2846* వ రోజు ....           08-Aug-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా?

రెండు వీధుల్లో రెస్క్యూ దళం చర్యలు - @2846*

          మంగళవారం(8-8-23) వేకువ కూడ ఆ కృషి 4:30 కే ప్రారంభమై – 6:10 దాక ప్రవర్తిల్లింది. తొలి కార్యకర్తలైదుగురు, మలి పని వాళ్లు ముగ్గురూ ఈ పూటకు తామనుకొన్న 2 రకాల పనులూ ముగించారు.

          “ఏ రోడ్డుకు క్రొత్తగా గుంట పడినా, ఏ చెట్టు కొమ్మ విరిగి రహదారి ప్రయాణాని కాటంకమౌతున్నా, ఊళ్లో ఏ వీధి మార్జిన్ల నెవరు రాత్రికి రాత్రి దురాక్రమిస్తున్నా, ఏ డ్రైన్లో తుక్కు చేరినా..” ఈ కొద్దిమంది మనసులే చివుక్కుమనాలా? స్పందన ఎక్కువై ఇలా కార్యాచరణకు దిగాలా? జేబుల్లో డబ్బు ఖర్చు పెట్టి చెమటలు క్రక్కాలా?.... అని తొమ్మిదేళ్ల పిదప కూడ మాలాంటి కొందరికాశ్చర్యం కలుగుతూనే ఉంటుంది!

ఇవాల్టి రెస్క్యూ చర్యల్నే గమనిస్తే:

1) బందరు మార్గంలో డాక్టర్లు భగత్ సింగ్ - వేణుల ఇంటి ముంగిట పెను వేప చెట్టు కొమ్మలెంత వంకరగా పెరిగితే వీళ్లకెందుకు? అందుగ్గాను అరగంటపాటు కష్టించాలా?

2) గంగులవారిపాలెం బాటలో - బండ్రేవుకోడు కాల్వ గట్టున గత నెలలో తాము చెట్ల మీదకి ప్రాకించిన పసుప్పచ్చ పూల సొగసులు కొన్ని చోట్ల సరిగా లేవనే, కొన్ని తీగలు గతించాయనీ వీళ్ల దృష్టికే రావాలా?

          అసలే పచ్చదనంతో, పుష్ప వైభవంతో ఉన్న ఆ ప్రదేశాన్ని గంటకు పైగా – కలుపు తీసి, పాదులు సరిజేసి, అంతగా మెరుగులు దిద్దాలా?

          తమ ఊరి పట్ల ఏ బాధ్యత, ఏ అనుబంధం ఈ కార్యకర్తల చేత ఇన్ని పనులు చేయిస్తున్నదో మరి!

          84 ఏళ్ల మాలెంపాటి వైద్యుడు నేటి స్వచ్ఛ – సుందరోద్యమ నినాదాలకు ఎంపికయ్యారు!

          బుధవారం నాటి శ్రమదాన స్థలం గంగులవారిపాలెం రోడ్డులోని మూల వద్ద (బండ్రేవు కోడు గట్టు).

          నేల విడిచి సాము కాదు  

మనసు పెట్టి పనులె తప్ప మాయలు మర్మాలు కావు

స్వచ్ఛంద శ్రమదానం నేల విడిచి సాము కాదు

మన వేకువ శ్రమదానం లోకోత్తర సేవ కాదు

అందరిదీ బాధ్యతైన కొందరిదే ప్రయత్నం!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   08.08.2023.