2816* వ రోజు ....           05-Jul-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు అవసరమా?

నడుస్తున్న స్వచ్ఛ సుందరోద్యమ చరిత్ర – @2816*

          అనగా - అది ఈ ఊరి కొరకు ఊరి నుండి - కొందరు ఊరి వాళ్ళ చేత తాజాగా - బుధవారం(5-7-23) వేకువ 4.18 - 6.00 వేళల నడుమ - 21 మంది స్వచ్ఛ శుభ్ర వ్యసనపరులు లిఖించిన సచ్చరిత్ర! సదరు చారిత్రక ఘటనా స్థలం అవనిగడ్డ రహదారిలో పాగోలు - చల్లపల్లి గ్రామాల ఉమ్మడి సరిహద్దైన స్వచ్ఛ - సుందర టాయిలెట్ల వద్ద!

          చరిత్రను అనుకరించడమో, అనుసరించడమో ప్రజా బాహుళ్యానికి అలవాటైన పని - వేసిన బాట మీద నడవడమన్న మాట! ఐతే - కారడవిని ఛేదించి, రోడ్డు నిర్మించడం వంటి మన ఊరి స్వచ్ఛ సుందరోద్యమంలో ఒక్కొక్క ఇటుకను పేర్చుకుపోవడమే అసలైన - కఠిన పరీక్ష! అట్టి రోడ్ల నిర్మాణాన్ని అవహేళన చేయడమూ, కొండొకచో త్రవ్వుకు పోవడమూ మహాపరాధాలు కావా?

          అసలు నేటి స్వచ్ఛంద శ్రమ కర్మలు ఇదే రోడ్డు మొదట - మూడు ముఖ్య వీధుల కూడలిలో జరగవలసి ఉండగా - వరుణడి శీలాన్ని శంకించి కిలోమీటరు దూరానికి మారింది!

          స్వచ్ఛ సుందర కార్యకర్తలు కాక వేరెవరు చూసినా బండ్రేవు కోడు వంతెన ప్రాంతపు 100 గజాల రోడ్డు ఇంతందంగా ఉంటే - ఇంకా ఇక్కడేం చేయాలిఅనే అనుకొంటారు. ఐతే ఈ శుభ్ర - సుందరీకర్తల దృష్టే వేరు!

          ఇప్పుడు - 6.15 తరువాత - ఎవరు వెళ్లి చూసినా - ఆ అందమైన మరుగుదొడ్లు, ఆ హరిత వైభవమూ, కాస్త దూరంగా రహదారి ఉద్యానాలూ ఒక్క 10 నిముషాల పాటు పరిశీలించండి - మీరు భావుకులైతే, కాస్త కళాభిరుచే ఉంటే, మీ హృదయం కదుల్తుంది, మీలో కళాకారుడు మేల్కొంటాడు!

          ఒకవేళ వెళ్ళి చూడలేకపోతే – ‘జై స్వచ్ఛ చల్లపల్లి సైన్యంమాధ్యమ చిత్రాలైనా చూడండి! ఆ బాట వైశాల్యం, స్వచ్ఛత, పొందిక కొంతైనా తెలియక పోదు! ఐతే ఎందరు కార్యకర్తలు చెక్కుడు పారల్తో మట్టిని చెక్కితే - పూలమొక్కల్నెంతగా క్రమబద్దీకరిస్తే నలుగురి చీపుళ్లెంతగా ఊడిస్తే - ఎన్ని చెమటలు దిగ గారితే ఈ సుందర దృశ్యం ఆవిష్కృతమయిందనేది మాత్రం ఎవరైనా ప్రత్యక్షంగా వచ్చి చూసి పాల్గొంటేనే తెలియగలదు!

          ఇక్కడ ప్రస్తావిస్తున్న నూతన చరిత్ర నిర్మాణాలూ, శ్రమదానాలూ, చెక్కబడుతున్న గ్రామ వీధుల శుభ్ర సౌందర్య శిల్పాలూ గ్రాఫిక్స్ కానే కావనీ, స్వానుభవ పూర్వక వ్రాతలనీ విశ్వసించండి!

కారక్రమ ముగింపు సంగతుల్లో:

- యధా ప్రకారం DRK సమీక్షకుని ఆశ్చర్యానందాలూ,

- తమ గంటన్నర కష్టంతో తీర్చిదిద్దబడిన వీధి సౌందర్యాలకు నిస్వార్థ శ్రామికుల పరవశాలూ

- 2 వారాల ఎడబాటు భరించాక, కాళ్లకూ, ఒంటికీ కట్లతో వచ్చి శాస్త్రి మహాశయుని ఉచ్ఛ స్వరంతో నినాదాలూ

- మరొక ముఖ్య సమాచారమేమనగా: అర్ధ రాత్రో అపరాత్రో దూర ప్రయాణం పిదప చల్లపల్లిలో బస్ దిగే వాళ్ల సౌకర్యం కోసం షణ్ముఖ శ్రీనివాసుని వాహన ప్రతిపాదన, (ఔను స్వచ్ఛ కార్యకర్తలకే ఇలాంటి ఆలోచనలెక్కువగా వస్తాయి! అతని చరవాణి 9885539401)  

- రేపటి వేకువ కార్యకర్తల కలయిక వాన లేకుంటే చల్లపల్లి సెంటరనీ, ఉన్నచో ఊరి బైట నాగాయలంక రోడ్డనే నిర్ణయమూ...

          కష్టించక నిజమౌనా కలలన్నీ?

కలాంగారు చెప్పకనే కలలు కనే వారెందరొ!

తమ గ్రామం అడుగడుగున సుమ సౌరభ నిర్భరముగ-

స్వస్తతకు ఉదాహరణగ - స్వచ్ఛతకు నిదర్శనముగ

నిలవాలని!’ - కష్టించక నిజమౌనా కలలన్నీ?

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   05.07.2023.