2849* వ రోజు ....           11-Aug-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడనేల!

చల్లపల్లిలో ప్రవహించిన దుబాయి చైతన్యం @2849*

చేతన శ్రావణ శుక్రవారం (11-8-23) వేకువ కాలానిది. 30 మంది కార్యకర్తల్లో ఏడెనిమిది మంది ప్రవాసులే! చైతన్య ఝరిపారిన చోటు బందరు ఉపరహదారిలో – 22 వ కిలోమీటరు వద్ద, నాటిన మొక్కలు 100!

స్వచ్ఛ కార్యకర్తల ఉడుం పట్టుదల ఎప్పుడూ ఉండేదే గాని తొమ్మిదో పదో ఏళ్లైనా చెక్కుచెదరనిదే గాని - అప్పుడప్పుడూ ఇలాంటి క్రొత్త జోష్ నిండడమొక ప్రత్యేకత! అందులోనూ ఈ వేకువ వచ్చి, శ్రమదానంలో పాల్గొన్న రెండు కుటుంబాలూ సామాన్యమైనవా? అటు వేమూరి రాజేష్ గాని, డాక్టర్ శశి గాని మామూలు వ్యక్తులా?

పుస్తక రికార్డు విజేత నైషిత, 8 ఏళ్ల సోహిత చెప్పుల్లేకుండా జారుడు వాలులో పూల మొక్కల్నాటిన దృశ్యాన్ని! చల్లపల్లి స్వచ్ఛ సుందరోద్యమం 30 కి పైగా ఊళ్ళలో శ్రమదానానికి ప్రేరకమనుకొంటే – ఆ ఉద్యమానికి తాజా ప్రేరణ ఇలాంటి బాలలే!

ఇలాంటి సన్నివేశాలూ, అతిధి కార్యకర్తలైన రాజేష్ - శశిల శ్రమదానానంతర ప్రసంగాలూ, ఆనందంతో మాటలు పెగలని DRK వైద్యుని సమీక్షలూ, బురద అంటుకొన్న బట్టల్తోనే సోహిత డ్యాన్సూ నేటి పాతిక మందీ నాటిన పూల మొక్కలు త్వరలో పుష్పిస్తే ఈ రహదారి బాటసారుల కందించే ఆహ్లాదాలూ... ఎందరు క్రొత్త కార్యకర్తల్ని ఈ మట్టి పనికి పురికొల్పుతాయో చూడాలి!

నేటి వీరోచిత శ్రమదాన ఘట్టాల్నీ, అప్పటి కార్యకర్తల ఉత్తేజ - ఉద్వేగ తరంగాల్నీ - ముఖ్యంగా అతిధుల ప్రసంగాన్నీ తెలుసుకొనేందుకు “జై స్వచ్ఛ చల్లపల్లి సైన్యం” వాట్సప్  గమనించ ప్రార్ధన.

ఆదివారం వేకువ వేంకటాపురం దగ్గర జరిగే రహదారి పచ్చతోరణం వందల కొద్దీ చెట్ల విషయం కనుక – పూర్తి స్థాయిలో కార్యకర్తలు సన్నద్ధులు కావాలని సూచన! (సొంత వాహనం లేనివారికి పద్మాభిరామం నుండి చిన్న కార్ల సౌకర్యం కలదని మనవి!)

ఏ నదురూ బెదురూ, తడబాటూ లేకుండ ప్రాత కార్యకర్తలాగా వేమూరి రాజేష్ స్వచ్ఛ – సుందరోద్యమ నినాదాలు చేయడం నేటి విశేషం!

నేటి అసంపూర్ణ హరిత సుందరీకరణ కోసం రేపటి వేకువ మనం కలువదగిన చోటు గంగులపాలెం ప్రక్కన NH -16 - వంతెన దగ్గరే!

            ఆహ్వానం

ముప్పై మంది కష్టంతో ముగిసె “పచ్చతోరణం”

దుబాయ్ ప్రవాస శ్రమదానంతో ఉద్యమ పతాకం

గ్రామ సమాజానికిదొక కనువిప్పగు సంఘటనం

ప్రతి వేకువ గంట శ్రమ వేడుకకై ఆహ్వానం!

- ఒక ‘స్వచ్ఛ సుందర చల్లపల్లి’ కార్యకర్త

   11.08.2023.