2847* వ రోజు ....           09-Aug-2023

పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడనేల?

బుధవారం (9.8.23) నాటి వీధి బాగుదల - @2847*

వేకువ 4.17 కే 9 మంది పనులు మొదలెట్టిందేమో గంగులవారిపాలెం వీధి తొలి మలుపులో! అక్కడున్నదొక 3 బాటల కూడలి. ‘వెనుకటి గుణంమానజాలని కొందరిప్పటికీ అక్కడ ఒకటి రెండు చిన్న చెత్త కేంద్రాలు రూపొందిస్తుంటారు.

ఈ కార్యకర్తలేమో అందమైన వీధిలో సదరు అవకరాన్ని భరించలేరు! అసలిందులో కొందరికైతే మరో బలహీనత - పాపం వాళ్లకి ఇంత పొందికైన వీధీ, రంగు రంగుల పూల మొక్కలూ, పెద్ద చెట్ల కల్లుకొని పూసిన పూలూ కాక – ఏవో లోపాలు కనిపిస్తాయి; ప్రక్క ఖాళీ స్థలాల్లో ఎప్పటివో చెత్త పోగులు కంటబడతాయి.

వాటన్నిట్నీ సరిదిద్దడమే తమ బాధ్యతగా పని చేస్తున్న వాళ్ల నేటి కార్యాచరణమేమనగా :

1) పూలమొక్కల పాదుల్ని, అందలి గడ్డిని తొలగించుట,

2) ఎండు వ్యర్థాలనూ, నేటి తాజా వ్యర్ధాలనూ దంతెలతో గుట్టలు చేసి, డిప్పలకెత్తి ఒకే చోటికి తరలించుట,

3) వీరిలో ఇద్దరో ముగ్గురో అక్కడికి తూర్పుగా – బందరు బైపాస్ రోడ్డు దక్షిణాన రేపో మాపో నాటవలసిన పూల మొక్కలకు స్థల నిర్ధేశం గావించి వచ్చుట,

ఒక గమనార్హమైన అంశమేమంటే – దావణగెరే నుండో, విదేశం నుండో వేళకాని వేళ మేల్కొన్న వారు భౌతికంగా పాల్గొన లేక – వీడియో ద్వారా నేటి శ్రమదానాన్ని వీక్షించి ఆనందిస్తారు గాని - ఈ ఊరికీ, వీధికీ చెందిన గృహస్థులకు బొత్తిగా పట్టకుండడం!

ఎవరి ఆనందాలు వాళ్ళవనుకోండి – ఈ వేకువ గంటన్నర పాటు వీధి పరిశుభ్ర - సౌందర్యాలకై శ్రమించిన అష్టాదశ కార్యకర్తలు పని ముగింపు దశలో తాము సాధించిన 3 రోడ్ల కూడలి అమరికను సంతృప్తిగా చూసుకొన్నారు!

6.20 తరువాత – రైతు కార్యకర్త సజ్జా ప్రసాద నామధేయుని త్రిగుణాత్మక స్వచ్ఛ – సౌందర్య సంకల్ప నినాదాలందుకొన్నారు!

మరొక వృద్ధ(?) కార్యకర్త గోపాలకృష్ణుని 2000/- విరాళ సమర్పణను సహర్షంగా స్వాగతించారు!

వారంలో మిగతా రోజుల శ్రమదాన ప్రణాళికను DRK వైద్యుల వారు ప్రస్తావించగా అంగీకరించారు!

రేపటి వేకువ శ్రమ కార్యక్రమం గూడ ఇదే గంగుల పాలెం వీధిలో – బండ్రేవు కోడు కాల్వ గట్టు వద్దనే అని నిర్ణయించుకొని, ఇళ్లకేగారు!

ఔననరు – కాదనరు

ఎంత గొప్పదొ చల్లపల్లి - ఎంత లౌక్యులొ అచటి పౌరులు

కార్యకర్తలు స్వచ్ఛ సుందర గ్రామమునకై తపిస్తుంటే

ప్రపంచమునందెచట జూడని మహత్తర ఉద్యమంలోనికి

ఔననరు - కాదనరు శ్రమదానానికైతే కానుపించరు!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   09.08.2023.