2835* వ రోజు ....           28-Jul-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడనేల?

2835* వ వేకువ బురద - మట్టి పనులు

సదరు మురికి పనివాళ్లేమో ఎంతో కొంత పేరు - ప్రతిష్టలున్న, చదువుకొన్న, ఉద్యోగిస్తున్న, సొంత బుర్రలున్న వివిధ వర్గాల వారు! సమయమైతే - వేకువ 4.17 - 6.05 నడిమి వేళ! స్థలం - NH 16 రహదారికి చెందిన - కాసానగర కూడలి దగ్గర, ఈ స్వచ్ఛోద్యమ జాతీయులైతే పట్టుమని 18 మందే!

అక్కడికీ ఈ అల్ప సంఖ్యాకులే అసహాయశూరులుగామారి, నెలన్నరగా పోరాడి, ఊళ్ళో రోడ్లు కాక - ఊరి వెలుపల - ఏ పది కిలోమీటర్ల రహదార్లనో ఏళ్ల తరబడీ హరిత పుష్ప మనోజ్ఞంగా మార్చింది చాలక - క్రొత్తగా ఈ 2.2 + 2.2 కిలోమీటర్ల బందరు రహదారినిప్పటికే 1008 రకరకాల పూల మొక్కల్తో నింపారు!

ఐతే - వీళ్ల దృష్టి అవసరార్ధం అప్పుడప్పుడు వైద్య శిబిరం మీదకో, విరిగిపడిన రోడ్ల మీది కొమ్మల మరామత్తుల వైపుకో మళ్ళుతుంది. లేకుంటే మిగిలిన మూణ్ణాలుగు వందల పూల మొక్కల పని ఇప్పటికే పూర్తైపోను!

షేక్స్పియర్ చెప్పినట్లు “అసలు మానడం కన్నా ఆలస్యం నయం (Better late than Never )!” ఇంటికొకరు వచ్చి సహకరిస్తారని ఎదురు చూడడం కన్నా ఉన్న పాతిక – ముప్పై మందే ఓపికున్నంతలో గ్రామ హరిత - పుష్ప - సుందరాకృతులు చెక్కడం నయం!

కార్యకర్తలకీ పూటకి రేపో – మాపో పెట్టబోయే గుడి గన్నేరు, డిసెంబర్ తదితర పూల మొక్కలు పెట్టవలసిన రహదారి మార్జిన్ల పిచ్చి మొక్కలు పని బట్టడంతోనే సరిపోయింది.

“గొడ్డలి – కొడవలి – నాగలి - రంపం వంటి సహస్ర వృత్తి చిహ్నాలని” శ్రీశ్రీ చెప్పినట్లు కాదు గాని, స్వచ్చ కార్యకర్తలకెప్పుడూ ‘కత్తీ – పారా – గొర్రూ – డిప్పా’ వంటివి హస్త భూషణాలుగా ఉండనే ఉంటాయి.

ఈ జంగిల్ క్లియరెన్స్ క్రమంలో ఆ పొదలనాశ్రయించుకొన్న పాములు బెదిరి ఒక నర్సు గారి కాళ్ల నొరుసుకుంటూ పారిపోయాయి!

ఇలాంటి విశేషాలతో నేటి 150 కు పైగా గజాల బందరు ఉపరహదారి దక్షిణ భాగం మొక్కలు నాటేందుకు సిద్ధమైపోయింది.

యధాప్రకారంగా నేటి పని సమీక్షకుడు DRK వైద్యుడైతే, ముమ్మారు రెండు విధాల నినాదాలను చాటి చెప్పిన బ్యానర్ వీరుడు - పోస్టల్ మెండు శ్రీనివాసుడు!

మనం రేపటి స్వచ్ఛ - సుందరీకరణ కోసం కలుసుకోదగింది మళ్లీ కాసానగర్ సమీప రహదారి దగ్గరే!

హస్తిమశకాంతరం

మచ్చుకొకటో – రెండో రోజులు స్వచ్ఛతను పాటించు వారికి

పత్రికలలో వార్త కోసం పార – చీపురు పట్టు వారికి

స్వచ్చ – సుందర చల్లపల్లికి చెమట చుక్కలు కార్చు వారికి

హస్తిమశకాంతరం కలదని అందరూ గుర్తించు సంగతి!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   28.07.2023.