2838* వ రోజు ....           31-Jul-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడాలా?

2838* నాటివి రిస్కీ చర్యలు!

            జులై నెల మాసాంతపు సోమవారం వేకువ ఊరి వీధి సపర్యలు ఎంపిక కాబడ్డ కొందరు కార్యకర్తలవి. వీరికే కొందరు రిస్క్ టీమ్అనే నిక్ నేమ్ తగిలించారు.

            4.30 కన్న ముందే తమ సరంజామా - అంటే మోకులు, మర రంపాలు, బారాటి గడ కత్తీ వంటివి సిద్ధం చేసుకొని 6 గురు వెడలింది బైపాస్ వీధి ప్రక్క అశోక నగర్ తొలి వరుస చివరకు!

            అక్కడ చేపట్టింది - కరెంటు తీగల్లోకి చొరబడి, పెరిగిన పొగడ చెట్ల కొమ్మలు నరికే పని! వీళ్ళు  కాక - మరో 5 గురి సంఘీభావంతో సుమారు గంటన్నర పాటు చెట్టు బోడిది కావడమూ, దాని కొమ్మలు, రెమ్మలు ఆకులన్నీ ఒక క్రమ పద్ధతిలో ట్రక్కులోకి చేరి, చెత్త కేంద్రానికి చేరడమూ....

            ఈ టీమున్నంత కాలం విద్యుత్ శాఖా కార్మికులకెంత వెసులు బాటు! ఆయా వీధి నివాసులకెంత భరోసా! గుంటలు పడ్డ రోడ్ల కెంత నిశ్చింత!

            ఐతే - వీటన్నిటి వెనక భద్రతా దళం కష్టాన్నీ, సదుద్దేశాన్ని అర్ధం చేసుకొన్న గ్రామస్తులెందరనేది వేరే విషయం!

            6.00 తరువాత బ్యానర్ సాక్షిగా తమ సామాజిక బాధ్యతాసంకల్ప నినాదాల్ని ముమ్మారు ఉద్ఘాటించినది గంధం బృందావనుడు!

            తీర్ధానికి స్వార్ధానికి

అందరికీ మేలైనది - అందుబాటులో నున్నది

ఆత్మ తృప్తి కారోగ్యానికది బాగా పనికొస్తది

తీరానికి తీర్ధంగా - స్వార్ధానికి స్వార్థంగా

చల్లపల్లి శ్రమదానం సార్థకమై పోతున్నది!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   31.07.2023.