2836* వ రోజు ....           29-Jul-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడనేల?

శనివారం (2836*) నాటి రహదారి సుందరీకరణం!

          29-7-23 బ్రహ్మ కాలం (4.18 ని.) లో 15 మందే కనిపిస్తున్నా అనతి నిముషాల్లోనే పెరిగి పెరిగి కార్యకర్తల సంఖ్య 33 కు వెళ్లింది! పని స్థల మానం - కాసానగర్ దగ్గర బందరు – ఒంగోలు నేషనల్ హైవేకి ఇరుదిశలా 200 గజాలు! పనుల్లో కాలూ - వేలూ పెట్టిన వాళ్లు 5 నుండి 91 ఏళ్ల వారు!

          100 నిముషాల శ్రమదానంతో బారులు తీరిన పూలమొక్కలు శతకం! వాటికొక అందమైన పేరు నూరు వరహాలు!మొక్కలు చిన్నవే గాని, వాటిలో ఐదారు మొక్కలకు అప్పుడే మూడేసి - నాలుగేసి ఎర్రెర్రని వరహాలూ పూశాయి!

          కార్యకర్తల సంఖ్య ఎక్కువై – ఒక దశలో నక్కులు, పలుగులు, పారల వంటి పనిముట్ల కొరత ఏర్పడింది కూడ! మీకు గనుక ‘జై స్వచ్ఛ చల్లపల్లి సైన్యం’ సామాజిక మాధ్యమాన్ని పరిశీలించే ఓపిక ఉంటే – 5-12 ఏళ్ల అమ్మాయిలూ, 92 ఏళ్ల విశ్రాంత, వాయామోద్యోగీ ఎంత ఉత్సాహంగా ఈ ‘పచ్చ తోరణం’ లో పాల్గొంటున్నదీ పరిశీలించండి!

          సామాజిక బాధ్యతలో ఈ పట్టుదల ఎవరో హుకుం జారీ చేస్తే వచ్చేదా? ఎవరికి వాళ్ల మనసుల్లోంచి బలంగా వస్తే తప్ప – ఒకరిద్దరు ప్రేరేపించిన మాత్రాన తొమ్మిదేళ్ల శ్రమదానం కొనసాగుతుందా? ముప్పై వేలకు పైగా చెట్లు, పూల మొక్కలు నాటడం సాధ్యపడుతుందా?

          ఈ వేకువ 100 నిముషాల శ్రమలో అధిక భాగం అటూ - ఇటూ తొమ్మిదేసి అడుగుల కొలతలకూ, పాదుల మట్టి, కంకరల త్రవ్వకానికీ, అక్కడక్కడా తిక్క - రోత మొక్కల ఖండనలకే సరిపోయింది. పూల చెట్ల అలంకరణం తక్కువ సమయంలోనే పూర్తయింది. అసలీ అరగంట కాలపు పని చూస్తే చాలు - కార్యకర్తల ఉత్సాహ - ఉద్వేగాలు, దైహిక భాషలూ గమనిస్తే చాలు – ఎవరికైనా ఈ స్వచ్ఛ - సుందరోద్యమ సుదీర్ఘ కాల నిర్వహణ రహస్యం తెలిసిపోవడానికి!

ఇక నేటి దాతృత్వం సంగతికొస్తే –

1) ప్రస్తుతానికనారోగ్యవంతురాలైన తన అర్ధాంగి – వెంకటరావమ్మ కోరిక మేరకు - కోనేరు శివరామకృష్ణయ్య గారి విరాళం 25,000/-

2) భోగాది వాసుదేవుడి 100 నూరు వరహాల పూల మొక్కల వితరణ.   

          విజయా కాన్వెంట్ లో 7వ తరగతి విద్యార్థిని అనుమకొండ గీతా హాసిని ఏ తడబాటూ లేక శ్రమదానోద్యమ నినాదాల్ని అలవోకగా చెప్పడం ఒక విశేషం!

          మరొక 100 గుడిగన్నేరు మొక్కలు నాటడానికి రేపటి వేకువ స్వచ్ఛ కార్యకర్తలు చేరవలసిన చోటు - ఇదే రహదారిలో - కాసానగర్ దగ్గరి రహదార్ల కూడలే!

          అంజలించుట ధర్మమే గద!

అసాధ్యం అనుకొన్న కార్యము సుసాధ్యముగా చేసిరెవ్వరు?

మూడు వేల దినాల సేవతో మురుస్తున్నవి ఎవరి మనసులు?

ఊరి దుస్థితి నెవరి చెమటలు ఉన్న పళముగ మార్చివేసెను? -

ఆ ప్రజాహిత కార్యకర్తల కంజలించుట ధర్మమే గద!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   29.07.2023.

భోగాది వాసుదేవుడి 100 నూరు వరహాల పూల మొక్కల వితరణ.
ప్రస్తుతానికనారోగ్యవంతురాలైన తన అర్ధాంగి – వెంకటరావమ్మ గారి కోరిక మేరకు - కోనేరు శివరామకృష్ణయ్య గారి విరాళం 25,000/-