2852* వ రోజు ....           14-Aug-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా!

చల్లని వేకువ పూట చక్కని వీధి బాధ్యత! @2852*

          సోమవారం (14.08.2023) మబ్బులు క్రమ్ముకొన్న 4.25 సమయానికే - ఊరి వీధి రక్షక కార్యకర్తలనబడే కొందరి కృషి మొదలైపోయింది. తొలుత బందరు రోడ్డులోని దంత వైద్యుల ఇంటి ఆవరణలోని వేప చెట్టూ, పిదప గంగులవారిపాలెం రోడ్డులోని కోనోకార్పస్ చెట్టు పనులూ చూసుకొచ్చారు.

          రెండో చెట్టయితే పిచ్చ పిచ్చగా పెరిగి, మాజీ DSP రాజేంద్రగారి ఇంటికిన్నీ, విద్యుత్తీగల వరుసకున్నూ కలుగుతున్న ఇబ్బందుల్ని గృహస్తుని అభ్యర్ధన మేరకు అదుపుచెయవలసి వచ్చేనట!

          సోమ, మంగళ వారాలందున రెపరెపలాడేది రెస్క్యూ దళ శ్రమదాన పతాకమనే విషయం విదితమే గదా! ఈ పని ఆ పని అనే నియమాల్లేక - ఏకరకు, మురికి పనులకైనా ఈ ముఠా సంసిద్ధమే గదా!

          సామాజిక కృషి భావనలు కలిగి, ఎక్కడెక్కడి నుంచో శనివారం ఇక్కడికి చేరుకొని, ఇక్కడి స్వచ్చంద శ్రమదాన ఫలితాల్ని తిరిగి చూసి, నిన్నటి ఉదయం కార్యకర్తల్తో కలిసి శ్రమించి, ఊరంతా పరిశీలించిన పది మంది వైద్య బృందం అనుభూతుల్నీ, స్పందనల్నీ ఈ వేకువ నడక సమయంలో విన్నాను.

          ఇక్కడి కార్యకర్తల శ్రమ భావనలు ఎన్నెన్ని ప్రాంతాలకు చేరుతున్నవో గమనించాను!

         అతడు మారుతి

అతడు మారుతి - వేంకటాపుర మందతనిదొక క్రొత్త సంస్కృతి

తండ్రి స్మృతిగా ప్రక్క ఊరికి దారి పొడుగున హరిత సత్కృతి

స్వకష్టార్జిత మిట్లు పర్యావరణ భద్రత కిచ్చు వైఖరి

ముందు ముందు వదాన్యులెందరొ పూనుకొన దగు స్వచ్ఛ విస్తృతి!

- ఒక సీనియర్ స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త

  14.08.2023.