2818* వ రోజు ....           07-Jul-2023

పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడాలా?

2818*వ నాటి శ్రమదాన బాధ్యత!

            శుక్రవారం (7-7-23) వేకువ 4.16 కే 9 మందితో మొదలై, ఆ బాధ్యత 19 ½  మందితో 6.05 కు ముగిసింది!  సుమారు 30 పని గంటలు పిదప పరిశుభ్ర సుందరీకృతమైన మరొక 50 గజాల అవనిగడ్డ రోడ్డు నిన్నా - మొన్నటి లాగే ప్రభాకర్ రైస్ మిల్ ప్రాంతమే!

            ఒక్కింతగా కార్యకర్తల సంఖ్య తప్ప వీధి పారిశుద్ధ్య నాణ్యత తగ్గని నేటి శ్రమ విన్యాసాలిట్లున్నవి.!  (అవి చదివే ముందుగా పని ముగింపు దశల్లో తీసిన ఆ 200 గజాల భావుక మనోజ్ఞ సుమ సుందర వీధి ఛాయా చిత్రమునొక మారు చూడుడు!)

- అడపా వేంకట్రామయ్య నామాంకిత ఉద్యానాల హరిత సౌందర్యాలకు మెరుగులు దిద్దిన నలుగురైదుగురు కత్తీ – కత్తెర - దంతెల వారి పని - వీరిలో అనుకోకుండా వచ్చి నడుములు వంచిన ఇద్దరు యోగసాధకుల కృషి !

- ఏపుగా పెరిగి, విద్యుత్తీగలనందుకో జూస్తున్న సువర్ణ గన్నేరు పూలచెట్ల కొమ్మల కత్తిరింపులు నిర్వహించిన నలుగురి పని భంగిమలూ, అందుగ్గాను నిచ్చెన లెక్కిన సాహసాలూ!

- నేను చూసినంతలో - ఒక్కమాటైనా పలుకక - దారి నూడ్చే దీక్షపట్టిన మహిళా కార్యకర్తలూ!

- పని నిలుపుదల ఈల మ్రోగుతున్నా - లోడింగు పనులాపని నలుగురు శ్రమదాతలూ!

            అసలు ఇంత మురికి, చెత్త పనుల్లో కూడ ఇంత సంతృప్తి చెందే స్వార్ధరహిత గ్రామ సేవకుల్ని కన్నార్పక ఆశ్చర్యంతో గమనించే నాబోటి వాళ్ళూ!

            ఈ చల్లపల్లి స్వచ్ఛ - సుందరోద్యమ శ్రమదాన చరిత్రను ఏ మంచి రచయితో గ్రంథస్తం చేసి, రాష్ట్రంలోని 13,000 గ్రామాల్లోనూ అది వర్తమాన నిత్య నూతన చరిత్రగా మారితే చూడాలనేది స్వచ్ఛ కార్యకర్తల కోరిక!

            ఉన్న ఊరి శ్రేయోదాయకమైన ఇంతటి సుదీర్ఘ కాల శ్రమదాన విశేషాలు ఒకమారు మూల గ్రామానికే పరిమితమై పోతే ఎలా?

            6.20 సమయానికి మాలెంపాటి గోపాలకృష్ణుని నెలవారీ 2,000 రూపాయల విరాళమూ, గంధం వేంకటేశ్వరునికి బదులుగా - కోడూరు వేంకటేశ్వరునికి దీటుగా - మాలెంపాటి అంజయ్య గర్జా సదృశ నినాదాలూ, రేపు వేకువ గంగులవారిపాలెం దగ్గర నాటబోయే 100 పూల మొక్కల గురించి DRK గారి వివరణలూ చోటు చేసుకొన్నవి. (సమాచార అంతిమ నిర్ణయం కోసం మన వాట్సప్  మాధ్యమాన్ని గమనిస్తుండండి!)

          ఏ ఒకరిదో కాదుకాదుగా!

ఏ ఒక మర మేకు ఊడినా ఏ యంత్రం కదలనట్లుగా

ఏ ఇంద్రియ లోపమున్ననూ ఈ కాయం నడవనట్లుగా

ఒక అద్భుత సమన్వయంతో ఒక ఊరును తీర్చిదిద్దగా

ఈ స్వచ్చోద్యమ సంరంభం ఏ ఒకరిదో కాదుకాదుగా!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

 

   07.07.2023.