2817* వ రోజు ....           06-Jul-2023

పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు అవసరమా?

స్వచ్ఛ శ్రమదానంలో 2817* వ ఘట్టం.

          గురువారం (6.5.23) ఆ ఘట్టం మరీ 4.15 కే మొదలై 6.05 కు ముగిసింది. వర్ష పురుషుని దాగుడు మూలలెక్కువైన కారణంగా - నిన్నటి వలెనే శ్రమ వేదిక అవనిగడ్డ రహదారిలోని ‘ప్రభాకర్ రైస్ మిల్’ ప్రాంతానికి చేరింది – 16 ½ మందికే పరిమితమైంది!

          మరొక మారు బండ్రేవు కోడు కాల్వ వంతెన దగ్గరి బాటను గోకుడు పారలతో మరింత విశాల పరుస్తూ ముగ్గురూ, ఉత్తరపు గట్టు గడ్డీ, పిచ్చి చెట్ల పనిబడుతూ ఒక్కరూ తీరిక లేకుండా పనిలో మునిగిపోయారు.

          వడ్లమర గేటు దాటే దాక – దారికుభయ దిశలా చెట్లను సుందరీకరిస్తూ నలుగురు కనిపిస్తే - నల్లని రోడ్డు శుభ్రతకు చీపుళ్లతో హామీ యిచ్చిన ఇద్దరు మహిళలు శ్రమిస్తుంటే - మరొకాయన ప్లాస్టిక్, గాజు సీసాలేరుతుంటే --

          50 గజాల జాతీయ రహదారి మళ్లీ మళ్లీ చూడాలన్నంత అందంగా మారక ఏం చేస్తుంది? ఊళ్ళో అస్తవ్యస్తత తగ్గుముఖం పట్టక తప్పుతుందా? ఊరి బైట ఎనిమిదీ, ఊళ్లోని ఎంపిక చేసిన రోడ్లూ పచ్చదనం నింపుకోక - అహ్లాద గుణం పెంచుకోక ఉంటాయా?

          గ్రామంలోని కొన్ని బడులూ, గుడులూ బస్ ప్రాంగణాలూ, రుద్రభూములూ క్రొత్త కళ తెచ్చుకోక తప్పుతుందా? ఇంకో ఐదారేళ్లకైనా చల్లపల్లి స్వచ్చ సౌందర్యపరంగా సమూలంగా మారకేం చేస్తుంది? ఇందరి కాయకష్టం ఊరికే పోతుందంటారా?

          సరే - రోజు వారీగా జరిగే శ్రమదానం సంగతట్లా ఉంచి, నలుగురు కార్యకర్తల బృందం మూణ్ణాలుగు కిలోమీటర్ల దూరం వెళ్లి - శివరామపురం, వేంకటాపురాల నడుమ కిలోమీటరు పైగా బాటను పరిశీలించి వచ్చింది. వేంకటాపుర సహృదయుడొకరు ఆ రహదారిని స్వచ్ఛ కార్యకర్తల సహకారంతో హరితమయం చేస్తారట!

          ఎక్కడ చల్లపల్లి - ఎక్కడ వేంకటాపురం? రెండిటినీ స్వచ్ఛ - శుభ్ర - హరిత సుందరోద్యమం కలిపేస్తున్నది! శ్రమ స్వచ్ఛ కార్యకర్తలది, ఆర్థికం కోనేరు మారుతి ప్రసాదు గారిది!  

          సజ్జా ప్రసాదు గారు స్పష్టపరచిన గ్రామ స్వచ్ఛ – సుందరోద్యమ నినాదాల పిదప DRK ప్రసాదు గారు ప్రకటించిన సమాచారమది!

          రేపటి వేకువ శ్రమ వేడుక కొరకు మన కలయిక ప్రదేశం అవనిగడ్డ బాటలోని ప్రభాకర్ రైస్ మిల్ దగ్గరే!

          ఇచటి కొద్ది మంది తప్ప

ఎవరైనా ఒక్కమారు ఈ గ్రామం తిలకిస్తే

ఎవరు మాత్ర మాసింపరు? (ఇచటి కొద్ది మంది తప్ప)

స్వచ్చోద్యమ చల్లపల్లి సకల మేటి లక్షణాలు

తమ ఊళ్ళో ఉండాలని - అది నందనమవ్వాలని!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

 

   06.07.2023.