2854* వ రోజు ....           16-Aug-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా!

2854*వ వేకువ కృషి శివరాంపురం దగ్గరగా.

            బుధవారపు బ్రహ్మకాలం - 4.20 కే సదరు సత్కృషి వంతెన దగ్గర రహదారికి తూర్పుగా మొదలై, 6.10 వరకూ నిరాటంకంగా ముగిసింది. కృషీవలురు 26 మందిలో వేంకటాపురపు కోనేరు ట్రస్టు పనివారిద్దరూ, అదే గ్రామస్తులిద్దరూ.

            పాపం అదే గ్రామస్తులిద్దరు మాత్రం ఎటూ తేలని - సందిగ్దంలో ఉండి  - ఉండి, బెరుకో  మొహమాటమో కాని, చివరికి పనిలో దిగకుండానే నిష్క్రమించారు! ఐతే - ఒక రైతు మాత్రం చీకటితో పొలం వెళుతూ తన పని వాయిదా వేసి, కార్యకర్తల్తో కలిసిపోయాడు! (ఈ కృష్ణ - గతాదివారం కూడ బాగానే కష్టించాడు.)

            ఈ వైచిత్ర్యాన్ని, వైవిధ్యాన్నీ చిత్తగించారా? ఈ వేకువ 4 ½ కిలోమీటర్లు దాటుకొని వచ్చి, 86 పూల - పండ్ల చెట్లను నాటింది చల్లపల్లి కార్యకర్తలు! శివరాం - వేంకటాపురాల నడుమ, ఉభయ గ్రామస్తుల ఆహ్లాద నిమిత్తం జరుగుతున్న ఇంత మంచి పనుల్లో స్ధానికుల్నుండేమో తక్కువ భాగస్వామ్యం!

            ఇక్కడ కోనేరు వారి వారసత్వ దాతృత్వం ఉంది, చల్లపల్లి నుండి శ్రమదాతృత్వముంది, సరిపడాలేనిది భవిష్యత్తు సౌకర్యాల పట్ల స్థానికుల్లో దార్శనికత, చొరవ! [ఇంకో రకం చొరవ మాత్రం ఉన్నది - ఆదివారం పెట్టిన పూల మొక్కల్లో ఒకటి సోమవారానికి అదృశ్యం కావడమూ దాన్ని పునః ప్రతిష్టించేందుకిద్దరి నిర్ణయమూ...]

            కొన్ని విషయాలు చెప్పుకుంటే సిగ్గు చేటు వ్రాస్తుంటే కలం, సిరా చేటు! రోడ్డు వార నేటి పచ్చతోరణ ప్రయత్నం అరకిలోమీటరు మేరా మూణ్ణాలుగు చోట్ల కార్యకర్తలు మొక్కల్నాటింది నోటితో చెప్పరాని గలీజుల దగ్గరే!

            స్వచ్ఛ సైనికులు మొక్కలు నాటడమంటే ఏమిటి? ఏదో మొక్కుబడిగా - అడ్డదిడ్డంగా నాటేసి చేతులు దులుపుకోవడం కాదే!

            ముందు రోజే కూలీలు గుంటలు త్రవ్వితే ఈ వేళ క్రమపద్ధతిలో నాటవలసిన మొక్కల్ని క్రితం రాత్రే ట్రాక్టర్లలో సర్దుకొని, తెచ్చి, ఒకే పండ్ల కులానికి చెందిన 10 చెట్లనూ, తరువాత 10 భిన్న రంగుల పూలమొక్కల్నీ కొలతల ప్రకారం - ముందు ముందు దారి ప్రయాణాలకడ్డు రాని పద్ధతిలో అమర్చడం కదా!

            నేటి 86 మొక్కల్లో నేరేడు, మామిడి, సపోటా వంటి ఫల వృక్ష జాతులూ, సువర్ణ గన్నేరు చిన్న తురాయి (గద్ద గోరు) పారిజాతం వంటి రంగు, సువాసనల పూలమొక్కలూ ఉన్నాయి!

            ‘FOGSI’ - అంటే గైనకాలజిస్టుల - ప్రసూతి వైద్యనిపుణుల సంఘపరంగా ఈ నాటి పచ్చతోరణం జరిగినట్లు తెలుస్తున్నది.

            నేటి కృషి సమీక్షా వేడుకను ముందుగా నినాదాలతోనూ, తదుపరి కొన్ని సూక్తులతోనూ అలరించినది అడపా గురవయ్య గారు!

            నేడు శేషించిన హరిత తోరణం ముగింపు కోసం రేపటి వేకువ కూడ మరింత మందితో కలిసి కృషిచేయవలసింది - శివరాంపురం సమీపాననే!

            చోద్యం చూస్తుందామా?

ఏమయ్యా! ప్రతి వేకువ నీ గ్రామం వీధుల్లో

తొమ్మిదేళ్లు ఎండల్లో - తొలకరిలో - మంచుల్లో

కార్యకర్త శ్రమిస్తుంటె చోద్యం చూస్తుందామా?

అప్పుడప్పుడైన వచ్చి, ఆత్మీయత చూపుదమా?

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   16.08.2023.