2839* వ రోజు ....           01-Aug-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడాలా?

2 ½ గంటలు జరిగిన 2839* వ నాటి సౌకర్య కల్పన!

          మంగళవారం - అనగా ఆగస్టు ప్రథమ దివసాన సదరు సౌకర్యమెచ్చటనగా - సాగర్ బైపాస్ వీధిలోని కమ్యూనిస్టు బజారు వద్ద! ఏమాసౌకర్యమందురా - దాసరి వారి ఆవరణలోని ఏడాకుల మొక్క మహా వృక్షమై – అటు వీధినీ, ఇటు పొరుగింటి వారినీ పెటుతున్న ఇబ్బందిని తొలగించుట!

          నేడు రెస్క్యూదళమనిపించుకొన్న వారి సంఖ్య 7+2. పని సమయం వేకువ 4.30 – 7.00 నడుమ. ఒక్క చెట్టు పని బట్టడానికి మామూలుగానైతే ఇంత ఆలస్యం కాకపోను - ఆ చెట్టు విస్తృతీ, నిడివీ, ప్రక్కంటి మీదికి చేసిన దురాక్రమణా, ఇరుకు చోటూ - మొత్తమ్మీద పనికనువుగాని పరిస్థితి కావడంతోనే ఈ జాప్యం!

          ఎన్ని అననుకూల స్థితిగతుల్లో, వీధి అస్తవ్యస్తతల్లో గ్రామ పరిసర దుర్భర వాతావరణాల్లో, పీనుగు - పెంటల కేంద్రాల్లో గత తొమ్మిదేళ్ల స్వచ్ఛంద శ్రమదానం నెగ్గుకొచ్చిందో – ఒక్కొక్కటిగా సమస్యల్ని పరిష్కరించిందో - కార్యకర్తలు వానలో తడిసి, ఎండల్లో ఎండి, చలిలో వణికి తమ ఊరినీ మాత్రం నిర్వహిస్తున్నారో గుర్తుచేసుకొంటేనే ఒళ్లు జలదరిస్తున్నది!

          ఇక్కడి లక్షలాది పని గంటల విషయం ఏ సామాజిక మాధ్యమాల్లోనో చూస్తున్న - ఈ వ్రాతల్ని చదువుతున్న - ప్రత్యక్షంగా దీన్ని చూడని సుదూర ప్రాంతాల వారు ఈ వాస్తవాన్ని శంకిస్తే తప్పేముంది?

          రెండున్నర గంటల విజయవంతమైన కృషి తర్వాత నేటి స్వచ్చ - శుభ్ర - సౌందర్య నినాద ప్రదాత కస్తూరి శ్రీనివాసుడే.

          ఆదివారం వదలిన రహదారి పూల మొక్కల పనికై రేపటి వేకువ కలువదగింది – రామానగరం పరిధిలోని బందరు మార్గంలోని బండ్రేవుకోడు పెద్ద వంతెన దగ్గరే!

          కార్యకర్త మన బంధువు

కాలు దువ్విరంకె వేయు కాలుష్యం మన శత్రువు

ప్రాణప్రదంగా పెంచే వృక్షాలందుకు విరుగుడు

ఆ దిశగా కష్టించే కార్యకర్త మన బంధువు

వాళ్లతోటి చేయికలుపు బాధ్యత మన అందరిదీ!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   01.08.2023.