2865* వ రోజు ....           27-Aug-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడుతూనే ఉండాలా!

ఆదివారం నాటి మురికి పనులు - @2865*

          27.8.23 వేకువ 4.09 నుండి 6.15 దాక 41 మంది గౌరవనీయులు - కనీసం 3 చోట్ల జరిగిన పనులవి! పిల్లలూ - పెద్దలూ అంత వేకువ వేళ గంగులవారిపాలెం వీధిలో ఒక మంచి పనికి పూనుకొంటే పుట్టుకొచ్చే ఉత్సాహాలూ, 2 గంటల శ్రమ ఫలితాలూ ఎలా ఉంటాయో ఊహించుకోవచ్చు!

          ముందుగా కార్యకర్తల చూపు పడిందీ, ఆవేశం చూపిందీ శాయి నగర్ మొదటి వీధి కాలుష్యాల మీద! సందు మొదట్లో ఉత్తర - దక్షిణాల 70/80 గజాల జాగాలు చాలు - 20 మంది కార్యకర్తలకు తలా గంటన్నర పనికల్పించడానికి!

          దక్షిణం ప్రక్క పిచ్చి తీగలెంతగా అల్లుకు పోయినవంటే అసలక్కడ మురుగు కాల్య ఉందని తెలియనంతగా! ఆ చిన్న వీధిలోనే గంట కాలంలోనే పుట్టుకొచ్చిన వ్యర్ధాలే ట్రాక్టర్ నిండుగా! ఇందులో ఐదారుగురి బట్టలు మట్టి మురుగుల్తో ఖరాబై, తెల్లారాక చూడాలి వాళ్ల ఆకారాలు!

          ఇక రెండవ కార్యరంగం మరొక 60 - 70 గజాల గంగులపాలెం వీధి పడమరగా! మళ్లీ ఇక్కడొక 15 మంది ! పేవర్ టైల్స్ మీద మట్టి గోకి, నిక్కుతున్న గడ్డిని చెక్కి, మితిమీరి పెరుగుతున్న చెట్ల కొమ్మల పని బట్టి, వ్యర్ధాలన్నిటినీ ట్రక్కులో కెక్కించిన వైనం!

          ఇదే వీధిలో దూరంగా - డైరీ కేంద్రం వద్ద ఐదుగురు సుందరీకర్తల ముమ్మరమైన పని! బోగన్ విలియా ముళ్ల - పూల చెట్ల కొమ్మలకి కాస్త క్రమశిక్షణ నేర్పడమే ముఖ్య వ్యాపకంగా గంటన్నర శ్రమదానం!

          ఆదివారమైనందునేమో - ట్రస్టు కార్మికులు కూడ చ్చి కలిసి, మొత్తం పనిమంతుల సంఖ్య 41 గా తేలింది - ఇంకా ఒకటి రెండు చిన్నపాటి పనులు మిగిలినాయి గాని - అసలిప్పటికే ఈ వీధి చల్లపల్లిలోని ఏ బజారు హరిత స్వచ్ఛ సౌందర్యాలనైనా ఛాలెంజి చేస్తున్నది!

          ఇందరు ఔత్సాహిక కార్యకర్తల పారిశుద్ధ్య ప్రయత్నాల్నీ - శ్రమ సౌందర్యాన్నీ - ఏళ్ల తరబడీ దగ్గరగా గమనిస్తున్నది నేను! తొమ్మిదేళ్లుగా ఎక్కడా లేనిది ఈ అద్భుత శ్రమదాన ప్రయోగం చల్లపల్లిలో మాత్రమే ఎందుకు జరుగుతున్నదో పేరు ప్రపంచవ్యాప్తంగా ఎందుకు ప్రస్తావనకొస్తున్నదో ఆలోచించవలసింది ఇంకా ఈ కృషిలో పాల్గొనని గ్రామస్తులు!

          6.30 వేళ గ్రామ స్వచ్ఛ సుందరోద్యమ నినాదాలిచ్చి నేటి శ్రమ వేడుకకు తెరదించింది ధ్యానమండలి తరపున రాయపాటి రాధాకృష్ణగారు

          ఉత్తేజకరమైన సూక్తులు ముక్తాయించినది అడపా గురవయ్య గారు -

          వచ్చే బుధవారం కూడ మన కృషి గంగులపాలెం వీధిలోనే గాని - మంగళవారం సాయంత్రం మన వాట్సప్ లో అది నిర్ధారింపబడుతుంది!

          సంకేతము నేమనవలె?

అస్వస్త గ్రామాలకు అదొక చిన్న ఔషధమా?

కాలుష్యపు కల్లోలం కాలరాయు వివేకమా?

అడగకనే ఊరి జనుల కాహ్లాద ప్రయత్నమా?

స్వచ్ఛోద్యమ చల్లపల్లి సంకేతము నేమనవలె?

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   27.08.2023.