2812* వ రోజు ....           30-Jun-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడాలా?

2812* వ తూరి స్వచ్ఛ - సుందరోద్యమం!

            ఆ నాటౌట్ (*) సంఖ్య శుక్రవారం (30.6.23) నాటిది; ఉద్యమకర్తలు 24 మంది; వాళ్లు పాల్పడింది ఈ కాలంలో ఏ మాత్రం గౌరవ ప్రదమైన పనికీ కాదు; ఆమాట కొస్తే - రోజుకు వెయ్యి రూకలిచ్చినా - ఇలా వీధి మురుగు కాల్వల పారిశుద్ధ్య పనికి ముందుకొచ్చే వాళ్లే లేరు!

            పైగా ఇదేదో నిన్నా - మొన్నటి మురికి పనులూ కావు - ఈ ఊళ్లోనూ - బైటా తగు మాత్రం గౌరవ మర్యాదామన్ననలున్న వ్యక్తులే! కొందరైతే - బొత్తిగా తీరికుండని వాళ్లే ఐనా కనీస సామాజిక బాధ్యతల చేతికి చిక్కి - తప్పించుకోలేని గ్రామ పౌరులు!

            ఐతే ఆ చేసేదేదో చిత్తశుద్ధితోనూ - ప్రణాళికాబద్ధంగానూ - రోజుకు గంటన్నరే కావచ్చు శక్తివంచన లేకుండానూ - ప్రతిఫలాపేక్ష లేకుండానూ - ఒక ఐక్య సంఘటన గానూ విసుగూ విరామం లేకుండానూ చేసుకుపోవడమే క్రమంగా చల్లపల్లికొక వరంగా మారుతున్నది!

            ఈ మాత్రం సొంతూరు పట్ల అంకితభావం, నమ్మిన కార్యాచరణం, శ్రమ - ధన త్యాగం గ్రామ పౌరుల్లో ఉండాలే గాని - ఏ వూరైనా బాగుపడడం ఎంత సేపు?

            నేటి కార్యకర్తల్లో సగం మందైతే మరీ 4.10 కే - ఎక్కడెక్కణ్ణుంచో ATM సెంటరుకు చేరుకొన్నారు. పని మీద ఎక్కడికెళ్లాడో గాని వరుణ దేవుడి జాడలేదివాళ!

            అందువల్ల

            నేటి 110 నిముషాల, వీధి శుభ్ర - సుందరీకరణ ప్రయత్నం సాఫీగా జరిగిపోయింది. గ్రంథాలయ వీధి దగ్గరి డ్రైను పని కావచ్చు, 100 గజాల బందరు బాట ఊడ్పులు కావచ్చు, బంకు ప్రక్క తోపుడు బళ్ల దగ్గరి గలీజులు కావచ్చు, చిన్నకార్ల నిలుపుదల చోట బాగుచేతైనా కావచ్చు - స్వచ్ఛ - సుందర చల్లపల్లికి తగ్గట్లుగా నెరవేరిపోయాయి!

 

            తమ నేటి 40 కి పైగా పని గంటల శ్రమ ఫలితంగా సువిశాల రహదారి ఏ మేరకు ఎన్ని మార్కుల డిస్టింక్షన్ లో ఉత్తీర్ణమైందనేది ఏ కార్యకర్త ముఖ కవళికలు చూసినా ఇట్టే తెలిసిపోదా?

            అందుకే - సమీక్షా కాలంలో DRK వైద్యుల వారు స్వచ్ఛ కార్యకర్తల పట్టుదల గురించి ఎన్ని వందలమారో గాని, “అందరూ అగౌరవప్రదమని భావించే ఇంత శ్రమను - ఈ రోజుల్లో ఎవరు చేస్తారు...అని ఆశ్చర్యపడేది!

            పరిసరాల జనం ఉలికి పడేట్లు - గట్టిగా కోడూరు వేంకటేశ్వరావు గారు స్వచ్ఛ - సుందరోద్యమ సారాంశాన్ని మూడు మార్లు నినదించింది!

            రేపటి మన కృషిని బందరు రహదారిలోనే - చిన్న కార్ల స్టాండు దగ్గర కలిసి, సెంటరు దిశగా కొనసాగిద్దాం!

            మాట వరుసకొ ఉదాహరణకొ

మాట వరుసకొ - ఉదాహరణకొ - మచ్చుతునకకొ చేయు పనుల?

ప్రలోభాలకొ ప్రచారాలకొ - వార్తకెక్కే సేవలా ఇవి?

స్వచ్ఛ సుందర గ్రామమునకై ఆరు ఋతువులు - అన్ని రోజులు

కార్యకర్త కఠోర శ్రమ కైంకర్యములుగా జరుగు కృషియా?

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   30.06.2023.