2845* వ రోజు ....           07-Aug-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా?

2845* వ నాటి శ్రమ రెస్క్యూ దళం వాళ్లది!

            (7.8.23) సోమవారమైనందున - 4 గురు రెగ్యులర్ రెస్క్యూ మనుషుల్తో బాటు - 3గ్గురు పార్ట్ టైమర్లు కూడ బాగానే సహకరించి, ఇద్దరం వేకువ నడక మనుషులం సైతం కొంతసేపు కలిసి - 4.28 - 6.00 మధ్య జరిగిన వీధి అమరిక చర్యల్లో:

            అశోకనగర్ తొలి వీధిలో ఒక పెద్ద వేప చెట్టు వంకరటింగర గానూ, కరెంటు తీగల పట్ల నిర్లక్ష్యం గానూ పెరగడం ఈ కార్యకర్తల దృష్టికొచ్చింది. ఇకేముంది - మళ్లీ సంవత్సరం దాక - అది అణగి మణగి ఉండేలా కొమ్మలూ, రెమ్మలూ పోగొట్టుకొని, తిరుక్షవరమై నిలిచింది.

            మన వాట్సప్ మాధ్యమ చిత్రాల్లో కెమేరాకు దొరికిన కార్యకర్తల పని విన్యాసాల్ని గమనించారా?

            క్రింద ట్రాక్టర్లో నిలిపిన పొడవాటి నిచ్చెనా, దాని మీదుగా కార్యకర్త ఎక్కిన చెట్టు కాండమూ, చేతిలో రంపమూ, రంపమూ/గొడ్డలీ దెబ్బకు క్రిందపడ్డ కొమ్మలూ, సదరు కొమ్మల్ని ఖండ ఖండాలుగా విడమరచి, ట్రాక్టర్లో నింపుతున్న నలుగురైదుగురు పనిమంతులూ

            సజ్జా ప్రసాదు గారి వీధికి హరిత సౌందర్య లాభనష్టాల సంగతేమో గాని - గంటన్నర గడిచాక క్రొత్త రూపమైతే వచ్చేసింది!

            తూములూరి లక్ష్మణ కార్యకర్త స్వచ్చ - సుందర నినాదాలతో నేటి శ్రమదానం ముగిసింది!

            శ్రమదాన ప్రయోగశాల

చల్లపల్లి స్వచ్ఛంద శ్రమదాన ప్రయోగశాల

సదాచరణ పాఠశాల - శ్రమ వేడుక కళాశాల

సామాజిక బాధ్యతల విశాల విశ్వవిద్యాలయ

మీ శతాబ్ది అవసరాలకీ ఊరొక చంద్రశాల!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   07.08.2023.