2855* వ రోజు ....           17-Aug-2023

పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా!

పూర్తైన రహదారి హరిత సుందరీకరణం - @2855*

            గురువారం(17-8-2023) వేకువ 4.22 - 6.20 వేళ - 26 మంది శ్రమార్పణతో - మరొక 90 మొక్కల అమరికతో 3 రోజుల చిన్నపాటి పచ్చతోరణ యజ్ఞం ముగిసింది. బాటకు రెండు ప్రక్కలా 1+1 కిలోమీటరు బారునా ఇప్పుడు 360 పండ్ల, పూలమొక్కలు కొలువు తీరినట్లయింది!

            మామిడి, సపోట, నేరేడు, జామ, పనస, బాదం, సీతాఫలం, వెలగ, రాతి ఉసిరి, చిన్న ఉసిరి పండ్ల చెట్లు సగం, పచ్చ తురాయి, ఎర్ర తురాయి, సువర్ణ గన్నేరు, గన్నేరు, టేకోమా రెడ్, నూరు వరహాలు, గోరింట, పారిజాత పూల మొక్కలు మిగతా సగం. ఇక - వీటన్నిటికి రక్షణగా ముళ్ల కంపలమర్చడం మనకోసం మనంట్రస్టు కార్మికుల వంతు! సంవత్సర కాలం వీటి సంరక్షణ కోనేరు ట్రస్టుమనుషుల బాధ్యత!

            ముందు ముందీ చెట్ల ఫలసాయమూ, పూలసోయగాల వైభవమూ, ఎండ వేళ నీడా, పుష్ప సుగంధమూ ఈ రాదారి ప్రయాణికులకు - ముఖ్యంగా 2 గ్రామాల ప్రజలకూ దక్కిన అవకాశం!

            3 వేకువలు - పాతిక నుండి మూడు పాతికల మంది సామాన్యులూ - అసాధారణులూ ఊరుకాని ఊరొచ్చి, బురద మట్టి పనులకు దిగి, ఒక రహదారినీమాత్రం మెరుగులు దిద్దడం అనాలోచితంగానో - ఆషామాషిగానో అని ఎవరైనా భావిస్తే అంతకుమించిన దురదృష్టం ఉండదు!

            ఒకవేళ ఈ ప్రయత్నం ఒక శ్రమజీవన సౌందర్యమనీ, నేటి సమాజానికత్యంత ఆవశ్యకమనీఊళ్ళో అంటు జబ్బులు తగ్గుతాయనీ, బుర్రల్లో చికాకులు తగ్గుతాయనీ, సామూహిక సమైక్య శ్రమదానంతో కొన్ని అనారోగ్యాలూ - అస్తవ్యస్తతలూ తప్ప పోయేదేమీ ఉండదనీ తలిస్తే ఏ గ్రామస్తులైనా ఇందులో పాల్గొంటే - ఇప్పుడున్న చల్లపల్లి స్వచ్ఛ కార్యకర్తల బలం అమాంతం పెరగాలి!

            స్త్రీలతో సహా రెండూళ్ల నుండి నలుగురైదుగురూ, పాత్రికేయులూ, కర్షకులూ పూనుకొంటే - 116 నిముషాల్లో 90 చెట్లు నాటడం అవలీలగా జరిగిపోదా? అసలా లక్ష్యం నిర్ణీత కాలం కన్న 20 నిముషాలు ముందే ముగిస్తే ఈ కార్యకర్తలేమన్నా ఖాళీగా కూర్చుంటారా? వంతెన మీద పేరుకున్న మట్టి - ఇసుకల్ని చెక్కి, గోకి, 20 డిప్పల మట్టితో రోడ్డు తూర్పు ప్రక్క పల్లాన్ని పూడ్చి, సదరు రోడ్డు మన్నికను పొడిగించారు. కాఫీ ఆలస్యాన్నావిధంగా సద్వినియోగించారన్నమాట!

చివరికి వంతెనపైన నిలబడి,

1) స్వచ్చోద్యమ చల్లపల్లి

2) పచ్చతోరణ

3) FOGSI బ్యానర్ల సాక్షిగా - తూము వేంకటేశ్వరుననుసరించి శ్రమ సంకేత నినాదాలు ప్రకటించి, జిల్లా కలెక్టరు కార్యాలయంలో అతని మజ్జిగ పంపణీ గురించీ, సబ్ కలెక్టర్ గారి ఇంట 20 మొక్కలు నాటడం గురించి విని ఆనందించారు.

            కలెక్టర్ గారి వద్ద నుండి ప్రశంసా పత్రాన్ని అందుకున్నందుకు వేంకటేశ్వరరావు గారిని కార్యకర్తలందరూ అభినందించారు. 

            శుక్రవారం వేకువ సైతం మనం మరొకమారు కలువదగిన చోటు - వేంకటాపురం ప్రవేశంలోని చెరువు దగ్గరే!

            కానీ కొందరిలోనే

అందరికీ కోరిక ఊరంత బాగుపడాలనే

పచ్చదనం పరవళ్లతో ప్రజలు మురిసి పోవాలనే

కానీ కొందరిలోనే కదలికుంది, తెగువున్నది

స్వచ్ఛ కార్యకర్తలతో సహకరించు గుణమున్నది!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   17.08.2023.