2844* వ రోజు....           06-Aug-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా?

                         ఈ ఆదివారం స్వచ్చోద్యమంలో 2844 *వ రోజు.

          అసలైతే 6.8.23 వ వేకువ శ్రమ వేడుక - బందరు ఉప రహదారిలో జరగవలసింది. కారణాంతరంతో 1వ వార్డులోని బాలికల వసతి గృహ ప్రాంతానికి మారింది. 29 మంది కార్యకర్తలతో గంటా ఏభై నిముషాల వ్యవధిలో 6.10 సమయానికి ఆ మూడు ప్రక్కలు ఎంత మెరుగు పడినవంటే:

 

          (తొమ్మిదేళ్ల నాటి ఈ వీధికొక గుర్తింపుండేది - బ.మ.వి.లోను, బాటను మూసిన చిట్టడవితోను, జంతు కళేబర, మాంసాల విరజిమ్ముడులోను, దుర్భర దుర్గంధంతోను ఇది అప్పటికే మొదటి రాంకు సాధించిన గంగుల వారి పాలెం వీధినే సవాలు చేస్తుండేది! ఇప్పటికీ ఆ రెండు వీధుల నడుమ స్పర్ద తగ్గలేదు - స్వచ్ఛ హరిత సౌందర్యాల విషయంలో)!

 

          ఆ పీనుగు-పెంటల్లో ముక్కులు మూసి తెరుస్తూ, పాములు, తేళ్ల అవాంతరాలెదుర్కొంటూ స్వచ్ఛంద శ్రమదాత లెంత శ్రమిస్తే ఉభయ వీధులింత ఆహ్లాదకరంగా మారాయో గుర్తొస్తున్నది!

 

"కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన.... "అనే గీతా ప్రవచన మెంతగా అమలయిందో వద్దన్నా  జ్ఞప్తి కొస్తున్నది!  

          సరే, ఇక-గతం సంగతి వదలి, వర్తమానంలోకి వస్తే - ఈ వేకువ బాలికల హాస్టల్ గేటుకు

1) బందరు రోడ్డు దిశగానూ,

2) వడ్ల మిల్లు వైపుగానూ,

3) హైందవ శ్మశానం దిక్కుగానూ –

సుమారు నలభై గజాల చొప్పున –

A) చెట్టుకొమ్మల క్రమబద్దీకరణ,

B) గడ్డి, కొన్ని పిచ్చి- ముళ్ల మొక్కల నిర్మూలన,

C) రాలిపడిన ఆకులు, పుల్లలు ఊడ్చి, సుందరీకరణ,

D) అంతిమంగా ఈ తుక్కులన్నిటినీ ట్రాక్టర్లో నింపుకొని, డంపింగ్ కేంద్రానికి చేర్చిన శ్రమ వితరణ!

          ఏనాటికానాడు – ప్రతి కార్యకర్తకీ కావలసినంత సంతృప్తే గాని, దైనందిన శ్రమ వేడుక సమీక్షకుని సంతోషమే వేఱు!

అది ఏ ఉదయానికా ఉదయం నవ నవోన్మేషం!

          కాఫీ పానీయానంతరం 29 మంది కార్యకర్తల చేత గ్రామ స్వచ్ఛ- సుందరోద్యమ  నినాదాలు ముమ్మారు పలికించినది అనుమోలు దుర్గా ప్రసాదు కుమార్తె గీతా మాధురి! ( 7 వ తరగతి)

          బుధవారం వేకువ మళ్లీ మన బాధ్యతలు మొదలయేది బందరు ఉపరహదారిలోని 21- 22 కిలోమీటర్ల నడుమనే - (నూకల వారి పాలెం – ఆఫీసర్స్ క్లబ్ అడ్డరోడ్డు,) ఎందుకైనా మంచిది- మంగళవారం సాయంత్రం మన వాట్సాప్ చూడండి!)

1 వ గమనిక:  ఏడెనిమిది నాళ్ల ఎడంతో వచ్చి, కసిగా శ్రమ దానం చేసి, కోడూరు వేంకటేశ్వరుని 520/- విరాళమూ, - మధ్యతరగతి రైతు కార్యకర్త సజ్జా ప్రసాదుని ఏకంగా లక్ష వితరణమూ (ఇప్పటి కాయన దాతృత్వం 3 లక్షల పైమాటే!)

          2 వ గమనిక:  నేటి శ్రమ సమీక్షక వైద్యుని, ఆరేడుగురు కార్యకర్తల సామాజిక బాధ్యత 7.00 కు బందరులో మొదలైన గోపాళం వారి వైద్య శిబిరానికి విస్తరించింది! 11.30 దాక కొనసాగింది!

      వానకాలం ఏదైనగాని.....

మద్యం దిన మార్తాండుని మండు టెండలోగానీ-

ఎముకలు కొరికే చలి వేకువ సమయంలో గానీ-

కసరి ముసురు గడ్డు వానకాలం ఏదైనగాని-

ఆగనిదే చల్లపల్లి స్వచ్ఛ - సుందరీకరణం!

 

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   06.08.2023.