2848* వ రోజు ....           10-Aug-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడనేల!

మరొక వీధి సుందరీకరణ ప్రయత్నం -@ 2848*

            గురువారం (10.8.23) వేకువ జరిగిన సదరు ప్రయత్నం కూడ గంగులవారిపాలెం బాటలో నిన్నటి తరువాయి గానే!  4.14-6.05 కాల పరిమితిలోనే!  ప్రయత్నీకులు 20 మందే ! క్రొత్తగా పరిశుభ్ర - సుందరీకృత వీధి 30 గజాల వరకే!

            నిన్నరాని సుందరీకర్తలు ఈ వేకువ వచ్చి, నిన్నటి కూడలిలో వాళ్లకు మరికొన్ని లోపాలు కనిపించివాళ్ల పద్ధతిలో ఆ 20 గజాల జాగాను తీర్చిదిద్దినందు వల్లే ఈ ఉదయం పనిలో వాసి తప్ప రాశిపెద్ద గా కనిపించలేదు.

అదీ గాక – పని జరుగుతున్నది పెద్ద మురుగు కాల్వ దక్షిణపు గట్టున కావున, ఇరుకు చోట్ల జాగ్రత్తగా మసులుకోవలసి రావడం కూడ ఇంకో కారణం ! నిన్నా- నేడూ శ్రమదానంతో వంతెన దాక శుభ్ర పరచే లక్ష్యం నెరవేరలేదు!

            నేటి  తలా 100 నిముషాల సమయ దానంతో అక్కడ జరిగిన మార్పులివి:

- యదాలాపంగా చూసి మెచ్చేట్లుగానే ఉన్నా, కార్యకర్తల సూక్ష్మ దృష్టికి వచ్చిన గడ్డీముళ్లు- - పిచ్చి మొక్కలు తొలగిపోవడం,

నిన్న  ప్రోగుపడిన వ్యర్థాల గుట్టను నలుగురు మోసుకుపోయి, మురుగు కాల్వ అంచున పరిచి, సర్దడం,

- 2 డిప్పలకు సరిపడా నీళ్ల, శీతల పానీయ మద్య  పాత్రల్ని ఏరడం,

- రోడ్డంతటినీ మరొకమారు క్షుణ్ణంగా ఊడ్వడం,

            ఇవన్నీ కూర్చొని వ్రాయడమూ - చదవడమూ తేలికేగాని, ఎగుడుదిగుడు జాగాలో పని చేసేవాళ్లకి గదా - అందులోని కష్టం తెలిసేది!

            నేటి తుది సమావేశాన్ని 2 x 3 నినాదాలతో పార్రంభించినది భోగాది వాసుగారైతే –

            రేపు 180 పైగా పూల మొక్కలు నాటవలసిన - అందుకు దుబాయి నుండి శ్రమ కోర్చి అతిథిగా వస్తున్న “శశి” వైద్యుని గురించీ, ఆదివారం వేంకటాపురం - శివరాంపుర రహదారి పచ్చతోరణ ప్రణాళిక గురించీ వివరించినది దాసరి రామకృష్ణ ప్రసాదు గారైతే, కార్యకర్తల్ని ఖాళీగా ఉంచక - బుర్రలకి పదును పెట్టే పద వినోద విజేతలకు బహుమతులు పంపినది ప్రాతూరి శాస్త్రి గారైతే –

చప్పుడు లేకుండా 712/- గుప్త విరాళ ప్రదాత షణ్ముఖ శ్రీనివాసుడు!

            రేపటి బందరు ఉపరహదారి పుష్పాలంకరణ కోసం అతిథి వైద్యుడూ, సర్పంచులతో బాటు - మనం కలుసుకోదగ్గ చోటు గంగుల పాలెం దగ్గరి హైవే వంతెనే!

       సాధనమున పనులు

సాధనమున పనులు సమకూరుననిగదా

వేమనార్యుడెపుడొ విన్నవించె

 వేన వేల నాళ్లు వీధి శుభ్రతకు శ్ర

మించు వీరులకు నమస్కరింతు!

- ఒక ‘స్వచ్ఛ సుందర చల్లపల్లి’ కార్యకర్త

10.08.2023.