2813* వ రోజు....           01-Jul-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు అవసరమా?                                                       

         స్థిరవారపు వేకువ సుస్థిర శ్రమదానం- @2813*

 

జులైమాసపు తొలి దినాన 31 మంది సామాజిక బాధ్యుల మహత్తరదానమది !

అన్నిదానములు కన్న అన్నదానము మిన్నవంటి సూక్తులెన్నో విన్నాంగాని – నేటి కాలాని కవసరమైన- ఒక నిర్దిష్ట ప్రయోజన మాసించి,ప్రణాళికా బద్ధంగా – సామూహికంగా చేసే ఈ శ్రమదానం ప్రత్యేకత వేరు! ఇదొక బహుళార్ధ సాధక – ప్రయోగాత్మక దానమన్నమాట!

 

         చిత్తశుద్ధితో నిరంతరంగా జరుగుతున్న ఈ దాతృత్వంతో:

 - ఒక పాతిక వేల జనాభా ఉన్న పెద్ద ఊరి స్వచ్ఛ- శుభ్ర -సౌందర్యాలలో గణనీయమైన ప్రగతి వచ్చింది !

-  ఊళ్ళో అందర్లో కాకునా – కొందర్లో నైనా అంతర్మధనం జరుగుతున్నది !

- 30/40  గ్రామాల సచ్చింతనా పరులు తమ ఊళ్లలో స్వచ్చోద్యమాలు నిర్వహించడానికి కారణభూతమయింది.  

- ఒక సువిశాల గ్రామంలో ఎన్నెన్నో వసతులకు హేతువయింది!

-  ఎక్కడెక్కడి, ఎందరెందరి అర్థదాతృత్వ ప్రబోధకమూ అయింది.

         ఇందుకొక తాజా తార్కాణం - హైదరాబాదీయ విద్యార్థినులు ముగ్గురు ఈ వేకువ వీధి పారిశుద్ధ్య కృషి లో చేరడం - గంటన్నర దుమ్ము మురికి పనుల తర్వాత మనస్విని (వైద్య ), భవ్య (ఇంజనీరింగ్), సాహితి (రీసర్చ్ ) ల కళ్లలోఉట్టి పడిన సంతృప్తి ! ఇక వీళ్ల పెద్దలు -అన్నవరపు రామ మోహన రావు, శివయ్య లైతే ఈ స్వచ్ఛ సుందరోద్యమ సత్సంబంధీకులే!

         నేటి శ్రమ దాతృత్వంలో కొన్ని ముఖ్య ఘట్టాలు:

1) చూసేవాళ్లకు బాగుందనిపించినా, స్వచ్ఛ- శుభ్రతల లోతులు చూడగల 12 మంది కార్యకర్తల కఠిన శ్రమను గణేష్ ఆఫ్ సెట్ ప్రింటర్స్ నడవా జీర్ణించుకోవడం;

2) మరో ఏడెనిమిది మంది ముక్కుల్నీ – ఊపిరితిత్తుల్నీ  బంకు ఎదుటి కొబ్బరి బొండాల దుకాణం-వానకు తడిసి నాని మురిగి, అగ్ని పరీక్షకు గురిచేయడం;

 

(ఆ సరుకును ట్రక్కులో కెక్కించాక -10 గజాల దూరంలో నన్నూ, ప్రయాణికుల్నీ మురుగు కంపు వదల్లేదు!)

 

3) చిన్న కార్ల స్టాండు మొదలు 3 వీధుల కూడలి దాకా - ఒక శుభ్ర - సుందరమైన వీధంటే   ఎలా ఉండాలో చేసి చూపిన డజను మంది కార్యకర్తల పట్టుదలే పట్టుదల !

 

4) ఖాళీ సీసా లేరిన, వీధి దుమ్ము ప్రోగులు, ట్రక్కులో నింపి తెచ్చి పల్లాలు పూడ్చిన, వ్యర్థాల్ని మోసి, ట్రాక్టర్ నింపిన కార్యకర్తల శ్రమ ఎంత సార్థకం!!

 

         6.20 కి జరిగిన సమీక్ష వేడుకలో:

 - ఆకుల దుర్గాప్రసాదు అదరగొట్టిన శ్రమదానోద్యమ నినాదాలూ,

 

-  రోటరీ అధ్యక్షుడుగా శివబాబు పొందిన పురస్కారాలూ, గ్రామానికి చేసిన - చేయనున్న వసతి కల్పనలూ, సోమవారం గురు పౌర్ణమి నాటి- మోపిదేవి విందుకాతని ఆహ్వానములు..  ఇంకా ఇతర విశేషాలూ !

 

రేపటి వేకువ 100 పూలమొక్కల ప్రతిష్ఠాపనకు గాను జాతీయ ఉపరాదారి (గంగులపాలెం దగ్గర) మన గమ్యస్థానం!

                 శ్రమదానమె జవాబుగా

         గ్రామ సమాజం అప్పులు కాస్తైనా తగ్గించిరి

         మానవతా ప్రమాణాలు మరి కొంచెం హెచ్చించిరి

          పనికిరాని విమర్శలకు శ్రమదానమె జవాబుగా

         తొమ్మిదేళ్లు ఊరి స్వచ్ఛ - సౌందర్యాలను పెంచిరి !

 

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   01.07.2023.