1938* వ రోజు....           02-Mar-2020

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ఏ ప్లాస్టిక్ వస్తువులనూ వాడం!   

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం1938* వ నాటి అంకితభావం.

సోమవారం జాతీయ రహదారిని శుభ్ర పరచడమనే సంప్రదాయం ప్రకారం నేటి వేకువ 3.59 కే గ్రామ ముఖ్య (మూడు రోడ్ల) కూడలి వద్దకు చేరి 6.18 నిముషాల దాక సువిశాల రహదారిని 28 మంది కార్యకర్తలు ఊడ్చి మరింత శుభ్ర పరిచారు.

నాగాయలంక మార్గంలో ని పెట్రోలు బంకు మొదలు, మూడు దారుల కలయిక ప్రాంతం, బందరు మార్గంలోని యడ్ల బజారు దాక వీరి శ్రమదాన కృషి విస్తరించింది. చిన్న కార్ల స్టాండు, మరొక పెట్రోలు బంకు, A.T.M కేంద్రం, రెండు గుడులు, చిన్నా చితకా తిను బండరాల దుకాణాలు, నాలుగు హోటళ్లు, కూరల విక్రయ అంగళ్లు  అన్నిటి ముందరి అన్ని వ్యర్ధాలను ఊడ్చి, ప్లాస్టిక్ వస్తువుల్ని ఏరి, దుమ్ము, ఇసుకలను ఊడ్చి పోగులు చేసి, అన్నిటినీ ట్రాక్టర్ లో నింపుకొని, చెత్త కేంద్రానికి తరలించారు.

అన్ని విభాగాల-సుందరీకరణ, రెస్క్యూ, స్వచ్చీకరణ కార్యకర్తలందరి నేటి ఆయుధాలు చీపుళ్లే. బందరు రహదారి కాక, 5.50 నుండి ఆరేడుగురు సోమవార సంత దృష్ట్యా-రైతు బజారు దాక సంత వీధిని ఊడ్చి శుభ్ర పరిచారు. పోలీసు భవనాల ప్రహరీ గోడల దుమ్మును సైతం దులిపి మరీ శుభ్రం చేశారు.

6.40 నిముషాల ప్రాంతంలో-దైనందిన శ్రమదాన సమీక్షా సమావేశంలో శంకర శాస్త్రి గారు 100 రోజుల నాటి తన అనారోగ్యం గుర్తు చేసుకొని, ఇప్పటికి తానీ మాత్రం ఉన్నందుకు ఆనందించి, (-అనారోగ్య స్థితిలో కూడా ధైర్యంగా-సంతోషంగా ఉండ గలిగే నిత్య సంతోషి కనుక) మరలా స్వచ్చ సుందర కృషిలో కార్యకర్తల్ని కలవగల్గినందుకు సంతృప్తి ప్రకటించి 10,000/- మనకోసం మనం ట్రస్టుకు చెక్కుగా అందించారు.

దాసరి వేంకట రమణ గారు (చిన్నాజి) తన కుమారుని వివాహ వేడుకలకు(గుడ్లవల్లేరులో 5 వ తేదీ సాయంత్రం), విజయవాడ-తాడి గడప-అన్నే కళ్యాణ మండపంలో(6 వ తేదీ సాయంత్రం) స్వీకార-పరిచయ వేడుకకు కార్యకర్తలను ఆహ్వానించి “మనకోసం మనం ట్రస్టుకు” లక్ష రూపాయలు విరాళమిచ్చారు. ఈ ఉభయులకూ స్వచ్చోద్యమ కారుల ధన్యవాదాలు.

రేపటి మన గ్రామ బాధ్యతను బందరు రహదారి లోని కీర్తి ఆస్పత్రి దగ్గర ప్రారంభిద్దాం!

 

     విజయోత్సవ సమయంలో....

సాధించిన ఈ ఘనతకు సంతృప్తి వహించొచ్చని

కాని-దాని సమగ్రతకు కట్టుబడే ఉందామని

బోరవిరిచి-విర్రవీగు బుద్ధి మాత్ర మసలొద్దని

స్వచ్చ సైన్య విజయోత్సవ సందేశం ఇవ్వాలని....

నల్లూరి రామారావు

స్వచ్చ చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు - మనకోసం మనం ట్రస్టు,

సోమవారం – 02/03/2020

చల్లపల్లి.    

 

3.59 కు సెంటర్లో