2853* వ రోజు ....           15-Aug-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా!

మొక్కల్నాటిన పనే ఈ వేకువ శ్రమదానమంటే - @2853*

          మంగళవారం స్వాతంత్ర్యదినం (15.08.2023) కూడ రెస్క్యూటీమ్ దే ఐనా - ఈ వేకువ 4.27 - 6.04 నడుమ గంగులపాలెం బాటలో జరిగిందంతా హరిత దానమే! అసలు కార్యకర్తలూ, కొసరు కార్యకర్తలూ కలిపి 13 మంది!

          నాటిన చెట్ల సంఖ్య ఐదే గాని ఆ కదంబమూ, పొగడలూ పెద్దవైనందువల్లా, లోతుగోతులు త్రవ్వి, చెదనివారణకై వేప పిండి వేసి, షరామామూలు గానే గడ్డీ - పిచ్చి మొక్కలూ తొలగించడం వంటి పనులమూలంగానూ, రెండు చోట్ల పని కావడం చేతనూ కాస్త ఎక్కువ సమయమే పట్టింది!

          నాల్గు పొగడ చెట్లూ మా ఇంటి ఎదుటి రహదారి పక్కనే - మేమిద్దరమే నాటగా, బందరు NH 216 ఉపదారి ప్రక్కన కదంబం పెట్టినది డాక్టర్ ముత్యాల వర ప్రసాదు గారూ, వారి శ్రీమతి జయరాణి గారూ! (వీరి కుమారుడు మణీంద్ర గారి ప్రమేయమూ ఉన్నది!)

          ఏదో మాట వరసకి రెస్క్యూ టీమ్ అంటారు గానీ ఇంచు మించు వీళ్లంతా ఆల్రౌండర్లన్న మాట! ‘ఉదర పోషణకు బహుకృత వేషమ్’ అన్నట్లుగా అవసరం పిలుపిస్తే వీళ్లే సుందరీకర్తలు, రోడ్ల మరమ్మతుదారులు, ఇంకా చెప్పాలంటే ఇంజనీర్లు, బురద కంపు పని వాళ్లూ - ఏ వేషానికైనా రెడీ అన్నమాట!

నేటి స్వచ్చోద్యమ విరాళ వివరానికొస్తే –

ఎన్నాళ్ళైనా ‘చిన్న డాక్టర్గానే పిలవబడే సీనియర్ డాక్టర్ వరప్రసాదు దంపతుల 5000/-, వీరి పుత్రుడు మణీంద్ర గారి 5000/- చెక్కుల రూపంలో అందినవి!

          నిన్నటి స్వచ్ఛోద్యమ నినాదకర్త తూములూరి లక్షణుడైతే – నేడా పనికి పూనుకొన్నది BSNL నరసింహుడు!

          ఆదివారం నాటి అసంపూర్ణ పచ్చతోరణ పరిపూర్తి కోసం రేపటి వేకువ మనం కలువదగినది శివరాంపురం – వేంకటాపురం నడుమనే (విశేషాలుంటే మన వాట్సప్ లో తెలుపబడును)!

          సంగతులను గ్రహించవా?

కాలానికి కళ్లున్నవి - లోకానికి చెవులున్నవి

నీరవ వాతావరణపు నిస్తేజ గ్రామంలో

ప్రాణవాయువులు పెంచే - పచ్చదనాలను పంచే

స్వచ్ఛ – సుందరోద్యమాల సంగతులను గ్రహించవా?

- ఒక సీనియర్ స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త

  15.08.2023.