2814* వ రోజు....           02-Jul-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడాలా?

               హరిత సుందరోద్యమంలో 2814*వ సమయం !

         2-7-2023  వేకువ కాలం రాత్రి కురిసిన జల్లుతోనూ - ఆదివారమైనందున ఆహ్లాదకరమే గాని – ఏ 40 మందో వస్తారనుకొంటే - ఊరికి దూరమైనందువల్లేమోగాని - ఒక అపరిచితునితో సహా 30 మందే-నిన్నటి నిర్ణయం ప్రకారం గంగులపాలెం దగ్గరి రహదారి వద్ద కనిపించారు.

        ఉద్దేశం -  ఆ రాదారి దక్షిణం కొసన మరొక 100 పూల మొక్కలు నాటడం, అందుకడ్డు పడే పిచ్చి – ముళ్ల మొక్కల్నీ, గడ్డినీ, రాళ్లు రప్పల్నీ తొలగించడం వగైరా !

 

“ఏడెనిమిదేళ్లుగా 30 వేల - అనేక జాతుల చెట్లను నాటి, సాకింది చాలక మళ్ళీ ఈ వందల- వేల పూల మొక్కలీ చల్లపల్లి కవసరమా?” అంటే -

        ఐదారుగురు కార్యకర్తలకు అత్యవసరమనే తోచిందట! అదేమంటే- " ఈ జాతీయ రహదారి మీదుగా వచ్చి పోయే అన్ని జిల్లాల వేలాది మందికి ఇది స్వచ్ఛ సుందర-హరిత- వినుత చల్లపల్లని చప్పున తెలియాలా వద్దా?" అని వాళ్ల ఎదురు ప్రశ్న!

 

        గతాదివారం 30 మంది(సామాజిక) వైద్యులు నాటినవి కాక అంతకు ముందు దారికి ఉత్తరాన కార్యకర్తలు పెట్టి బ్రతికించినవి కాక - ఈ ఉదయం కార్యకర్తలు పోటీపడి, శ్రమించి నాటినవి మూడో వంద పూల చెట్లు!

         మనలో ఎవరికైనా “ ఇదేదో హరితమేనియా... “

అనిపిస్తుందేమోగాని – నేటి శ్రమ సమీక్షా కాలంలో DRK డాక్టరు గారి విశ్వవ్యాప్త దేశాల తలసరి మొక్కల లెక్కలూ, నందేటి వారి వృక్ష హరిత గానమూ విన్నాక నేటి 100 పూల చెట్ల అమరిక వేలం వెర్రి కాదనీ - అత్యావశ్యక కృషనీ అంగీకరించి తీరాలి మరి!

        నేటి తలా వంద నిముషాల - గడ్డి పీకిన,పుల్ల లేరిన,  గోతులు త్రవ్విన, కొలతల ప్రకారం పూల మొక్కలు ప్రతిష్ఠించిన 29 మంది శ్రమంటారా?  దానికేం - ఊరి నిర్దిష్ట బాధ్యతల్ని సంతోషంగామోస్తున్న- ఒక రకంగా శ్రమదానానికి 'ఎడిక్ట్' ఐపోయిన ఈ వాలంటీర్ల కదేం లెక్క ?

 

'ఈ ఆదివారం శ్రమ వేడుక లేదు' అంటే వాళ్ళకిబ్బందిగాని, ఒక రహదారిలో 300 గజాల హరితీకరణమంటే వాళ్లకది పరమానందమేకదా!

        భూటాన్-బ్రెజిల్, కెనడా.. అమెరికాలంతగా కాకున్నా భరతదేశంలో కాదు- ఆంధ్ర రాష్ట్రంలో కాదు- కనీసం -  ఒక చల్లపల్లిలోనైనా- జనాభాలో తలకొక వంద చెట్లైనాపెరిగి,  నీడనూ,ప్రాణ ప్రద వాయువునూ, ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్నీ పంచడం ఏ స్వచ్ఛ కార్యకర్తకిష్టం కాదు ?'

 

 మన ‘బుధవారం’ వేకువ బాధ్యత గ్రామ 3 రోడ్ల కూడలి యందని ప్రకటింపబడెను.

 

                              మాయమై పోలేదు చూడూ.....

 

మాయమై పోలేదు సుమ్మా! మనిషన్నవాడూ

 ప్రత్యక్ష మౌతున్నడమ్మా! స్వచ్ఛ కార్యకర్తను వచ్చి చూడూ ॥

మనిషి విలువలు నేడు దేశమందెట్లున్న - చల్లపల్లికి వచ్చి చూడూ

అవి కాస్త తలలెత్తి బ్రతికుండె నేడూ

అవినీతి,స్వార్ధమూ దేశమందంతటా పడగెత్తి బుసకొట్టుగానీ

 ఇచట అణగి మణగుంటాయి చూడూ

                            ॥ మాయమైపోలేదుసుమ్మా ॥

ఏనాటి శనొగాని-“పది మందికోసమూ పని చేస్తె తప్పన్న” వరసా

ఇచట బలహీన పడుచుండె చూడూ- అది పల్లెలకు రామరక్షా

‘ కాయకష్టంతోనె ఊరికీ, వంటికీ - కలుగు స్వస్తత’ అన్న సూక్తీ

 కొందరాచరిస్తున్నారు చూడూ

                               ॥ మాయమైపోలేదు సుమ్మా! ॥

ఊరి కోసం వాళ్లు కష్టనష్టాలోర్చి-' శ్రమయేవ జయ 'మనే సామెతను సృష్టించి

పాటుబడు పద్ధతిని చూడూ- ఊరు నందనంగా మారెనేడూ

మానవత్వానికి సమాజ శ్రేయస్సుకూ - ఇది మంచి సాక్ష్యమీనాడూ

దీన్ని దేశవ్యాప్తంచేసి చూడూ

                         ॥ మాయమైపోలేదుసుమ్మా!  మనిషన్నవాడూ

                        ప్రత్యక్షమౌతున్నడమ్మా! స్వచ్ఛ చల్లపల్లికి వచ్చిచూడూ॥

 

[ఈ పాట మాతృక కర్త 'అందెశ్రీ' కి క్షమాపణలతో...

క్రొత్తపాట పుట్టుకకు ప్రేరకులైన ఇద్దరు రైతు కార్యకర్తలకంకితంగా]

 

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   02.07.2023.