1937* వ రోజు....           01-Mar-2020

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ఏ ప్లాస్టిక్ వస్తువులనూ వాడం!   

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం1937* వ నాటి స్వచ్చతా నడక విశేషాలు.

రోజుటి కన్న భిన్నంగా ఈనాడు వేకువ 4.30 నుండి8.30 దాక జరిగిన స్వచ్చ చల్లపల్లి బల ప్రదర్శనాత్మక యార్లగడ్డ యాత్రలో చల్లపల్లి నుండి 70 మంది, పురిటిగడ్డ నుండి 45 మంది పాల్గొన్నారు. యార్లగడ్డలో ప్రవేశానంతరం మరొక 65 మంది జత గూడి మొత్తం 190 నుండి 200 మంది స్వచ్చ కోలాహలం నెలకొన్నది.

వేకువ జామున 5.00 కే ప్రారంభమైన ఈ స్వచ్చ నడక సందడి స్వచ్చోద్యమ నినాదాలతో, జన సాంద్రతలున్న చోట్ల చిన్నపాటి ఉపన్యాసంతో, నందేటి శ్రీనివాసుని కంచు కంఠపు పాటలతో-NTR పార్కు వద్ద నడక మిత్రుల చేరికతో మేకావారిపాలెం, రాముడుపాలెం, పురిటిగడ్డ గ్రామాల మీదుగా 6.35 నిముషాలకు గమ్యం చేరుకొన్నది. ఈ ఆరేడు కిలో మీటర్ల నడక వల్ల ఏ ఒక్కరూ అలసి చతికలబడలేదు.

జాతీయ పతాక రూపశిల్పి పింగళి వేంకయ్య విగ్రహం సాక్షిగా పాఠశాలలో 40 నిముషాల పాటు జరిగిన ఉభయ గ్రామాల స్వచ్చోద్యమ సమీక్షా సమావేశంలో – స్వచ్చోద్యమ దాతలు (గుత్తికొండ కోటేశ్వర రావు గారు 1116/-, ప్రాతూరి ఉదయ శంకర శాస్త్రి గారు 3000/-) తమ ఈ విగుణం చాటగా, డాక్టరు దాసరి రామ కృష్ణ ప్రసాదు గారు ఉద్యమ పూర్వా పరాలను, తీసికోదగిన జాగ్రత్తలను, ఉభయ గ్రామాల కార్యకర్తల శ్రమదాన శక్తిని విశ్లేషించారు. అనిత్యమైన ఈ జీవితంలో ఒక మంచి పనికి దానం చేస్తే పోయేదేమీలేదని, వచ్చే ఆత్మ తృప్తికి హద్దులుండవనీ శాస్త్రి గారు అందరికీ నచ్చజెప్పారు. నందేటి శ్రీనివాస్ మళ్లీ పాటలతో, పద్యాలతో జనం చేత చప్పట్లు కొట్టిస్తూ రెచ్చిపోయాడు. నిస్వార్ధ స్వచ్చోద్యమ శీలురందరికీ ఈ నాటి ఈ 3 గంటల కార్యక్రమం. మూడేళ్లకు సరిపడా ఆత్మ సంతృప్తి దాయకం! వివిధ వర్గాల, సంఘాల సహకారంతో చల్లపల్లి నుండి జరిగిన  స్ఫూర్తి దాయక పాద యాత్రా పరంపరలో ఇది మూడవది.  

 మావో లాంగ్ మార్చ్ ఘట్టాని ప్రస్తావించి, నేటి స్వచ్చ సంకల్ప యాత్రా పరమార్థాన్ని ప్రశ్నిస్తూ నేను చదివిన గేయాన్ని, శంకర శాస్త్రి గారి ఆదర్శం మీద శ్రీనివాస్ చదివిన ఆట వెలది పంచ రత్నాలను కార్యకర్తలు విన్నారు. అనంతరం యార్లగడ్డ కార్యకర్తల 152 రోజుల స్వచ్చ-సుందర కృషిని గ్రామంలో తిరిగి ప్రత్యక్షంగా చూశారు.

8.00 తరువాత నడక సంఘానికి, చల్లపల్లి స్వచ్చోద్యమానికీ మిత్రుడైన ధర్మారావు గారు స్వగృహంలో (అల్పాహారం పేరిట ఇచ్చిన) ఘనాహారం ఆస్వాదించి, 8.50 కు గృహోన్ముఖులయ్యారు.

నేటి స్వచ్చ సంకల్ప ఘన విజయాన్ని, ధర్మారావు గారి విందును జీర్ణించుకొని, రేపటి మన శ్రమదాన వేడుకను ప్రధాన రహదారి వద్ద కలిసి నిర్వహించుకొందాం.

  స్వచ్చోద్యమ పునరంకితుడు

స్వచ్చ చల్లపల్లి సందేశమును చాటి

కార్యకర్త దీక్ష కదను త్రొక్క

మరల వచ్చె నిడుగొ మన శాస్త్రి మాష్టారు

యార్లగడ్డ స్వచ్చ యాత్ర కొరకు!

  

నల్లూరి రామారావు

స్వచ్చ చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు - మనకోసం మనం ట్రస్టు,

ఆదివారం – 01/03/2020

చల్లపల్లి.      

స్వచ్ఛతానడక ప్రారంభం