2851* వ రోజు....           13-Aug-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా?

                             2851* వ నాడు - ఎక్కడ, ఏమిటి, ఎలా జరిగింది?

          చల్లపల్లి గ్రామ స్వచ్ఛ సుందరోద్యమంలో ఈ ఆదివారం (13.8.23)   ఒక ప్రత్యేక -విశిష్ట –స్మరణీయ ఘట్టం!

           వేకువ 4.30 కే -  చల్లపల్లికి 4 న్నర కిలోమీటర్ల దూరాన వేంకటాపురం ముంగిట అది ఆవిష్కృతమయ్యింది.! " జై స్వచ్ఛ- చల్లపల్లి సైన్యం" వాట్సప్ దృశ్య – శ్రవణ వందల కొద్దీ  చిత్రాలు గాని, నేనుపయోగించే భాషగాని సదరు ఘట్టం ప్రాముఖ్యతను పూర్తిగా చెప్పలేక పోవచ్చు! చదువరుల ఊహలకు కదలిక వస్తేనే అది నెరవేరవచ్చు.

 

          ఒకరకంగా ఈ సంఘటనకు మూల కారణం – కోనేరు వేంకట రామయ్య గారి వారసులనవచ్చు! ఎందుకంటే- అన్నదానాలూ, విద్యా ప్రదానాలూ ఎక్కడైనా జరుగుతుంటాయి తప్ప- ఇలా మానవాళి మనుగడను పెంచే-పర్యావరణహిత అండ దండలిచ్చే, శ్రమదానాలు ఇక్కడివాళ జరగడడానికి వారి దాతృత్వమేమూలంగనుక !

          అసలీ 2851* వ శ్రమ సమర్పణ ఎందుకు చిరస్మరణీయ మంటే:

- వివిధ రాష్ట్రాలకు చెందిన 10 మంది ప్రముఖ వైద్యులు ఎప్పటి నుండో ఉవ్విళ్లూరి చల్లపల్లి నిస్వార్థ శ్రమ వేడుకకు రావడమూ, ఒళ్ళొంచి పనిచేయడమూ,

- సమీప ఉభయ గ్రామాల్నుండి పాతిక మంది వచ్చి పాల్గొనడమూ,

- పాత్రికేయులూ, పిన్న-పెద్దలంతా ఒక దశలో 75 మంది దాక, తెల్లారక ముందే ఈ సత్కార్యంలో ప్రవేశమూ, శివరాంపురం దిశగా, రెండు వంతెనల నడుమ రహదారి కిరు ప్రక్కలా ఏ నూట ఏభై పండ్ల - పూల చెట్లనో పోటీ పడి నాటడమూ,

- మైకు నుండి పాటల్తో, ఉత్తేజకరమైన మాటల్తో, కాలుష్యం మీద యుద్ధం ప్రకటిస్తున్న చేతల్తో, ఒక మంచిపని చేస్తున్న సానుకూల భావనల్తో ఇదొక శుభ కార్యంలా కనిపించడమూ,

-  ఒకానొక సామాజిక - సామూహిక శ్రమదాన సత్కార్యపు ఉత్తేజం- ఉద్వేగం గంటన్నర పని సమయంలో అందరి - ముఖ్యంగా అతిథి వైద్యుల ముఖాల్లో ప్రతి ఫలించడమూ......

 

          కాస్త నిదానంగా ఆలోచిస్తే తెలుస్తుంది - ఎందుకీ స్వచ్ఛ సుందరోద్యమం తొమ్మిదేళ్లుగా ప్రస్థానిస్తున్నదనే ప్రశ్నకు సమాధానం!

 ప్రతి కార్యకర్త తానెవర్నుద్ధరించడానికో “సేవ” చేయడం లేదని, పుట్టుకతోనే తాను తెచ్చుకొన్న సామాజిక ఋణ భారాన్ని దించుకొనే  “బాధ్యత”నే నిర్వహిస్తున్నాననే తాత్త్విక పునాదే ఈ కార్యక్రమ విజయ రహస్యం!

          6.30 దాటాక- ఆనందమయమైన గుంపు ఛాయ చిత్రమప్పుడు - నందేటి వాని పాటలూ, పద్యాలతోనూ - సీనియర్ న్యూరాలజీ ప్రొఫెసర్ (మితిమీరిన ఉత్సాహంతో బట్టలకు బురదంటుకొన్న) రామ్ తారకనాథుని, మరొక సీనియర్ పద్మ లక్ష్మి వైద్యురాలి ఉపన్యాసాలతోనూ, సందర్భోచిత సామాజిక హిత చతురోక్తులతోనూ, కొన్ని కేరింతల్తో నూ, ఉద్యమ నినాదాలతోనూ జరిగిన సమావేశం ఎవరిలో మాత్రం ఉత్తేజం నింపదు?

      మాజీ కళాశాలాధ్యక్షుడు-సాంబశివరావు గారిఉద్యమ విరాళం 1000/- (దొప్పలపూడి హవీష్ చౌదరి, మండవ లషిక చౌదరి - మనుమల పేరిట)  మనకోసం మనం మేనేజింగ్ ట్రస్టీకి అందినది.

          బుధవారం వేకువ కార్యరంగ వివరం కోసం కార్యకర్తలు  మంగళవారం నాటి మన వాట్సప్ ను గమనించగలరు.-

 

          పచ్చ తోరణ బంధకంగా !

సదాలోచన ఊకదంచదు - స్వచ్ఛ భావన ఊరకుండదు

మాతృగ్రామం పట్ల ఎదిగిన మమత సైతం గమ్మునుండదు

ప్రయాణికులకు పరవశంగా - పండ్ల మొక్కల పెంపకంగా

వేంకటా- శివరాం పురాలకు పచ్చ తోరణ బంధకంగా !

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   13.08.2023.