2820 * వ రోజు....           09-Jul-2023

 

పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడాలా?

 

             ఆదివారం నాటి స్వచ్ఛ- సుందరోద్యమ బల ప్రదర్శన @ 2820*

          57 మంది గ్రామ వివిధ వర్గాల గ్రామస్తులతో సదరు సమైక్య - శ్రమైక ప్రదర్శన 4.15 కే మొదలయిందని వాట్సప్ తొలి చిత్రాన్ని బట్టి తెలుస్తున్నది! 

 

          ఎనభయ్యైదో- వందో పూల చెట్లను - ఊరికి దూరంగా- క్రొత్త బైపాస్ మార్గం ఉత్తరంగా నాటేందుకింత చీకటితో-మెకానిక్  డ్రైవర్ల సంఘాలకూ, గృహిణులకూ, ఇంటి దగ్గర ఏ పనీ తోచక కాదు వచ్చింది- స్వచ్ఛ కార్యకర్తల సుదీర్ఘ కాల శ్రమదానం చూసీ, తత్ఫలితంగా ఊరి రూపు రేకలు మారడం గమనించీ, సదరు శ్రమజీవుల విన్నపం మన్నించీ వచ్చారు మరి !    

          "అయిందేదో అయింది. గతం గతః అనుకొని- వార్డు కిందరి వంతునో- వారాల ప్రకారం ఇంటికొక్కరు చొప్పునో చైతన్య వంతులిక ముందు శ్రమదానంలోకి వచ్చారనుకోండి - అప్పుడదెంత సామూహిక -కమనీయ - శ్రమైక సుందర దృశ్యమౌతుందో ఊహిస్తేనే మనసు పరవళ్లు తొక్కుతున్నది!

          ఈ చల్లపల్లిలో వేల రోజుల- లక్షల పనిగంటల మహత్తర శ్రమదానాన్ని పదేళ్ల నాడు ఊహించామా? 30 వేల మొక్కల హరిత వైభవాన్నీ, రహదారి వనాల్నీ, స్వచ్ఛ - పరిశుభ్ర పురోగతినీ ఆలోచనల్లో తప్ప - క్రియారూపంలో చూశామా?

          ఏమో - గుర్రాలు గాల్లో ఎగరావచ్చు - ఇప్పటి దాక స్వచ్చ- సుందరోదమాన్ని పట్టించుకోని మిగతా గ్రామస్తులు అందులోకి వచ్చిప్రభుత్వాలూ  సహకరించితమ ఊరిని దేశంలో కెల్ల ఉత్తమ ఆదర్శ గ్రామంగా మార్చనూవచ్చు!  ఒక సమైక్య శ్రమ జీవన సంస్కృతి వికసించాలే గాని ఆ కోరిక అసాధ్యం కానేకాదు!

          ఇంకో 10 పని దినాలిలాగే ఇతర ప్రజలు కూడ కలిసొస్తే 2 కిలో మీటర్ల బారునా ఈ జాతీయ ఉప రహదారికి రెండు ప్రక్కలా ఇప్పటి అంచనా ప్రకారం 1500 పూల మొక్కలు కొలువు తీర గలవు! చల్లపల్లి శుభ్ర- సౌందర్య ప్రత్యేకతను  రాష్ట్ర- దేశ వ్యాప్తంగా చాటించగలవు !

          కనుక- తస్మాత్ జాగ్రత్త! ఇప్పటి దాక మొక్కలు నాటని వారికి - ముఖ్యంగా గంగులపాలెం వాస్తవ్యులకూ హెచ్చరిక!  ఈ నెలాఖరుతో మంచి (వర్ష ) తరుణం మించిపోక ముందే ఈ పచ్చతోరణ సత్కార్యంలో  పాలు పంచుకోవలెనని మనవి!

          కార్యకర్తల్లో- ఎవరు రెల్లు గడ్డి నరికారో- గడ్డి చెక్కారో- వంద గోతులు త్రవ్వారో- ఎవరే మొక్క నాటారో- అవంత ముఖ్యం కాదు. ఈ మొక్కలెంత త్వరగా - సుష్టుగా పెరిగి, విరగబూసి, NH-16 ను ఎంతగా సౌందర్యమయం చేస్తాయనేదే  ప్రస్తుత చర్చనీయాంశం !

          ఇంత పెద్ద కార్యకర్తల గుంపుతో స్వగ్రామ స్వచ్ఛ-శుభ్ర- హరిత-సౌందర్య నినాదాలు పలికించినది సాధనాల సతీష్ కాగా, పట్టరాని ఆనందంతో సమీక్షించినది DRK వైద్యుడు!

          మనం బుధవారం వేకువ కమ్యూనిష్టు బజారు  బైపాస్ వీధి లోనూ, గురువారం వేకువ మళ్లీ బందరు ఉపరాదారిలోనూ కలువదగునని నిర్ణయం!

          తలరాతను మార్చిరిగద?

ఊరెంత ? జనాభఎంత? దారులెన్ని, డ్రైనులెన్ని?

కేవలమొక వందమంది కృత నిశ్చయు లైనప్పుడు

దశాబ్దాల కొరత దీర్చి, వసతు లెన్నొ కలగ జేసి

తమ గ్రామపు స్వచ్ఛ- శుభ్ర తలరాతను మార్చిరిగద?

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   09.07.2023.