2868* వ రోజు ....           30-Aug-2023

పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడుతూనే ఉండాలా!

వేకువ శ్రమవిన్యాసాల వీక్షణకు ఆహ్వానం - @2868*

          బుధవారపు (30.08.2023) కృషిదానం కూడ నిన్ననే వివరించినట్లు గంగులపాలెం వీధిలోని సన్ ఫ్లవర్ కాలనీ బాట వద్దనే! కర్తలు 26 మందీ, కర్మలు రెండు చోట్లా కలిపి 6070 గజాల పరిధిలోనే!

          ఇన్ని వేల రోజులుగా - ఒక్కో వీధిని ఎన్ని డజన్ల మార్లు బాగుచేస్తున్నా - ఉదయం 6.00 దాటినా పనిచోటు పరిసర నివాసుల సహకారం అంతంత మాత్రంగానే ఉంటున్నా ఈ కర్మవీరులెందుకు మానసికంగా అలసిపోరో, కాలం గడిచే కొద్దీ మరింతగా రాటుదేలుతున్న రహస్యమేమిటో గ్రామస్తులందరం తప్పక శోధించాలి!

          బందరు దారి, అవనిగడ్డ బాటల వంటివైతే ఎన్ని వందల మార్లు ఈ కార్యకర్తల చీపుళ్ల సాంగత్యమనుభవించెనో గుర్తులేదు. ఏ ప్రజల ఉమ్మడి సౌఖ్యం కోసం లక్షల పని గంటలు జరుగుతున్నదో వారి నుండే సౌజన్యం చాలనపుడు విరక్తి చెందక మురుగు గుంటల్లో, శ్మశానాల్లో, ఊరి వెలుపల ఏడెనిమిది రహదార్ల వెంట నిరంతర హరిత - సుందరీకరణలేమిటో గమనించాలి!

ఈ ఒక్కనాటి వేకువ పనుల్నే చూస్తే :

1. శాయి నగర్ మొదటి వీధి మురుగు కాల్వ ఒడ్డున జరిగిన పనినెట్లా వర్ణించాలి? మురుగు మధ్య కూడ పాతిక మెట్ట తామర పూలమొక్కలు నాటుతూ - మురుక్కంపుకు ముక్కుపుటాలదురుతుంటే, రెక్కలొచ్చిన ఏనుగుల్లా దోమలు ముసిరి పీకుతుంటే ఆ ఆరేడుగురి పట్టుదలే తుదకు నెగ్గింది!

2. మాఇంటికీ - ఉత్తరాన క్రొత్త ఇంటికీ నడుమ గడ్డీ, పిచ్చి మొక్కలెలా తొలగిందీ, అక్కడి పనికిరాని ఇసుక గుట్టను ఏడెనిమిది మంది అందంగా సర్దడంలో ఎంత శ్రమించిందీ దగ్గరుండి చూశాను.

          మేము సైతం ఊరి కోసం చెమట ధారలు కార్చుతున్నాముఅని సహర్షంగా - సాధికారంగా చెప్పగల స్తోమత వాళ్లది!

3. ఇక. వంట శ్రీను ఇంటి ఎదుటిలోతైన డ్రైనులో వాలిన ఎండు చెట్లను నరికి, ఒడ్డుకు చేర్చి, కడాన చెత్త బండిలోకి బట్వాడా చేసిన నలుగురి శ్రమనూ ఎలా కొలవాలి?

4 .  మాజీ డి.యస్.పి గారి ఇంటి వెనక ఖాళీ స్తలం ఎండూ పచ్చి గడ్డీ, కొన్ని ముళ్ల కొమ్మలూ ఉంటే ఇంకో ఏడెనిమిది మందికి నచ్చక - ఒంటి కత్తుల వారూ, జోడుకత్తుల వారూ గంట శ్రమించాక ఇప్పుడెంత చక్కగా ఉందో చూడండి!

          ఇవాళ కూడ తుది సమీక్షా సమయం ఆలస్యమయింది - కారణం పనిముట్ల లెక్క వాటిలో ఒక కత్తి తగ్గితే, వెదకడం!

          ఊరుమ్మడి సామూహిక ప్రయోజనం కోసం శ్రమించడంలో ఎంత సంతృప్తి పోగేసుకోకపోతే ఈ తొమ్మిదేళ్ల శ్రమదాన యజ్ఞం జరుగుతుంది?

          సదరు సామాజిక కర్తవ్య దీక్షనూ, ఉక్కు సంకల్పాన్ని గుర్తు చేస్తూ - మాలెంపాటి అంజయ్య నినదించిన ప్రతిజ్ఞలతోనూ

          రేపటి వేకువ కూడ గంగులపాలెం వీధిలోని ఇదే సన్ ఫ్లవర్ బాట కేంద్రంగా శ్రమించాలనే నిర్ణయంతోనూ నేటి వీధి పారిశుద్ధ్య ప్రయత్నం ముగిసింది!

స్వచ్ఛ సుందర కార్యకర్త

స్వార్ధము మానెనూ...... హోయ్!

త్యాగము నేర్చెనూ.... హోయ్!

చెమటలు చిందుతూ... సేవకుడాయెనూ.....!

ఐనా... ఊరు మారుతున్నా - కొందరు జనం మారలేదూ

వాలంటీరు మారలేదూ....అతని దీక్ష తగ్గ లేదూ

తొమ్మిదేళ్ల శ్రమదానంతో - ఊరు నందనంగా మారాలని

వీధులు ఊడ్చెను, డ్రైనులు నడిపెను - శ్మశానాలనూ సంస్కరించెను

పూల తోటలను నాటి పెంచెను......

ఐనా... ఊరు మారెగానీ - కొందరు జనం మారలేదూ

వాలంటీరు మారలేదూ...ఆతని పట్టు సడల లేదూ

ప్లాస్టిక్ ప్రమాదమాపుటకై - రహదారి వనాలను పెంచుటకై

కాలికి బలపం కట్టుకు తిరిగెను - ప్రతి యొక్కరినీ అభ్యర్ధించెను

శ్రమదానానికి ఆహ్వానించెను.....

ఐనా... ఊరు బాగుపడినా - కొందరి మనసు కరగలేదూ

వాలంటీర్లు మారలేదూ వారల ఉడుంపట్టు పోదూ

చల్లపల్లి స్వచ్చోద్యమ చరితను - ప్రపంచమంతా గుర్తిస్తున్నా

ప్రయోజనకరమని అనుసరించినా - కళ్లముందు కనిపించు నిజమ్మును

ఊరుమెచ్చినా వచ్చి పాల్గొనదు

అయ్యో! ఊరు మారుతోందీ... కొందరి మనసు కరగకుందీ

వాలంటీర్లు మారలేదూ- వాళ్లకు విసుగు పుట్టలేదూ

స్వార్థమూ మానెనూ - త్యాగమూ నేర్చెనూ

చెమట చిందించెనూ- ఊరికి సేవకూడాయెనూ

ఐనా.. ఊరు మారుతోందీ- కొందరి మనసె కరగకుందీ

వాలంటీర్లు మారలేదూ- పట్టిన పట్టు వీడలేదు.... !

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

 

   30.08.2023.