2864* వ రోజు ....           26-Aug-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా!

ధావిధిగానే 2864* వ నాటి శ్రమదానం!

          శనివార (26.8.23) మైనందున పని సమయం కాస్త పొడిగింపు (4.15 - 6.12) తప్ప - అదే పనిచోటు ఆ 26 మంది కార్యకర్తలే - నిర్వహించిన వీధి పారిశుద్ధ్యం! తుఫాన్లూ – మంచులూ – వేడి ఉక్కపోతలూ లేని సాఫీ పద్ధతిలో రెండు చోట్ల జరిగిన రాదారి మెరుగుదల/ సుందరీకరణ సన్నివేశం!

          మొదటి పని చోటు గంగులపాలెం వీధి తొలిమలుపు దగ్గర నలుగురు సుందరీకర్తల మొక్కల కత్తిరింపులు. ఇంకా 10 చెట్లు మిగిలిపోయినవి గాని - యూనిఫారంలు ధరించిన స్కూలు పిల్లల వరుసలా కనిపిస్తున్నది. 2 గంటల పాటు నిలబడో - వంగో కూర్చొనో వాళ్లలా శ్రమిస్తూనే ఉన్నారు!

          ఇక రెండవది NH 216 రహదారి కి ఉత్తర దక్షిణాల పారిశుద్ధ్య/ సుందరీకరణ/ హరితీకరణ చర్యలు. 16 మందీ శ్రమించింది ఈ 60 - 70 గజాల జాగాలోనే! ఉపయోగించిన ఆయుధాలు కత్తీ పార పలుగూ - డిప్ప - గొర్రులే!

          ఇంకో దర్శనీయ ప్రత్యేక విషయమేమంటే - ఇప్పటికే 8 అడుగుల కొక పూల మొక్కలున్నా వాటి నడుమ కూడ - పాదులు త్రవ్వి, ఘాటువాసనవేసే 35 కు పైగా పూల చెట్లు నాటేయడం! చూసే వాళ్లలో కొందరికిది టూమచ్ అనిపించే అవకాశం లేకపోలేదు.

          మాట కొస్తే - కొన్ని అందమైన పూల చెట్లు ఎత్తు కొమ్మల్ని కొన్ని పూలతో సహా ఒకాయన నిర్దాక్షిణ్యంగా కత్తిరించేయడాన్నీ, ఒకామె ఊడ్చిన వీధి భాగాన్నే వేరొరు రెండోమారు కూడ ఊడవడాన్నీ, ఒక్కరు చేయదగ్గ వ్యర్ధాల ఎత్తివేతకే ఇద్దరో ముగ్గురో పూనుకోవడం వంటివి క్రొత్తగా చూసే వాళ్లకి చప్పున అర్థం కాకపోవచ్చు! ఇదొక నిమేనియా అనో అతిగా సుందరీకరణమనో భావించనూవచ్చు!

ఒక ప్రక్క నిర్ణీత పనివేళ - 6.00 దాటినా -

- రహదారి దక్షిణాన - గంగులపాలెం వైపు రోడ్డును శుభ్రపరుస్తూనే ఉన్నారు!

- మురుక్కాల్వ వంతెన మీద 3గ్గురు మట్టి - ఇసుక చట్టుల్ని గోకుతూ ఊడుస్తూ - దాన్నెత్తి గుంటలు పూడుస్తూనే న్నారు!

- ఆ తర్వాత - కాఫీలు ముగుస్తుండగా వచ్చిన సుందరీర్తలు! అందులో ఒక పంతులు (భోగాది) గారు ముమ్మార్లు తన ఊరి స్వచ్ఛ - సుందరోద్యమ నినాదాలు పలికి,

- అంతకు ముందే మాలెంపాటి డాక్టరు గారు గోనె సంచీడు ఎరువులు - పురుగు మందుల్ని పీల్చని పాతిక సొరకాయల పంపకం చేసి....

          రేపటి వేకువ సమయాన కూడ మన కలయిక గంగులపాలెం వీధిలోనే గాని పద్మాభిరామం దగ్గర!

          తెలుసుకొనవా గ్రామసోదర?

కార్యకర్తలు ఉద్యమించక కాళ్లు ముడుచుక్కూరుచుంటే

ఉన్నపళముగ ఊరి లోపల స్వచ్చ శుభ్రమాయమైతే?

అడుగడుగునా పరిఢవిల్లిన హరిత సంపదలుప్తమైతే?

ఉక్కమాటుగ గ్రామమంతా బోసిపోతే - మాసిపోతే?

ఎంత దుర్భర మెంతచీదర - తెలుసుకొనవా గ్రామసోదర?

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   26.08.2023.