2819* వ రోజు ....           08-Jul-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడాలా?

క్రొత్త జాతీయ రహదారికొక పచ్చ తోరణం! -2819*

          ఇది శనివారం, అది జాతీయ ఉపరహదారిలో గంగులపాలెం సమీపం, కార్యకర్తలొక దశలో 49 మంది, నాటిన పూలమొక్కలు వంద, వాతావరణం ఆహ్లాదకరం, పచ్చతోరణం కూర్చుతున్న అందరి ముఖాల్లోనూ సంతోషం! స్వచ్ఛ - సుందరోద్యమ చల్లపల్లిలో మరొక సామాజిక – సామూహిక సదాచరణ సన్నివేశం.

          ఇంకా చెప్పాలంటే - మన సమకాల చరిత్రలో బహుశా ఎక్కడా కనిపించని దృశ్యం! వచ్చి, పాల్గొన్నది ఇంటి పనుల్ని వాయిదా వేసుకొన్న గృహిణులూ, విశ్రాంత పోలీస్ అధికారీ, వయోధికులూ, వ్యాపారులూ, రైతులూ వగైరాలు! అసలు కార్యకర్తలు 30 మంది, అతిథి కార్యకర్తలు తక్కినవాళ్లూ!

          తలపెట్టిన కార్యం మంచిదైతే – అనుసరిస్తున్నది ఋజుమార్గమైతే - ఫలితాలెలా ఉంటాయనేది చల్లపల్లిలో నిగ్గుతేలుతున్న సత్యం! ఎగుడు దిగుడు చోటుల్లో కిలోమీటర్ల దూరం వచ్చి కొంగులు దోపిన మహిళలు రహదారి హరిత - సుందరీకరణకు పూనుకోవడమే స్వచ్ఛ సుందరోద్యమ ఘన విజయం!

          6.20 వేళ నేటి శ్రమదాన సమీక్షానంద సమయంలో – విశ్రాంత డి.యస్. పి. హరిరాజేంద్ర బాబు గారు కాని, DRK ప్రసాదు గారు గాని - మరొక సంవత్సరం తర్వాత ఈ కిలో మీటరుకుపైగా రహదారి ప్రయాణికులెవరైనా “ఓహో! ఇదేనట గదా స్వచ్ఛ - సుందర చల్లపల్లి! దశాబ్ద కాలంగా ఇక్కడొక క్రమం తప్పని శ్రమదానంతో ఊరు సమూలంగా మారిన లక్షణం ఈ రహదారితోనే తెలుస్తున్నది” అనుకొనే దృశ్యాల్ని కళ్లకు కట్టి వర్ణించారు.

          మొక్కలు నాటిన వాళ్ళు కాస్త సమయం దొరికితే చేతులు ముడుచుక్కూర్చోలేదు – గోకుడు పారల్తో, చీపుళ్లతో బాటల జంక్షన్ దగ్గర చెత్తా చెదారాన్నీ, దుమ్మునూ చెక్కి ఊడ్చి, స్వచ్ఛ కార్యకర్తలనిపించుకొన్నారు!

          అంతకు ముందు గంగులవారిపాలెం వీధి ప్రముఖ మహిళ సుజాత దిక్కులు పిక్కటిల్లునట్లుగా గ్రామ స్వచ్చ - సుందరోద్యమ ఆశయాలను ముమ్మారు నినదిస్తే,

          ఈ ఉద్యమ అంకురార్పణ కాలపు మరో మహిళా కార్యకర్త కడియాల భారతి (W/o రామారావు) గారు ఉద్యమ ఖర్చుల నిమిత్తం మరొకమారు 5000/- విరాళం సమర్పించారు.

          కార్యకర్తలం కొందరం ఏడాది తర్వాత కాసానగరం దాక ఈ మొక్కలు పెరిగి, విరగ బూసి ఎంత ఆహ్లాదాన్ని పంచుతాయో ఊహించుకొన్నాం!

          రేపటి వేకువ కూడ ఇదే బైపాస్ దారిలో మరొక వంద పూల మొక్కలు నాటేందుకు – మరింత మంది గ్రామస్తులు - ముఖ్యంగా గంగులవారిపాలెం వారు - తరలి రావాలని కోరుకోంటూ---

          అవి కష్టించక కలుగవు!

ఈ శుభ్రత - ఈ పొందిక - సుమసుందర హరితోధృతి

ఏ సహృదయులు చూసిననూ “ఇట్లాగే తమ వీధులు,

పరిసరాలు, రహదారులు ప్రాభవముగ మారాలని”

అనుకొంటే తప్పు లేదు - అవి కష్టించక కలుగవు!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   08.07.2023.

ఈ ఉద్యమ అంకురార్పణ కాలపు మరో మహిళా కార్యకర్త కడియాల భారతి (W/o రామారావు) గారు ఉద్యమ ఖర్చుల నిమిత్తం మరొకమారు 5000/- విరాళం సమర్పించారు.