2815* వ రోజు ....           03-Jul-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు అవసరమా?

ఊరి మెరుగుబాటు కృషిలో 2815* వ నాడు.

          సోమవారం(3-7-23) వేకువ కాలపు సదరు కృషి నలుగురు మెరికలది; వాళ్ల వెన్ను దన్నుగా పెద్ద దిక్కుగా ఇద్దరు 76, 84 ఏళ్ల ప్రత్యేక కార్యకర్తల ద్వయం! శుభోదయ పాదచారణార్ధం అటుగా వెళ్లి వచ్చిన మరో ఇద్దరం కలిపి ఎనిమిది మంది లెక్క!

          ఏళ్ల తరబడీ సోమ - మంగళవారాల్లో నాలుగైదారేడుగురి రిస్కీ దళం ఎన్నెన్ని రిస్కీ సేవలు చేస్తే - ఇన్ని అందమైన రోడ్ల, పచ్చదనాల, పూల సోయగాల కనువిందులీ గ్రామానికి దక్కుతున్నవని ఆలోచించగల - అభినందించగల - అనుష్టించగల వారి సంఖ్య ఏ పాటిది?

          నేటి తాజా భద్రతా - సుందరకరణ చర్యల్నీ ట్రాక్టర్ పైన, నిచ్చెన మెట్ల మీద ఎక్కి ఈ గుప్పెడు మంది ఏ రిస్కీ చర్యలు చేసిందీ, తన్మూలంగా గంగులపాలెం గస్తీ గది పరిసరాల మార్పులేమిటీ, అసలీ బరువు పనుల్లో వాళ్ల పని భంగిమలేమిటీ... అనేది నేటి వాట్సప్ మాధ్యమ చిత్రాల్లో గమనించండి!

           2 వారాల అజ్ఞాతం పిదప అనివార్యంగా మూడు చోట్ల బ్యాండేజీలతో - ముఖం మీద మాత్రం సంతృప్తితో శ్రమదాన పునః ప్రవేశంచేసిన వృద్ధ కర్మిష్టిని కూడ చూశారా?

          అతడే ఈ సోమవారపు స్వచ్చోద్యమ సంకల్ప నినాదకర్త!

          నవ వసంత వర్షీయసి

ఎన్నెన్నో విశ్లేషణ, లెవరెవరివో శుభకామన,

లెందరివో పరిశీలన, లెంతగానో అనుకరణలు

కొన్నికొన్ని అవహేళనలున్న సుందరోద్యమ మిది!

సమకాలమునందరుదగు నవ వసంత వర్షీయసి!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   03.07.2023.