉన్న తారు పెచ్చుల్ని ట్రాక్టర్ కెత్తి దారి భద్రత కు అవసరమైన చోట్ల సర్దారు. బస్ ప్రాంగణ సమీప వంతెన దాక దారిని చీపుళ్లతో శుభ్రం చేయడం ఆరేడుగురు మహిళా కార్యకర్తలు నిర్వర్తించారు. మురుగు కాల్వల వ్యర్ధాలు లాగి, ఎండిన కొబ్బరి బొండాలను ఊడ్చి, ప్లాస్టిక్ సంచులు పోగుచేసి, కుడి ఎడమల రోడ్లను సైతం సంస్కరించిన వీరి కృషికి గ్రామస్తుల తరపున ధన్యవాదాలు.

          కాఫీ – టీ ఆస్వాదనల పిదప జరిగే దైనందిన శ్రమదాన సమీక్షా సమావేశంలో –

- రేపటి యార్లగడ్డ కు స్వచ్చ సందేశ యాత్ర ను వివరించారు. వీలైనంత ఎక్కువ మందిని ఇందుకు సమీకరించాలని నిశ్చయించారు.

          స్వచ్చ యార్లగడ్డ రధసారధి తూము వేంకటేశ్వరరావు ముమ్మారు ప్రకటించిన గ్రామ స్వచ్చ - శుభ్ర – సంకల్ప నినాదాలతో నేటి స్వచ్చంద గ్రామ బాధ్యత ముగిసింది.

          రేపటి “శుభ్ర – సుందర సందేశ యాత్ర” కోసం 4.40 నిముషాలకు బందరు రహదారిలోని కీర్తి ఆసుపత్రి దగ్గర కలుద్దాం!

           సృజన శక్తి పురోగమనం

జాతకాలను ముహూర్తాలను సరకు చేయని స్వచ్చ సైన్యం

ఐకమత్యమే బలం అనుకొని స్వయం సేవనె నమ్ముకొంటూ  

స్వచ్చ సుందర చల్లపల్లి ని స్వాగతిస్తూ – సృజన శీలత

ప్రదర్శిస్తూ – సుదీర్ఘ కాలం పరవశిస్తుందా!

నల్లూరి రామారావు

స్వచ్చ చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు - మనకోసం మనం ట్రస్టు,

శనివారం – 29/02/2020

చల్లపల్లి.      

4.03 కు శివరాంపురమ్ రోడ్డులో