2837* వ రోజు....           30-Jul-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడాలా?

          జులై 30 (ఆదివారం) నాటి శ్రమవినోదం - @ 2837*

వేకువ 4. 20 కే బందరు జాతీయ రహదారిలో-కాసానగర్ దగ్గరగా కార్యకర్తల ప్రత్యక్షం ! నిన్నటిని మించి, ఔత్సాహికుల సంఖ్యలోగాని, జరిగిన పని పరిమాణంలో గాని ఆకస్మిక వృద్ధి – చల్లపల్లి, రేపల్లె లకు చెందిన 42 మందీ,  నిర్దేశిత సమయం కన్న 10 నిముషాల ముందే తూము వేంకటేశ్వర రావు గారి కుమార్తె బ్యూలా ప్రసన్న తన పుట్టిన రోజు సందర్భంగా బహుకరించిన 100 గుడిగన్నేరు మొక్కలను, గోళ్ళ రాంప్రసాద్ గారు బహుకరించిన 100 గన్నేరు పూల మొక్కలనూ నాటడం ముగిసింది!       

        ఇప్పటిదాక- “పచ్చతోరణం” కార్యక్రమం లో- ఈ రహదారిలో 1360 పూల మొక్కలు కుదురుకొన్నట్లు నాలెక్క! ఈ ఊపులోనే - గతంలో తలపెట్టిన 2.2  కిలోమీటర్లను కాస్తా 3 కిలోమీటర్లకు పెంచేశారు- అంటే రామానగరం ORC - (క్లబ్బు)రోడ్డు వరకన్నమాట!

        ఇదేదో మొక్కలు పెట్టి, గాలికొది లేయడంకాదే- వీటిటన్నిటికీ కంప రక్షణ, పర్యవేక్షణ, వానల్లేకుంటే నీరుపోయడం వంటి బాధ్యతలు కూడ వీరివే ! ఇన్ని మొక్కలొకే వరుసైతే 6 కిలోమీటర్ల నిడివి ! చూడబోతే- గత సీజన్ దాక నాటి, పెంచీ, పూయించిన బైటి రహదార్ల కన్న ఈ 8 వ బాటే 3-4 నెలల తర్వాత ప్రతి ప్రకృతి ఆరాధకుడ్నీ కట్టి పడేసేలా ఉన్నది!

        తమ ఊరు అందంగా, శుభ్రంగా, ఆహ్లాదంగా ఉండాలనీ, ఆ బాధ్యత తమదేననీ చాల ఊళ్లలో చాలమంది కోరుకుంటారు, ప్రయత్నిస్తారు గాని, ఈ చల్లపల్లి కార్యకర్తలకింత అభినివేశమా? ఇది వెర్రా? పిచ్చా? వ్యసనమా? ఇలా నలభైయ్యేసి మంది తేడా గాళ్ళు ప్రతి రోజూ – అదీ వేకువ నాలుగ్గంటలకే రోడ్డెక్కడమూ- అందులో ఒక డాక్టరూ, ముగ్గురితరులూ 16 కిలో మీటర్ల దూరాన్నుండి రావడమూ ఏమను కోవాలి?

        సరే – వాళ్లు సీనియర్ డాక్టర్లో – రైతులో- గృహిణులో – పాత్రికేయులో – గత, ప్రస్తుత ఉద్యోగులో –వ్యాపారులో ఎవరైతే కావచ్చు గాని, తమ హోదాల్ని మరచి, ఐడెంటిటీలు వదిలి, గునపం, గొర్రు, కత్తి, డిప్ప, నక్కుల వంటివి వాడి, ఇన్ని వేల రోజులుగా, ఇంత శారీరక శ్రమ చేయడమా?

        ఇందుకే ఈ ఊరి స్వచ్చ వైద్యుడొకాయన  ప్రతి రోజూ – ప్రతి సారీ ఈ నమ్మలేని నిజాన్ని అంగీకరిస్తూనే – “ ఈ కాలంలో ఇంతటి మట్టి – దుమ్ము పనుల్నెవరు చేస్తారు”? అని ప్రశ్నించడం!

        నేటి కృషి అంచనా సమయంలో –

1 . స్వయం విరచిత గేయాల్ని నందేటి శ్రీను ఆలాపించడమూ,

2. రేపల్లె రెడ్ క్రాస్ బాధ్యుడు – డాక్టర్ వీర రాఘవయ్య ఉత్తేజ పూరితంగా ప్రసంగించడమూ,   

3. ధ్యాన మండలి ప్రతినిధి గోళ్ళ వేంకట రత్నం మనసారా స్వచ్చ- సుందరోద్యమ నినాదాలు పలకడమూ విశేషాలూ!

        బుధవారం వేకువ మనం కలుసుకోవలసింది ఇదే రహదారిలో రామానగరానికి చెందిన, బండ్రేవు కోడు కాల్వ వంతెన దగ్గర!

         శ్రమదానానికి పాల్పడు!

ఉల్లాసం కావాలా ? ఊరి ఉద్యానాలను చూడుము

ఉత్తేజం కావాలా? స్వచ్చోద్యమమున చేరుము

స్వస్తతకై ప్రయత్నమా ? శ్రమదానానికి పాల్పడు

ఆత్మతృప్తి సాధనకా? స్వచ్ఛ శుభ్రతకు తోడ్పడు!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   30.07.2023.