2867* వ రోజు ....           29-Aug-2023

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడుతూనే ఉండాలా!

శివరాంపురం ప్రధాన వీధిలోనే - @2867*

            మంగళవారం(29.8.23) వేకువ కూడ ఇంచుమించు అందరే కార్యకర్తలు, అదే ప్రాత శివరాంపురం ముఖ్య వీధి, అదే ప్రారంభ సమయం, నిన్న తొలగించిన చెట్లూ అవే!

            క్రొత్త శివరాంపురం నుండీ, చల్లపల్లి విజయ్ నగర్ నుండీ ఒక్కొక్కరు నిన్నలేని కార్యకర్తలు. ముగింపు సమయం మాత్రం 7.00 - అనగా 2 ½ గంటల పని! ఇంటి, చెట్ల యాజమాన్యం కూడ వాట్సప్ చిత్రంలో చూడవచ్చు!

            ఇక - పని సంగతి కొస్తే - రంపంతో, కత్తులతో ఎవరేం సాధిస్తున్న వైనం కూడ సదరు వాట్సప్ లోనే తెలియగలదు! వడ్రంగులు, దారు శిల్పులు, సామాజిక స్పృహ ఉన్న వీధి సౌందర్యకారులు ఈ రెస్క్యూ టీంలోనే కనిపిస్తారు!

            వాళ్లకున్నది చేయబోయే ప్రతి పని పట్ల అవగాహన; ప్రాధమికంగా వాళ్లది శ్రమతత్వం; తొమ్మిదేళ్లగా కరకు పనులు చేసీ చేసీ, వీధుల్ని సుందరంగా మార్చీ మార్చీ, రోడ్ల గుంటల్ని పూడ్చీ పూడ్చీ, 30 వేలకు పైగా చెట్లను నాటి సంరక్షించీ, రాటు దేలిన సామాజిక దృక్పధం!

            సదరు సామకూల చింతనం సకల గ్రామ వ్యాప్తం కావాలనీ, ఊళ్లూ - రహదారులూ హరిత - పుష్ప శోభ సంతరించుకోవాలనీ ఇంతగా శ్రమిస్తున్న స్వచ్ఛ కార్యకర్తల మనోరథం ఫలప్రద మవ్వాలని అందరం కోరుకొందాం!

            రేపటి వేకువ చల్లపల్లి వీధి పారిశుద్ధ్య కృషి కోసం మనం కలువదగిన చోటు - గంగులవారిపాలెం, సన్ ఫ్లవర్ కాలనీ రోడ్ల దగ్గరే!

            గెలిచింది సమాజమే

చల్లపల్లి స్వచ్చోద్యమ చారిత్రక సంధ్యలలో

నవ వసంత దీర్ఘ కాల స్తవనీయ క్రీడలలో

గెలుపు కార్యకర్తలదా? మలుపు త్రిప్పినది ప్రజలా?

గెలువ దగినదేదో అది గెలిచింది సమాజమే!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   29.08.2023.