2850* వ రోజు ....           12-Aug-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా!

జోరు వానైతే మాత్రం ఏంటిటా ?@2850*

            అటు వానదేవుడి ఉరవడి - ఇటు స్వచ్ఛ కార్యకర్తల శ్రమ పరవడి, వేకువ చీకట్లో క్రింద కాలు జర్రున జారిపడే బురద తాకిడి! 4.28 మొదలు 6.22 దాక 20+ మంది శ్రమ సందడి! అదీ స్థూలంగా అగస్టు 12 వ వేకువ సమయపు రహదారి పచ్చతోరణం హడావిడి!

            ప్రణాళికల్లో, కాగితాల్లో, ప్రకటనల్లో కొన్ని సంస్థల అత్యుత్సాహం ఎప్పుడైనా ఉంటుంది గాని, క్షేత్రస్థాయిలో లక్షల పని గంటల పగడ్బందీ శ్రమదానం మాత్రం ఈ చల్లపల్లిలోనే సాధ్యం! ఈ 2 నెలల కాలంలోనే 15 - 16 వందల వివిధ వృక్ష జాతుల్ని క్రొత్త NH -216 రహదారి ప్రక్కల ప్రతిష్టించడమందుకు సాక్ష్యం!

            ఈ వేకువ కూడ బహుశా వాన మహాశయుని క్రమశిక్షణా రాహిత్యం వల్ల పనిలో అనుకొన్నంత వేగం కన్పించక – ముప్పై ఐదు చెట్లే నాటగలిగారు!

            నిన్న త్రవ్విన గుంటల్లో నీళ్లు తోడి, ఎగుడు దిగుడు బురదలో కాళ్లు నిలద్రొక్కుకొని, బరువైన 8/10 అడుగుల చెట్లను నాటడం చిన్న సంగతేమీ కాదు! దస్తావేజుల లేఖక స్వచ్ఛ కార్యకర్త ఒకాయన ఈ ప్రయత్నంలోనే గుంటలో పడిపోయి, బట్టలకు బురద అంటుకొన్న వైనం వాట్సప్ మాధ్యమ చిత్రంలో చూడవచ్చు!

            ఇక పొలం అంచున - హైవే వారి పెద్ద చెట్ల నడుమ ఖాళీల్లో రంగురంగు పూల మొక్కలు నాటిన డజను మంది శ్రమా వర్ణనకందనిదే! నాకైతే ఆ సన్నివేశం నెలల తరబడీ స్మరణీయమే! ఆ కష్టం చేస్తున్న వాళ్ళకి ఆనందం - చూస్తున్న నాబోటి వాళ్లకు ఆశ్చర్యం! పైగా ఈ కష్టమంతా వాన దేవుడి చిలిపి చేష్టల నడుమనే!

            అసలీ వేకువ అన్నిటి కన్నా నన్నాకర్షించిన దృశ్యం - ఎత్తైన ట్రాక్టర్ మీద నిలబడి, ఇద్దరు నర్సులు బరువైన చెట్ల కుండీల్ని అవసరాన్ని బట్టి వింగడిస్తూ క్రింది కార్యకర్తల కందించడమే!

            ఈ నాటి వాట్సప్ చిత్రాల్లో పదేపదే “FOGSI” అనే గైనకాలజిస్టుల సంఘం పేరు కనిపించింది చూశారు గదా! ప్రసూతి వైద్యుల పచ్చతోరణ సామాజిక బాధ్యతన్న మాట!

            పని నడుమ జారిపడ్డ కస్తూరి ప్రసాదు నేటి త్రివిధ స్వచ్ఛ సుందరోద్యమ నినాదకుడు! 6.30 - 6.45 నడుమ నేటి ముచ్చట్లు ఎక్కువగా ఈ మధ్యాహ్నం స్వచ్ఛ సుందర చల్లపల్లి సందర్శనకూ, రేపటి వేకువ వేంకటాపురం వద్ద పెట్టబోయే మొక్కల కార్యక్రమంలో పాల్గొనేందుకూ ఎక్కడెక్కణ్ణుంచో వస్తున్న DRK గారి డజను మంది సహాధ్యాయ వైద్యుల గురించే జరిగాయి.

            గంగులవారిపాలెం వీధిలో మా ఇంటి వద్ద నుండి ఎన్ని కార్లు వేకువ 4.00 కే సిద్ధంగా ఉండాలీ, ఎవరెవరు అక్కడికి కార్లలో చేరుకోవాలి అనే చర్చ కూడ జరిగింది. ఆదివారం వేకువ వేంకటాపురం వద్ద పూల/పండ్ల మొక్కలు విజయవంతంగా నాటగలమనే నమ్మకం అందరికీ కలిగింది!

            కావున రేపు సొంత వాహనదారులు నేరుగా 4.30 కు వేంకటాపురం వంతెన వద్దకూ, కార్లెక్కవలసినవాళ్లు 4.00 కు పద్మాభిరామం వద్దకూ రాగలరు!

            కథలు కథలుగ చెప్పగలుగును!

గట్టు నడిగిన చట్టునడిగిన చెట్టు పుట్టల నడిగి చూచిన

తల్లి నడిగిన పిల్ల నడిగిన కల్ల తెలియని పువ్వు నడిగిన

దారి ప్రక్కన రంగులద్దిన గోడ, నెండిన మ్రోడు నడిగిన -  

స్వచ్ఛ సైన్యం శ్రమ చరిత్రను కథలు కథలుగ చెప్పగలుగును!

- ఒక సీనియర్ స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త

  12.08.2023.