2811* వ రోజు ....           29-Jun-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు అవసరమా?

ఇది 2811* వ వేకువ సమయపు స్వచ్చోద్యమ ఇతిహాసం.

            తారీఖుల ప్రకారం గురువారం - 29-6-23 – 4:20, 6.15 నడిమి కాలపు 20+4 మంది శ్రమదాన చరిత్రన్న మాట! (నలుగురు ఈ నాటి కొసరు కార్యకర్తల్లెండి!)

            ఈ కథలో విలన్ పాత్ర పోషించింది వరుణుడు! అతగాడు 3.30 కే - స్వచ్ఛంద శ్రమదాతల కన్న ముందే మేల్కొని, ఉనికి చాటు కొనడం వలన – కథా స్థలం 2 కిలోమీటర్ల దూరానికి మారింది – ATMకేంద్రం నుండి గంగులపాలెం వీధిలోనికి!

            వాన వెలిసింది గాని - బాటకు రెండు ప్రక్కల గడ్డీ - పిచ్చి మొక్కల్నిండా నీటి బొట్లు, తడి, చిత్తడీ! ఊళ్ళోకెల్లా స్వచ్ఛ - సుందర బంధురమని కీర్తింపబడుతున్న ఈ వీధిలో సైతం - మురుగు నీరు నిలిచి – కంపుగొడుతున్న ఒక కళంకం దగ్గర ఇద్దరు వియ్యపురాళ్ళ శ్రమ విన్యాసాలు! పొరపాటున ఆ తడి - పొడీ నేల మీద కాళ్ళు జారి ప్రక్కన లోతైన డ్రైనులోకి ఒరిగిపోతారని నాకు భయాలు!

            బాటకు పశ్చిమాన – రెండిళ్ల నడిమి ఖాళీ దగ్గర - బురద లేదు గాని – రాతి ముక్కల ఎగుడుదిగుళ్లూ - ముళ్ల మొక్కలూ తట్టుకొని ఆరేడుగురి కత్తుల - దంతెల చేష్టలు!

            సన్ ఫ్లవర్ కాలనీ వీధి మొదటా, తూర్పు దిశగానూ జోడు కత్తుల వారి – జోడు చీపుళ్ల వారి శ్రమదాన లీలలు!

            మొత్తమ్మీద - ప్రకృతి ఆటంకం వల్ల పని స్థలం మారినా, కొన్ని నిముషాలు ఆలస్యమైనా పని కుంటుబడలేదు, చూస్తుండగానే డజన్ల కొద్దీ ప్లాస్టిక్ సంచులూ - నీళ్లు, మద్యం, శీతల పానీయ సీసాలు పొగుబడి, ట్రాక్టర్ నిండుగా వ్యర్ధాలు నిండనే నిండాయి!

            మునుములో దిగి చేసే వాళ్ళకెలా ఉంటుందో గాని - చూసే వాళ్లకు మాత్రం “ఒక ఆదర్శ సామాజిక శ్రమదానం ఇంత తేలిగ్గానా? ఇంత వేడుకగానా?....” అనిపిస్తుంది!

            ఒక సమూహంగా, స్వయం ప్రేరితంగా, స్వార్ధరహితంగా జరిగే సామాజిక కార్యక్రమం ఇలా ఉంటుందన్న మాట!

            ఈ శ్రమదాన పండుగ దినదిన ప్రవర్ధమవ్వాలనీ, మానవతా విలువలు గుబాళించాలనీ, దేశంలో కనీసం ఒక్క గ్రామం వీటన్నిటికీ ఉదాహరణగా నిలవాలనీ కోరుకొందాం!

స్వచ్చ – సుందరోద్యమ నినాదాల సంగతికొస్తే :

            నిన్న రామానగరం రాజు గారూ, నేడు గ్రామ తొలి మహిళా ఆ బాధ్యత తీసుకొన్నారు!

            నిన్న 2 గడ్డి వాములు కాలిపోతుంటే - పట్టించుకోని కొందరు గృహస్తుల్నీ, నానాటికీ లుప్తమౌతున్న సహకారగుణాన్నీ సర్పంచి గారు ప్రస్తావిస్తున్నపుడు కార్యకర్తలు ‘అందె శ్రీ గారి మాయమైపోతున్నడమ్మా! మనిషన్న వాడు.....’ అనే పాటను గుర్తుచేసుకొన్నారు!

            మన రేపటి వేకువ కలయిక వానదేవుడి మీద ఆధారపడి –

            అతడు రాకుంటే ATM కేంద్రం దగ్గరా,

            వస్తే గంగులవారిపాలెం వీధి యందు ఉండునట!

            అంతరం లేదందురా మరి?

వీర పూజకు - వాస్తవం గుర్తించడానికి భేదమున్నది

జ్ఞాన భక్తికి - మూఢ భక్తికి చాల వ్యత్యాసమే ఉంటది

కార్యకర్త సుదీర్ఘ సమయపు కఠిన శ్రమలను మెచ్చడానికి,

ఆకసానికి ఎత్తడానికి అంతరం లేదందురా మరి?

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   29.06.2023.